తిమింగలాలను కాపాడుకుందాం..!

మాట్లాడతాయి... పాటలు పాడతాయి... ప్రేమిస్తాయి... బాధపడతాయి... పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. అచ్చం మనుషుల్లాగే... పదిమందితో కలసిమెలసి జీవించడాన్ని ఇష్టపడతాయి. అన్నిటినీ మించి- టన్నులకొద్దీ కర్బనవాయువుల్ని గ్రహిస్తూ మొత్తంగా భూగోళానికి చెప్పలేనంత మేలు చేస్తున్నాయి... తిమింగలాలు!

Published : 18 Feb 2023 23:15 IST

తిమింగలాలను కాపాడుకుందాం..!

మాట్లాడతాయి... పాటలు పాడతాయి... ప్రేమిస్తాయి... బాధపడతాయి... పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. అచ్చం మనుషుల్లాగే... పదిమందితో కలసిమెలసి జీవించడాన్ని ఇష్టపడతాయి. అన్నిటినీ మించి- టన్నులకొద్దీ కర్బనవాయువుల్ని గ్రహిస్తూ మొత్తంగా భూగోళానికి చెప్పలేనంత మేలు చేస్తున్నాయి... తిమింగలాలు! అందుకే వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యం- అంటోంది ఇవాళ్టి ‘వరల్డ్‌ వేల్‌ డే’.

తిమింగలం అనగానే భారీ జలచరం గుర్తొచ్చి ఒళ్లు గగుర్పొడుస్తుంది. దాన్ని దగ్గరగా చూడాల్సి వస్తే భయపడి వణికిపోతాం కూడా. కానీ తరచూ సామాజిక మాధ్యమాల్లో కన్పించే వీడియోలు చూస్తే అవి ఎంత స్నేహ స్వభావులో అనిపిస్తుంది.

పడవలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి పొరపాటున తన ఫోన్‌ నీళ్లలో పడేసుకుంటే తెచ్చిస్తుందో తిమింగలం. ఒక క్రీడాకారుడు సరదాగా బంతిని నీటిలోకి విసిరితే అచ్చం ఇంట్లో పెంపుడు కుక్కలాగే తెచ్చివ్వడమే కాదు, మరోసారి వెయ్యి ఆడుకుందాం... అన్నట్లుగా చూస్తుంది మరోటి.

పడవ దగ్గరగా వచ్చి గోముగా మోరసాచి ముద్దాడమంటుంది ఇంకో తిమింగలం. ఆ దృశ్యాలన్నీ చూస్తుంటే... అసలేమిటీ జంతువులు, మనుషులతో ఇంత స్నేహంగా ఎందుకు ఉంటున్నాయీ అన్న సందేహం వస్తుంది. మనకే కాదు, వీటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం శాస్త్రవేత్తలకీ కలిగింది.

ఒకప్పుడు వెంటాడి, వేటాడిన మనిషే ఇప్పుడు ఆ తిమింగలాలను అపురూపంగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది వారి పరిశోధనల చలవే! అందుకే ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం రండి.

ఎన్నో రకాలు!

సాధారణంగా తిమింగలం అంటే- ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద జంతువూ, క్షీరదమూ అయిన నీలి తిమింగలం గుర్తొస్తుంది. కానీ వాటిల్లోనూ చాలా రకాలున్నాయి. నిజానికి లక్షల ఏళ్ల క్రితం తిమింగలాలు భూమ్మీద నాలుగు కాళ్లతో నడిచిన జీవులనీ, సముద్రంలో వేటకు వెళ్లి క్రమంగా అక్కడే నివసించడానికి అలవాటు పడిపోయాయనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వాటి వెన్నెముక విల్లులా వంగుతోందట. వాటి తోకలు కూడా చేపల తోకల్లా నిలువుగా కాక అడ్డంగా ఉన్నాయట. ఆ శరీర తీరును బట్టీ అవి తినే ఆహారాన్ని బట్టీ వీటిల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. బలీన్‌ వేల్స్‌ అనీ టూత్‌డ్‌ వేల్స్‌ అనీ పిలిచే ఆ రెండు రకాల్లో- నీలి తిమింగలాలూ, ఫిన్‌, హంప్‌బ్యాక్‌ తిమింగలాలూ మొదటి కోవకు చెందుతాయి. ఆకృతిలో పెద్దగా ఉండే వీటికి నోట్లో దంతాలు ఉండవు. సన్నని కుచ్చులాంటి ‘బలీన్‌ ప్లేట్స్‌’ ఉంటాయి. రెండో రకం తిమింగలాలకు దంతాలు ఉంటాయి. డాల్ఫిన్లు, పార్పాయిస్‌లు ఈ కోవకి చెందుతాయి. ఆర్కాస్‌ లేదా కిల్లర్‌ వేల్స్‌ అని పిలిచేవి కూడా డాల్ఫిన్‌ కుటుంబానికి చెందినవే కానీ ఇవి మిగిలిన తిమింగలాల్లాగా చిన్న చేపల్ని కాకుండా పెద్దచేపల్నీ పెంగ్విన్లనీ సముద్రపు తాబేళ్లనీ పక్షుల్నీ వేటాడి తింటాయి. ధ్రువప్రాంతాల్లో మంచు ఫలకాల కింద నీటిలో ఉండే మరో రకం తిమింగలాలూ ఉన్నాయి. నార్వేల్స్‌ అనే వీటికి నోటి దగ్గర ఒక పొడుగాటి కొమ్ము ఉంటుంది. డాల్ఫిన్స్‌కన్నా చిన్నగా ఉండే వాటిని ‘డ్వార్ఫ్‌ వేల్స్‌’ అనీ ‘స్పెర్మ్‌ వేల్స్‌’ అనీ అంటారు. వీటి తలమీద ‘స్పెర్మాసెటి’ అనే నూనె గ్రంథి ఉంటుంది. అందుకే వీటికా పేరు. తెల్లని బెలుగా తిమింగలాలు ముద్దుగా ఉంటాయి. చూడటానికి భారీకాయంతో నీళ్లలో బతికే ఈ తిమింగలాల జీవనశైలి మనిషిని పోలి వుండటమే ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.

అచ్చం మనుషుల్లా...

శరీర నిర్మాణమూ, జీవన విధానాలకు సంబంధించి ఎన్నో విషయాల్లో తిమింగలాలు మనుషుల్ని పోలి ఉంటాయి. వాటిల్లోనూ వెచ్చని రక్తం ఉంటుంది. బిడ్డను కని, పాలిచ్చి పెంచుతాయి. పెద్ద మెదడూ ఊపిరితిత్తులూ ఉంటాయి. అయితే ఊపిరి తీసుకోవడంలో మాత్రం తేడా ఉంది. మనం ఒకసారి శ్వాస లోపలికి తీసుకుంటే అందులో 15 శాతం ఆక్సిజన్‌ను మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. తిమింగలాలు అలా కాదు, అవి ఒక్క శ్వాస నుంచి 90 శాతం ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. అందుకే చాలాసేపు గాలి పీల్చకుండా నీటిలో ఉండిపోగలవు.

ఇక జీవనవిధానం విషయానికి వస్తే- అవి కూడా సంఘజీవులే. ఒక్క బ్లూవేల్‌ మాత్రమే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. మిగిలినవన్నీ గుంపులుగా ఉంటాయి. రకరకాల శబ్దాలూ ఈలలతో మాట్లాడుకుంటాయి. వినిపించిన శబ్దాలను తిరిగి పలికేందుకు ప్రయత్నిస్తాయి. ప్రజల సందర్శనకోసం అక్వేరియాలలో ఉంచినవి తాము రోజూ వినే ‘హలో’, ‘బైబై’... లాంటి మాటలు పలకడం నేర్చుకున్నాయి. తమ సహజమైన బిగ్గర గొంతులకు బదులుగా మనుషుల్లా మార్దవంగా శబ్దాలు చేయడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. బృందంలోని ఒక తిమింగలం గాయపడితే చుట్టూ ఉన్నవి వెంటనే స్పందిస్తాయి. సహానుభూతిని ప్రదర్శిస్తాయి. చనిపోతే విచారిస్తాయి. అంతేకాదు... పరస్పర లబ్ధికోసం ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, వేట నైపుణ్యాలను తోటివారితో పంచుకోవడం, బిడ్డలకు శిక్షణ ఇవ్వడం, ఎక్కడికక్కడ ప్రాంతీయ భాషల్లో సంభాషించడం, సమూహంలో తమదైన గుర్తింపుకోసం పేర్లు పెట్టుకోవడం, తోటిప్రాణులతో స్నేహంగా వ్యవహరించడం, తమ బిడ్డలు కాకపోయినా గుంపులోని పిల్లల ఆలనాపాలనా చూడడం, సమూహంతో కలిసి ఆడిపాడడం... లాంటి లక్షణాలన్నీ కూడా మనుషులవే.

ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీకి చెందిన హార్బర్‌ బ్రాంచ్‌ ఓషనోగ్రఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు మూడు దశాబ్దాల పాటు కష్టపడి తెల్లని బెలుగా తిమింగలాల జన్యు విశేషాలనీ, కుటుంబ జీవితాన్నీ శోధించి తేల్చిందేమిటంటే- వాటి సమాజాలు కూడా మానవ సమాజాల్లాగే ఉంటున్నాయనీ, వారసత్వం, సంస్కృతి, కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నాయనీ. అవి ఆహారంకోసమో, పిల్లల్ని కనడానికో... ఏకంగా ఆరువేల కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లినా దారి తప్పకుండా తిరిగి సొంతగూటికి చేరుకుంటాయి. ఎటు వెళ్లాలో ఎటు వెళ్లకూడదో వాటికి తెలుసు. ఆ సమాచారాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందజేస్తాయి. బంధువర్గంతో సన్నిహితంగా మసలుతాయి. వందల సంఖ్యలో గుంపుగా నివసించడానికి ఇష్టపడతాయి.

ప్రేమజీవులు

మనుషుల్లాగే వీటికీ స్పర్శ ఇష్టం. ప్రేమోద్వేగానికి లోనవుతాయి. నచ్చిన ఆడ తిమింగలం మనసు గెలుచుకోవడానికి పోటీ పడతాయి. శృంగారాన్ని ఆస్వాదిస్తాయి. న్యూయార్క్‌ కాన్సార్టియం ఇన్‌ ఎవల్యూషనరీ ప్రైమెటాలజీకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు పదిహేనేళ్లపాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు. వాటికి భావోద్వేగాలు ఎక్కువనీ అనుబంధాలను పెంచుకోవడానికి ఇష్టపడతాయనీ వారు చెబుతున్నారు.

తిమింగలాలది చాలా పెద్ద గొంతు. నోరు తెరిచి పాడాయంటే వేల కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. మంచి మూడ్‌లో ఉంటే పాటలు పాడుతూ నీళ్లలో రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. ఇవి పాడే పాటలకూ ఒక ప్రత్యేకత ఉంటుందంటున్నారు పరిశోధకులు. అవి ఏ ప్రాంతంలో ప్రయాణిస్తుంటే ఆ ప్రాంతంలో విన్పించే శబ్దాలను బట్టి ట్యూన్‌ మార్చుకుంటాయట. ఆ ట్యూన్‌ని బట్టి ఏ వైపు నుంచి ప్రయాణించి వచ్చాయో చెప్పొచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌కి చెందిన పరిశోధకులు. వివిధ ప్రాంతాలలో వాటి పాటల్ని రికార్డు చేసి విశ్లేషించాక వారీ అభిప్రాయానికి వచ్చారు. వేర్వేరు బృందాలు కలుసుకున్నప్పుడు తమ పాటల్ని ఇచ్చిపుచ్చుకుంటాయి కూడానట.

అమ్మలకు అదనపు బాధ్యత

తిమింగలాలు రెండుమూడేళ్లకు ఒకసారి బిడ్డను కంటాయి. ఆ బిడ్డను పెంచడానికి తల్లి కొన్ని నెలలపాటు తిండీ తిప్పలూ లేకుండా ఉండిపోతుంది. అంతేకాదు, ఆ బిడ్డ పెద్దదై తోడు వెతుక్కునే వరకూ కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కొన్ని తిమింగలాలు మళ్లీ గర్భం ధరించకుండా జాగ్రత్తపడతాయట. వీటి సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమేనట. పునరుత్పత్తి దశ దాటిన తర్వాత చాలాకాలం జీవించే ప్రాణులు మనిషి తర్వాత తిమింగలాలే. 40 ఏళ్లకల్లా తిమింగలాలు పునరుత్పత్తి శక్తిని కోల్పోతాయి. యాభై అరవై ఏళ్ల వయసులో మెనోపాజ్‌కీ గురవుతాయట. ఒర్కాస్‌, పైలట్‌ వేల్స్‌ అనే రెండు రకాల తిమింగలాలపై ఇరవయ్యేళ్లపాటు అధ్యయనంచేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆ వయసులో అవి విశ్రాంతి తీసుకుంటూ తమ అనుభవంతో చిన్నవాటికి మార్గదర్శకులుగా వ్యవహరిస్తుంటాయి. మందలోని తల్లీబిడ్డలకు అండగా ఉంటాయి. వయసులో పెద్దవాటిని తిమింగలాలు గౌరవిస్తాయి. నాయకత్వ బాధ్యతలు అప్పజెబుతాయి.

