వీరిది... ఒకే మాట, ఒకే బాట!
గ్రామాభివృద్ధి అంటే పూర్తిగా ప్రభుత్వం పనే అనుకుంటారు చాలామంది. అలా నాయకుల్నీ, అధికారుల్నీ నమ్ముకుని కూర్చోకుండా తమంతటతాముగా ఐకమత్యంగా ఆ బాధ్యతలను భుజానికెత్తుకుంటున్నారీ గ్రామస్థులు. సర్పంచుల మార్గదర్శకత్వంలో తమ ఊళ్లను తామే బాగు చేసుకుంటున్నారు. ప్రగతి పథంలో పరుగులు పెడుతున్న ఆ గ్రామాలకు మనమూ వెళ్లొద్దామా ఒకసారి...
కలిసి సాధించారు
తమిళనాడులోని వీరనంపాళయం... పేరుకే చిన్న గ్రామం కానీ, ఆ చుట్టుపక్కల కొబ్బరిచిప్పల్ని బొగ్గుగా మార్చే కర్మాగారాలున్నాయి. వాటి వల్ల కాలుష్యం, భూగర్భ నీటినిల్వలు తగ్గిపోవడం, నీళ్ల రంగు మారడం వంటి సమస్యలెన్నో ఎదుర్కొనేవారు గ్రామస్థులు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో పదేళ్ల క్రితం వీరనంపాళయం సర్పంచి తంగవేలు గ్రామస్థులతో కలిసి ఆందోళనలు ప్రారంభించాడు. కానీ, పోలీసులూ కర్మాగారాల యజమానులూ అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బంది పెట్టేవారు. అయినా సరే తంగవేలు ప్రజల్లో చైతన్యం నింపి నిరసనలు ముమ్మరం చేశాడు. చుట్టుపక్కల గ్రామస్థులూ తోడుకావడంతో- తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి సమస్య వెళ్లింది. వెంటనే బొగ్గుల కేంద్రాలను మూసి వేసింది. రాజకీయ నాయకులూ, పోలీసుల నుంచి గ్రామస్థులకు సమస్యలు ఎదురైనా వారు ఉద్యమాన్ని వదల్లేదు. చివరికి కర్మాగారాల యజమానులు హైకోర్టుకు వెళ్లడంతో కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ అయింది. ట్రిబ్యునల్ వివిధ కోణాల్లో సమస్యను పరిశీలించి ప్రజలకు న్యాయం చేసింది. గ్రామానికి దాదాపు పది లక్షల రూపాయల పరిహారాన్ని మంజూరు చేసింది. చుట్టుపక్కల ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా గ్రామస్థుల అనుమతి తప్పనిసరి అంటూ ఆదేశాలిచ్చింది. ఆ డబ్బుతో వీరనంపాళయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ భూగర్భ నిల్వలను పెంచుకునే పనిలో పడ్డారు ప్రజలు.
స్మార్ట్‌గా అడుగులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హసుడి ఔన్‌పూర్ నాలుగేళ్ల క్రితం దాకా అసలు అభివృద్ధి చెందని గ్రామాల జాబితాలో ఉండేది. అలాంటిది ఈమధ్య ఏడు జాతీయ, రెండు రాష్ట్రస్థాయి అవార్డులను దక్కించుకుని అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్న హసుడి స్మార్ట్ గ్రామంగా తనదైన ముద్ర వేసిందంటే... అందుకు కారణం సర్పంచి దిలీప్ త్రిపాఠీ. రాజకీయాలతో ఎవరికి వారుగా ఉండే గ్రామస్థుల్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చాడు. పంచాయతీ భవనాన్ని ఆధునికీకరించి- అడ్మినిస్ట్రేషన్‌కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేశాడు. ఊరంతా ఉచిత వై-ఫై, వీధికో సీసీటీవీ కెమెరా, సోలార్ వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఆర్వో వాటర్ ప్లాంట్ తదితర సౌకర్యాలను కల్పించాడు. ప్రతి ఇంటిప్రహరీకి గులాబీ రంగులు వేయించాడు. ఆడపిల్ల పుడితే ఆర్థికంగా ప్రోత్సాహకం అందిస్తూ మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నాడు. గ్రామం చుట్టుపక్కల ఇటుక బట్టీలు ఉండటంతో స్వచ్ఛమైన గాలికోసం నలుమూలలా గాలి శుద్ధి యంత్రాలను అమర్చాడు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి గదికీ ఏసీ పెట్టించాడు. ‘మిషన్ మంగళ’ సినిమా చూసిన త్రిపాఠి ఓ స్పేస్ స్టార్టప్‌ను సంప్రదించి- ఇస్రోసాయంతో ఈ మధ్యనే స్పేస్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశాడు. చుట్టుపక్కల యాభై గ్రామాల్లోని చిన్నారులు అంతరిక్ష వింతల్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళుతున్నారు.
ఊరంతా ఒక్కటిగా
మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్ జిల్లా కరేలి మండలంలో భగువర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ గ్రామంలో సర్పంచి పదవికి ఎన్నిక జరగలేదు. గ్రామస్థులకు తలలోనాలుకగా వ్యవహరిస్తూ వచ్చిన భయ్యాజీని అక్కడి వారంతా గౌరవిస్తారు. ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రజలు భగువర్ అభివృద్ధిలో తమవంతుగా పాలు పంచుకుంటున్నారు. గాంధీ సిద్ధాంతాన్ని నమ్మే భయ్యాజీ గ్రామానికొచ్చే నిధులతో ఇంటింటా ఇంకుడు గుంతలను తవ్వించాడు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. రోడ్లు శుభ్రంగా ఉంచుకుంటూ పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చేలా చూశాడు. అలానే గోబర్ గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసి.. గ్రామంలో చాలా ఇళ్లలో వంట, వీధి లైట్లకు ఆ గ్యాస్‌నే వినియోగించేలా ప్రోత్సహించాడు భయ్యాజీ. దేశంలో ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం మొదలుకాకముందే అక్కడ ఆ వస్తువుల్ని నిషేధించాడు. అలానే గ్రామస్థులు చెత్తతో ఎరువును తయారుచేస్తారు. ఏడాదికోసారి దాన్ని వేలం వేసి వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి వినియోగిస్తారు. ఉమ్మడిగా 35 ట్రాక్టర్లూ, 75 చెరకు మిషన్లను కొనుగోలు చేసుకుని, వాటిని అందరూ వాడుకుంటున్నారు. వందశాతం అక్షరాస్యత ఉన్న భగువర్‌లో పిల్లల కోసం క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం నిర్మించుకున్నారు. అంతేకాదు, ఐకమత్యానికి నిదర్శనంగా వారంతా తమ పిల్లలకు కులాంతర వివాహాల్ని జరిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. భయ్యాజీ మరణించినా వారంతా ఆయన వేసిన బాటలోనే ఇప్పటికీ నడవడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Software Engineer: చంద్రగిరిలో దారుణం.. కారులో వెళ్తుండగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ సజీవ దహనం
-
India News
Kamal Anand: రూ.60 కోసం పదేళ్లు పోరాటం
-
India News
Arvind Kejriwal: మోదీ విద్యార్హతపై అనుమానం పెరిగింది: కేజ్రీవాల్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
India News
వెనుకా ముందు యువతులు.. బైక్‌పై ఆకతాయి చేష్టలు
-
Politics News
Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా