విర్డ్... ఇది చిన వెంకన్న ఆసుపత్రి!
ఆర్థోపెడిక్ వైద్యంలో అతిసామాన్యులకీ అరుదైన చికిత్సలు అందిస్తోంది... ‘విర్డ్’! ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా... ఔను, తిరుపతిలోని ప్రఖ్యాత ఎముకల ఆసుపత్రి ‘బర్డ్’ స్ఫూర్తితోనే దీన్ని ఏర్పాటుచేశారు. తిరుపతిదాకా వెళ్ళలేని తెలంగాణ, ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా జిల్లాలవారి కోసం 2007లో ఓ అద్దె భవనంలో మొదలైన ఈ ఆసుపత్రి ఇప్పుడు ఉత్తరాదిరాష్ట్రాలకీ సేవలందించే స్థాయికి ఎదిగింది. ద్వారకా తిరుమల ఆలయం ఆధ్వర్యంలో ప్రయివేటుకి దీటుగా నిరుపేదలకీ శస్త్రచికిత్సలు చేస్తున్న ‘విర్డ్’ విశేషాలివి...
తణుకుకి చెందిన బి.వెంకటేశ్వరరావుకి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆయనకి చికిత్స చేసి ప్లేట్లు వేశారు కానీ వాటివల్ల ఆయనకి ఇన్‌ఫెక్షన్ ఏర్పడింది. అలాగే వదిలేస్తే కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది.
అలాకాకుండా, కాళ్ళలో ఇన్‌ఫెక్షన్ సోకిన ఎముక భాగాన్ని మాత్రమే కోసి తీసేసి... మళ్ళీ అక్కడ ఎముక పెరిగేలా చేసే అత్యాధునిక లింబ్ కన్‌స్ట్రక్షన్ సర్జరీ(ఎల్‌ఆర్‌ఎస్) చేయొచ్చు. దానికి దాదాపు రెండులక్షలు అవుతుందని చెప్పారట ప్రయివేటు ఆసుపత్రుల్లో. అలాంటి చికిత్సని ఉచితంగా చేసింది ‘విర్డ్’! 68 ఏళ్ళ వెంకట్రావుది చింతలపూడి.వృద్ధాప్యం కారణంగా మోకాలిచిప్పలు రెండూ అరిగిపోయాయి. కార్పొరేట్ ఆసుపత్రులకి వెళితే... రెండుకాళ్ళ మోకాలిచిప్పల మార్పిడికి నాలుగు లక్షలవుతుందన్నారు. అదే ‘విర్డ్’కి వస్తే... ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ సర్వీస్ (ఈహెచ్‌ఎస్) కింద ఉచితంగానే చేశారు.
ఆరోగ్యశ్రీ కావొచ్చు, ఈహెచ్‌ఎస్ కావొచ్చు... నిరుపేదలూ మధ్యతరగతివాళ్ళకి వరంలాంటి ఈ పథకాలకింద మిగతా ఆసుపత్రుల్లో చేయని ఎన్నో అరుదైన చికిత్సల్ని ఇక్కడ అందిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, మోకాలి చిప్ప మార్పిడి, తుంటి మార్పిడి, కీహోల్, వెన్నెముక శస్త్ర చికిత్సల వంటివి వీటిలో చెప్పుకోగదగ్గవి. అసలు ఏ కార్డులూ లేకపోయినా, నిరుపేదలకి వీటిని ఉచితంగానే చేస్తున్నారు. మిగతావాళ్ళ నుంచి నామమాత్రపు ఫీజు తీసుకుంటున్నారు. ‘విర్డ్’కి స్ఫూర్తి తిరుపతిలోని ‘బర్డ్’ కావొచ్చుకానీ... అక్కడలేని డయాలసిస్, జనరల్ సర్జరీ సేవలూ ఇక్కడున్నాయి!
ఏమిటీ ‘విర్డ్’!
ఒకప్పుడు- ద్వారకా తిరుమల చుట్టుపక్కల నుంచే కాదు అటు తెలంగాణ, ఇటు ఉత్తరాంధ్ర నుంచి కూడా... సామాన్యులు ఎముకల ఆపరేషన్‌ల కోసం తిరుపతిలోని బర్డ్(బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్)కే వెళుతుండేవారు. వాళ్ళు అంతదూరం వెళ్ళకుండా అలాంటిదాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలనుకున్నారు స్థానిక ప్రముఖులు. అలా ఆరువారాలకోసారి బర్డ్ నుంచే నిపుణుల్ని ఇక్కడికి రప్పించి చికిత్స చేయిస్తుండేవారు. ఇందుకోసం ఓ అద్దెభవనంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. దానికి వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్... క్లుప్తంగా ‘విర్డ్’ అని పేరుపెట్టారు. 2015 దాకా ఇక్కడ చికిత్సలు అలాగే జరిగాయి. ఆ ఏడాదే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని ఆలయానికి దగ్గర తిమ్మాపురంలో సొంత భవనానికి శ్రీకారం చుట్టారు. దీనికి వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) పది కోట్ల రూపాయలు అందిస్తే, చిన వెంకన్నకి చెందిన ద్వారకా తిరుమల దేవస్థానం ఐదుకోట్ల రూపాయలతో పాటూ ఆరు ఎకరాల స్థలాన్నీ కేటాయించింది. నిర్మాణ పనుల్ని రాజు వేగేశ్న ఫౌండేషన్ సంస్థ తలకెత్తుకుంది. 2015 ఆగస్టులో బర్డ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్ గుడారు మెడికల్ డైరెక్టర్‌గా ‘విర్డ్’ తన సేవల్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా జిల్లాలతోపాటూ తెలంగాణ వాసులకీ సేవలందిస్తోంది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచీ వచ్చిన రోగులూ చికిత్స పొందుతున్నారు.
అత్యాధునిక వసతులతో...
ప్రస్తుతం చినవెంకన్న ఆలయం ఈ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. ఏడేళ్ళలోనే ఐదున్నరవేలమందికి ఇక్కడ శస్త్రచికిత్సలు నిర్వహించారు. అవయవాలని శాశ్వతంగా పోగొట్టుకున్నవాళ్ళకి థర్మల్ ప్లాస్టిక్ అవయవాలని ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడో ఫ్యాక్టరీనీ ఏర్పాటుచేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకి దీటుగా ఎముకల శస్త్రచికిత్సలకి వినియోగించే అత్యాధునిక సీఆర్మ్ యంత్రాలూ, క్యూరా ఎక్స్‌రే పరికరాలూ ఉన్నాయి. 12 పడకల ఐసీయూ విభాగం కూడా ఉంది. వైద్యులతోపాటూ 120 మంది సిబ్బంది రోజూ వచ్చే వందలాదిమంది రోగుల బాగోగులు చూస్తున్నారు. రోగుల సహాయకులకీ మూడుపూటలా భోజనం అందిస్తున్నారు. వాళ్ళకి బస-వసతి కూడా ఉచితమే ఇక్కడ!
ఉప్పాల రాజాపృధ్వి, ఈనాడు డిజిటల్, ఏలూరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి