శ్రీకాళహస్తీశ్వరా!

తెలుగు గడ్డపై పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. చిత్తూరు జిల్లాలో సువర్ణముఖీ నదీ తీరాన గల కాళహస్తిలో శివుడు లింగాకారుడై స్వయంభువుగా వెలశాడు. సృష్టిలో పంచభూతాలకు ప్రతీకలైన పంచలింగాల్లో ఒకటైన....

Published : 10 Jan 2022 01:36 IST

తెలుగు గడ్డపై పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. చిత్తూరు జిల్లాలో సువర్ణముఖీ నదీ తీరాన గల కాళహస్తిలో శివుడు లింగాకారుడై స్వయంభువుగా వెలశాడు. సృష్టిలో పంచభూతాలకు ప్రతీకలైన పంచలింగాల్లో ఒకటైన వాయులింగంగా ఇక్కడి శివలింగాన్ని భావిస్తారు. శ్రీ-సాలెపురుగు, కాళం-పాము, హస్తి-ఏనుగు అనే మూడూ శివభక్తివల్ల మోక్షం పొందిన క్షేత్రంగా ప్రసిద్ధి. శ్రీకాళహస్తి అనగానే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి ధూర్జటి, ఆయన రచించిన శ్రీకాళహస్తి మాహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం గుర్తుకొస్తాయి. భక్తి వైరాగ్య భావనలకు ప్రబల దృష్టాంతంగా నిలిచింది. శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి వివేక పరిపాకానికి దర్పణంగా నిలిచిన రచన.

రాచరిక వ్యవస్థలో మనుగడ సాగించినా, రాయల కొలువులో గౌరవం పొందినా అనంతర పాలకుల అహంకారం, నాటి పండితుల భేషజాలు ధూర్జటికి రోత పుట్టించాయి. అందుకే ‘రాజుల్‌ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు’ అన్నాడు. ‘చదువుల్‌ నేర్చిన పండితాధములు’ అని ఈసడించాడు. ధూర్జటికి భోగాలు అందని మానిపళ్లు కావు. కానీ అందులో సారంలేదని గ్రహించాడు. మోక్షాన్ని కోరుకున్నాడు. శ్రీకాళహస్తీశ్వరుడికి ఆత్మనివేదనం చేసుకున్నాడు. తన దోషాల్ని విన్నవించి ఆత్మ ప్రక్షాళనం చేసుకున్నాడు. సాంసారిక జీవితం పట్ల వైముఖ్యం ప్రదర్శించాడు. ధూర్జటి అంటే పరమేశ్వరుడు. బరువైన జటల సమూహంతో భాసిల్లే దేవుడు. శ్రోత శ్రీకాళహస్తీశ్వరుడు. వక్త కవి ధూర్జటి.

‘శ్రీకాళహస్తీశ్వరా! నా మనసు తరుణుల సౌఖ్యాన్ని, పుత్రమిత్ర సిరులపై వ్యామోహాన్ని వదిలినట్లే ఉంటుంది కానీ వదలదు’ అంటాడు. ప్రతి పద్యంలోనూ కవి లోకానుభవం, అనుభూతి, సత్యసందర్శనం సువ్యక్తమయ్యాయి. ‘అంతా మిథ్య తలంచి చూచిన’ అనే పద్యంలో భారతీయ వేదాంతసారం మొత్తాన్ని కవి హృద్యంగా పొందుపరచాడు. ధూర్జటి వేదవేదాంగాలు చదివాడు. శాస్త్రాల లోతులూ చూశాడు. సాలెపురుగు ఏ వేదాలు చదవలేదని, పాము ఏ శాస్త్రాలూ పరికించలేదని, ఏనుగు ఎక్కడా విద్య నేర్చుకోలేదని, చెంచు బాలుడు తిన్నడు ఏ జ్ఞానం లేని అమాయకుడని వీళ్లంతా అచంచల భక్తివల్లనే జీవన్ముక్తులయ్యారని గ్రహించాడు.

శివనామస్మరణం వల్ల అన్నీ స్వాధీనమవుతాయని విశ్వసించాడు ఈ భక్తకవి. ‘శివ శివ’ అని పలికేసరికి వజ్రం పుష్పంలా, నిప్పు మంచులా, సముద్రం నేలలా, పగవారు స్నేహితుల్లా, విషం అమృతంలా మారడం సాధ్యమని భావించాడు. ఇంద్రియాలు బలమైనవి. ఎంతటి విద్వాంసుడినైనా అవి లొంగదీస్తాయి. ఏ ఇంద్రియంతో ఏం చేసినా అది కర్మ. దానివల్ల పాపం కలుగుతుంది. ఇంద్రియసౌఖ్యం కోసం వెంపర్లాడటమంటే పాపం మూటగట్టుకోవడమేనని హెచ్చరించిన ధూర్జటి, అలాంటి ఇంద్రియాల్ని ఎందుకు సృష్టించావయ్యా అని పరమేశ్వరుణ్ని ప్రశ్నించాడు.

ఆత్మవంచన లేని అంతశ్శుద్ధితో ముక్తికాంతాసమ్మిళితంగా ఈ శతకం రచించాడు ధూర్జటి. నిశ్చలభక్తుడైన ఈ కవి శివుణ్ని సర్వస్వంగా భావించి ‘నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్‌’ అన్నాడు. కవితాకళను దివ్యార్చన కళగా చేశాడు ధూర్జటి. తెలుగువారికి నిత్యపారాయణ యోగ్యం ఈ శతకం.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని