అప్పుడు అందుకే బ్రేక్‌ తీసుకున్నా!

‘డీజే టిల్లు’లో రాధిక పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని... తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి  నేహాశెట్టి. త్వరలో ‘రూల్స్‌ రంజన్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలతో  తెరమీద సందడి చేయనున్న సందర్భంగా తన ఇష్టాయిష్టాలను పంచుకుంటోందిలా...

Updated : 03 Sep 2023 11:06 IST

‘డీజే టిల్లు’లో రాధిక పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని... తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి  నేహాశెట్టి. త్వరలో ‘రూల్స్‌ రంజన్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలతో  తెరమీద సందడి చేయనున్న సందర్భంగా తన ఇష్టాయిష్టాలను పంచుకుంటోందిలా...


అమ్మానాన్నలు ప్రోత్సహించారు

మాది బెంగళూరు. అమ్మ డెంటిస్ట్‌, నాన్న వ్యాపారవేత్త.  నాకో చెల్లి ఉంది. నేను చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలిసేది కాదు.
దాంతో  సినీరంగంలోకి రావాలంటే ఏం చేయాలీ, ఎక్కడినుంచీ మొదలుపెట్టాలీ.. వంటివన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నించేదాన్ని. అలా మొదట కొన్ని ప్రకటనలు చేయడం మొదలుపెట్టా. ఇంటరు చదువుతూనే మోడలింగ్‌ కూడా చేశా.
మిస్‌ సౌత్‌ ఇండియా రన్నరప్‌గానూ ఎంపికయ్యా. దాంతో కన్నడలో ‘ముంగారు మలే- 2’లో అవకాశం వచ్చింది. అదిచూసి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నాకు ‘మెహబూబా’లో అవకాశం ఇచ్చారు. ఆ తరువాతే ‘డీజే టిల్లు’ ద్వారా మరింత గుర్తింపు వచ్చింది. మాది సినిమా నేపథ్యం కాకపోయినా.. అమ్మావాళ్లు నా ఇష్టాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహించినందుకు వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటా.


రెండేళ్లు జీన్స్‌ వేయలేదు

నేను మొదటినుంచీ సందర్భాన్నీ, సౌకర్యాన్నీ బట్టి దుస్తుల్ని ఎంచుకుంటా, అయితే... కాలేజీలో చదువుతున్నప్పుడు ఎందుకో తెలియదు కానీ నాకు చుడీదార్లు తెగ నచ్చాయి. దాంతో కాలేజీకి వెళ్తున్నన్ని రోజులూ... అంటే దాదాపు రెండేళ్లపాటు అసలు జీన్స్‌ వేసుకోలేదు.


ఇంటికెవరు వచ్చినా డాన్స్‌ చేసేదాన్ని 

చిన్నప్పుడు నేను ఏ సినిమా చూసినా... అందులోని డైలాగుల్ని నేర్చుకుని చెప్పడం, డాన్స్‌లు చేయడం ఓ హాబీగా పెట్టుకునేదాన్ని. దాంతో ఇంటికెవరైనా వస్తే చాలు... వాళ్లు అడిగినా, అడగకపోయినా సరే... నేను నేర్చుకున్న డైలాగుల్ని చెప్పేదాన్ని, డాన్స్‌ చేసేదాన్ని.


సినిమానే నా కెరీర్‌ అనుకున్నా

 బహుశా నాకు రెండు మూడేళ్లు ఉన్నప్పుడు అనుకుంటా.. ఓసారి టీవీలో హృతిక్‌రోషన్‌ సినిమాను చూశా. అందులో హృతిక్‌ నటన, డాన్స్‌ చేసిన తీరూ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజునే నేను పెద్దయ్యాక హీరోయిన్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా. అదే విషయాన్ని నా ఫ్రెండ్స్‌కీ, టీచర్లకీ కూడా చెప్పేదాన్ని.


ట్రోలింగ్‌ని పట్టించుకోను

‘డీజేె టిల్లు’లో నేను చేసిన రాధిక పాత్ర కొందరికి నచ్చక నన్ను ట్రోల్‌ చేసినా మనసుకు తీసుకోలేదు. నేనూ నా పని  అందరికీ నచ్చాలని లేదని నాకు నేను సర్దిచెప్పుకుని ఆ ట్రోలింగ్‌ని తేలిగ్గా తీసుకున్నా.


వాళ్లిద్దరే ఆదర్శం

హీరోయిన్లలో నేను శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లను ఆరాధిస్తా. కాస్త పెద్దయ్యేకొద్దీ వాళ్ల సినిమాలు చూస్తూనే నటనలో మెలకువలు నేర్చుకునే దాన్ని. వాళ్లను అనుకరించేందుకు ప్రయత్నించేదాన్ని.


ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా

సినీరంగంలోకి కొత్తగా వచ్చేవారికి సీనియర్లతో నటించాలనే కోరిక ఉంటుంది. నేనూ అందుకు మినహాయింపు కాదు.  ఎప్పటికైనా అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ఆయనతో కలిసి ఓ ప్రకటన చేసే ఛాన్స్‌ వచ్చింది కానీ... ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేది నా కోరిక. చూడాలి మరి.. ఆరోజు ఎప్పుడో...


నటనలో శిక్షణ తీసుకున్నా

‘మెహబూబా’ చేశాక... నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకోవా లనిపించింది. దాంతో... అన్నింటి నుంచీ బ్రేక్‌ తీసుకుని న్యూయార్క్‌ వెళ్లి అక్కడ ఆరునెలలు నటనలో శిక్షణ తీసుకున్నా. ఆ శిక్షణ నాకు ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతోంది.


సానుకూల దృక్పథం ఎక్కువ

ముందునుంచీ నేను ప్రతికూల ఆలోచనల్ని అసలు రానివ్వను. ఎవరైనా అది జరుగుతుందా, కుదురుతుందా... అంటూ దేని గురించైనా సందేహిస్తుంటే.. నేను మాత్రం కచ్చితంగా అవుతుంది.. జరిగి తీరుతుందని చెబుతూ.. అవతలివాళ్లలో సానుకూల దృక్పథాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంటా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..