భూమికి రక్ష..!

ఇంత విలక్షణమైన, సాధు జీవుల్ని మనిషి ఒకప్పుడు వెంటాడి వేటాడేవాడు. ఎక్కువగా తీరప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు ఈ వేటను ఇష్టపడేవారు. ఒక్క తిమింగలాన్ని చంపారంటే ఆ మాంసం మొత్తం గ్రామానికి సరిపోయేది. దాన్ని ఎండబెట్టి, నూనె తీసి రకరకాలుగా వాడుకునేవారు. క్రమంగా అదో లాభసాటి వ్యాపారంగా మారింది. తీరానికి దగ్గరగా కొత్త ఊళ్లు వెలిశాయి. వేటగాళ్లు సంపన్నులూ నాయకులూ అయ్యారు. ఒక దశలో తిమింగలాలను చంపడం అనే వృత్తి చుట్టూనే పలు దేశాల్లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వ్యవస్థలన్నీ తిరిగేవట. ఆరో శతాబ్దంలో మొదలైన ఈ వేట మొన్నమొన్నటిదాకా కొనసాగింది. నిషేధం విధించిన తర్వాత కూడా జపాన్‌, నార్వే, ఐస్‌లాండ్‌ లాంటి దేశాలు పరిశోధన వంకతో బహిరంగంగానే వేట కొనసాగిస్తుండగా, మరికొన్ని దేశాలు రహస్యంగా ఆ పని చేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా ‘వరల్డ్‌ వేల్‌ డే’ నిర్వహిస్తూ తిమింగలాల సందర్శన పర్యటకాన్ని ప్రోత్సహించడం మొదలెట్టాక అందరి దృక్పథాల్లోనూ మెల్లగా మార్పు వస్తోంది.  

ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఒక పరిశోధన మొత్తంగా ప్రపంచ దేశాల్ని భుజాలు తడుముకునేలా చేస్తోంది. ఏనుగు బతికినా పదివేలే, చచ్చినా పదివేలే అని నానుడి. అది ఇప్పుడు తిమింగలాలకు వర్తిస్తుందంటోంది ఈ అధ్యయనం. వేర్వేరు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన ఈ అధ్యయనంలో తిమింగలాలు కర్బనవాయువుల్ని పీల్చుకుని వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తగ్గిస్తున్నాయని తెలిసింది. భూమ్మీద వెలువడుతున్న కర్బనవాయువులను సముద్రాలు పీల్చుకోవడం వల్ల ఆ నీరు వేడెక్కుతోంది. దాంతో వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయనీ, రుతుపవనాల తీరు మారిపోతోందనీ మనకి తెలుసు. అయితే తిమింగలాలు ఎక్కువగా ఉన్నచోట ఈ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో అవి 20లక్షల మెట్రిక్‌ టన్నుల కర్బనాన్ని గ్రహించినట్లు తేలింది. సముద్రం అడుగుకు చేరిన చనిపోయిన తిమింగలాల కళేబరాలు కూడా మరో 62 వేల మెట్రిక్‌ టన్నుల కర్బనాన్ని గ్రహించాయట. వాటి విసర్జితాల్లో ఉండే నైట్రోజెన్‌, ఫాస్పరస్‌, ఐరన్‌ లాంటివి పలురకాల జలచరాలకు పోషకాహారమై సముద్రంలో ఫుడ్‌చైన్‌కి కీలకంగా మారుతున్నాయట.

ఇవన్నీ చూసిన పరిశోధకులు ఇప్పుడు ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు... తిమింగలాలను బతకనిస్తేనే భూతాపం తగ్గి మనిషి మనుగడ సాగించగలడని..!


ఫిబ్రవరి మూడో ఆదివారం... తిమింగలాల కోసం...

వందేళ్ల క్రితం అంటార్కిటిక్‌ నీలి తిమింగలాలే రెండున్నర లక్షల దాకా ఉండేవట. ఇప్పుడవి ప్రపంచం మొత్తమ్మీద మూడు వేలు కూడా లేకపోవడంతో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. 20వ శతాబ్దంలో 30 లక్షల తిమింగలాలు వేటకు బలయ్యాయి. దాంతో అన్ని రకాల తిమింగలాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఇప్పటికీ కొందరు దొంగతనంగా వేటాడటం వల్లా, ప్రమాదాల్లోనూ, కాలుష్యం కారణంగానూ, చేపల వలల్లో ఇరుక్కునీ... ఏటా 1500 దాకా తిమింగలాలు చనిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికీ తిమింగలాలని సంరక్షించడానికీ ఏదో ఒకటి చేయాలని భావించిన ప్రపంచ దేశాలు ఏటా ఫిబ్రవరి మూడో ఆదివారాన్ని ‘వరల్డ్‌ వేల్‌ డే’గా పరిగణించడం మొదలెట్టాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు దేశాల్లో ప్రత్యేకంగా తిమింగలాల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణానికి అవి చేసే మేలు గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.


రోజుకు నాలుగు టన్నుల ఆహారం!

నీలి తిమింగలం ప్రపంచంలోని జంతువులన్నిట్లోకీ పెద్దది. ఎంత పెద్దదంటే- ఒక్కోటీ ఏకంగా 200 టన్నుల బరువుంటుంది. అంటే దాదాపు 30 ఏనుగులతో సమానం. వంద అడుగుల పొడవుండే దీనికన్నా పెద్ద జంతువేదీ ఇప్పటివరకూ భూమ్మీద పుట్టలేదట. మరి ఇంత పెద్ద ఆకారానికి ఆకలి కూడా ఎక్కువే కదా. అదేం తింటుందీ ఎలా ఉంటుందీ అంటే-

* తిమింగలం రోజుకు నాలుగు టన్నుల చేపల్ని గుటుక్కుమనిపిస్తుంది. అలాగని పెద్ద చేపల జోలికి పోదు. నాలుగు అంగుళాలకు మించి పెరగని క్రిల్‌ చేపల్ని తింటుందిది. చేపలున్నచోటికి నిశ్శబ్దంగా వెళ్లి నోటిని తొంభై డిగ్రీల కోణంలో తెరిచి ఉంచుతుంది. దవడ కిందివైపు చీలిక ఉండటంతో విశాలంగా అచ్చం వలలాగా సాగదీయగలదు. ఆ సంగతి తెలియని చేపలు గుంపుగా అటు రాగానే ఒక్కసారిగా మూసేస్తుంది. నాలుకతో చేపల్ని ఒడిసిపట్టి నీటిని బయటకు పంపుతుంది.

* తలమీద ఉన్న రెండు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటుంది. అందుకే మొత్తం శరీరం నీటిలో ఉన్నా అవి మాత్రమే పైకి ఉండేలా ఈదుతుంది. నీళ్లలోపలికి వెళ్లినప్పుడు ఆ రంధ్రాల్ని మూసేస్తుంది. శ్వాస తీసుకోకుండా గంటన్నర వరకూ ఉండగలదు.

* ఇవి నీటిలో తేలియాడుతూ నిద్రపోతాయి. అందుకే నిద్రపోయేటప్పుడు వాటి మెదడులో సగభాగం స్పృహలో ఉండి ఏ ప్రమాదమూ రాకుండా చూసుకుంటుందట. రెండు గంటల తర్వాత ఆ బాధ్యతను మిగతా సగానికి అప్పజెప్పి ఆ భాగం విశ్రాంతి తీసుకుంటుంది. పీల్చుకున్న ప్రాణవాయువుని ఎలా వాడుకోవాలన్న దానిమీదా వాటి శరీరానికి నియంత్రణ ఉంటుంది. అయిపోతోందనుకున్నప్పుడు కొన్ని భాగాలను సుప్తచేతనావస్థలో ఉంచి, అత్యవసరమైన భాగాలకు మాత్రమే ఆక్సిజన్‌ అందేలా చేస్తుందట.

* తిమింగలం చెవిలో ఆర్నెల్లకోసారి వ్యాక్స్‌ పొర పేరుకుంటుందట. నీటిలోనూ దానికి శబ్దం బాగా వినపడడానికి ఇదే కారణం. ఈ వ్యాక్స్‌ పొరల్ని బట్టి వాటి వయసుని లెక్కిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా ఇవి 90 ఏళ్లదాకా బతుకుతాయి.

* ఆకారంలోనే కాదు, శబ్దంలోనూ ఇది ఘనాపాటే. 188 డెసిబుల్స్‌లో ఇది పాడే పాట 500 మైళ్ల దూరానికి కూడా విన్పిస్తుంది. జెట్‌ ఇంజిన్‌ సౌండ్‌ (140) దీనికన్నా తక్కువే.  

* తిమింగలం గుండె ఐదడుగుల పొడవూ నాలుగడుగుల వెడల్పుతో 180 కిలోల బరువుంటుంది.

* ఆడ తిమింగలం పొట్ట కింద తోక దగ్గర గొట్టంలాంటి ఏర్పాటు ఉంటుంది. పిల్ల తిమింగలం ఆ గొట్టంలో నోరుపెట్టి రోజుకు సుమారు 200 లీటర్ల వరకూ పాలు తాగుతుంది.

* వీటికి శుభ్రత కూడా ఎక్కువే. తమ భారీ శరీరమ్మీద చేరే పరాన్నజీవుల్నీ, చర్మంమీద మృతకణాల్నీ వదిలించుకోవడానికి తరచూ రాళ్లకేసి శరీరాన్ని రుద్దుకుంటాయి.


నాడు వేట... నేడు వేడుక

కప్పుడు తిమింగలాలను విపరీతంగా వేటాడేవారు(వేలింగ్‌). వాటి మాంసం తినేవారు. వాటి శరీరం నుంచి తీసిన నూనెని వంటకీ, దీపాలు వెలిగించుకోవడానికీ, సబ్బులూ కొవ్వొత్తులూ సౌందర్యసాధనాలూ తయారుచేయడానికీ వాడేవారు. వాటి చర్మాన్నీ, ఎముకలనీ దుస్తులూ ఆభరణాలూ గొడుగుల తయారీలోనూ చేపల వలల తయారీలోనూ ఉపయోగించేవారు. 18, 19 శతాబ్దాల్లో తిమింగలాల వేట కోట్లాది రూపాయల వ్యాపారంగా ఉండేది. పారిశ్రామిక విప్లవానికి ముందు పలుదేశాల ఆర్థిక వ్యవస్థకు ఇది దన్నుగా ఉండేది. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే తిమింగలాలు అసలు మిగలవేమోనన్న ఆందోళన ఇరవయ్యో శతాబ్దంలో మొదలైంది. 1946లో దేశాలన్నీ కలిసి ‘ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ ఫర్‌ ద రెగ్యులేషన్‌ ఆఫ్‌ వేలింగ్‌’ చట్టాన్ని తెచ్చాయి. 1986లో ఇంటర్నేషనల్‌ వేలింగ్‌ కమిషన్‌ వాణిజ్యంకోసం తిమింగలాలను చంపడంపై కఠిన నిబంధనలు విధించింది. దాంతో క్రమంగా వేట తగ్గింది. మరోపక్క సముద్రంలో ఆడుతూ పాడుతూ తిరిగే ఈ భారీ జలచరాలను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపడం ఎక్కువైంది. మొట్టమొదట 1950లో అమెరికాలోని శాన్‌డీగోలో ఉన్న కార్బిల్లో నేషనల్‌ మాన్యుమెంట్‌ని తిమింగలాలను చూడడానికి అనువైన ప్రాంతంగా ప్రకటించారు. ఆ తర్వాత పడవలో సముద్రంలోపలికి తీసుకెళ్లి చూపించడం మొదలెట్టారు. క్రమంగా ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించిన ‘వేల్‌ వాచింగ్‌’ అనే కార్యక్రమం ఏటా 16 వేల కోట్ల రూపాయల ఆదాయాన్నిస్తూ కొన్నివేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఒక్క అలాస్కాలోనే గతేడాది 850 కోట్లు వచ్చిందట. కనుచూపుమేరా పరచుకుని కన్పించే నీలి సంద్రంలోనుంచి ఒక్కసారిగా ఎగసి అంత పెద్ద శరీరాన్నీ విల్లులా వంచి రివ్వున నీళ్లలోకి మునిగే ఆ దృశ్యాన్ని చూడడం ఎవరికి మాత్రం నచ్చదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..