Published : 18 Jan 2022 00:26 IST

వేమన్న ఏమన్నాడు?

లోకంలో నీతి లేకుంటే రీతి లేదు. రీతి లేకుంటే ఖ్యాతి లేదు. ఖ్యాతి లేకుంటే జాతి ఉండదు. సామాజిక జీవనంలోని అంతస్సూత్రం ఇది. నీతి అనగానే గుర్తుకువచ్చేవాడు వేమన్న. అందుకే ‘వేమన్న చెప్పిందే వేదం’ అనే ప్రసిద్ధి అతడి మాటలకు అతికినట్లు సరిపోతుంది. మార్గదర్శకులైన మహాకవులకు దేశ కాలాల విభజన రేఖలు వర్తించవు. వేమన్న అందరివాడు. వేమన్న మానవజాతి అభ్యుదయం కోసం ఎంత తపించాడో తెలుసుకోవాలంటే అతడి శతక పద్యాలను చదవవలసిందే. ‘వేమన్న ఏమన్నాడు?’ అని ప్రశ్నించుకుంటే ఎన్నో సమాధానాలు లభిస్తాయి. ఆయన ఎంచుకున్న ఛందస్సు ‘ఆటవెలది’!

లోకంలో పైపైన చూస్తే ఉప్పు, కర్పూరం ఒకే విధంగా కనబడతాయి. వాటిని చక్కగా పరిశీలించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. ఇదే చెబుతూ- పురుషులెందరో ఉండవచ్చు కానీ పుణ్యాత్ములైన పురుషులు వేరుగా ఉంటారని  అరటిపండు ఒలిచి చూపించినట్లు చెప్పాడు వేమన్న. మనిషికి పిరికితనం పనికిరాదు. దానివల్ల అతడి జీవనం భారంగా మారుతుంది. పైకి మేడిపండులా మేలిమిగా కనబడవచ్చు. కానీ పొట్టవిప్పి చూస్తే పురుగులే ఉంటాయి. పిరికివాడు మేడిపండులాంటి వాడు. అతడి ముఖాన్ని చూసి, మనసులోని విషయాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదంటాడు వేమన్న.

మనిషి మనసు మాత్రమే కాదు. మాటతీరు కూడా ముఖ్యమే. లోకంలో లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు కల్పించి బీరాలు పలికేవారు ఎక్కువగా కనబడతారు. వారి మాటకారితనాన్ని చూసి, అవన్నీ నిజమనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. అల్పులు (నీచస్వ భావులు) ఎప్పుడూ ఆడంబరంగానే మాట్లాడుతుంటారు. సజ్జనులు (ఉన్నత స్వభావులు) ప్రసన్నంగా, ప్రశాంతంగా మాట్లాడతారు. అల్పులు కంచువంటివారు. కంచును కర్రతో కొడితే పెద్దగా ధ్వని వినబడుతుంది. కనకాన్ని కొడితే ఏ చప్పుడూ రాదు. కనకానికి ఉన్న విలువ కంచుకు లేదుకదా? కంచు, కనకం ఒకటి కావు. దేని విలువ దానిదే. కనకానికి విలువ అధికం. ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలంటాడు వేమన్న.

సంకుచితమైన బుద్ధి ఎప్పటికైనా ప్రమాదకరమే. మనిషి మనసు విశాలంగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి. అందరి బాగును కోరుకోవాలి. లోకంలో కొందరి తీరు విరుద్ధంగా కనబడుతుంది. అల్పబుద్ధులైనవారు అధికార పదవులలో తిష్ఠవేసి, మంచివాళ్లను తరిమికొడుతున్నారు. ఇదేమి నీతి అని ప్రశ్నిస్తాడు వేమన్న. కుక్కకు చెప్పును కొరికే నీచస్వభావం ఉంటుంది. అలాంటి కుక్కను కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా, దాని స్వభావాన్ని మరువదు. దానికి చెరకు తీపి కంటే చెప్పును కొరకడమే ఇష్టంగా ఉంటుంది.

లోకం కుత్సితులు (చెడుబుద్ధి కలవారు) ఊరకే ఉండరు. వారు గుణవంతుల మనసులలో విషభావాలను నింపి, చెడగొడుతుంటారు. చెదపురుగులు ఎంత పెద్దచెట్టునైనా తొలిచివేసి, పాడుచేస్తాయి. గుణవంతులు మహావృక్షాల్లా ఎందరికో ఆశ్రయం ఇస్తూ, అందరినీ సేదదీర్చుతూ,  నీడను, తీయని ఫలాలను ప్రసాదిస్తుంటారు. కుత్సితుల పట్ల మంచివాళ్లు అప్రమత్తంగా ఉండాలి.

మంచి కొంచెం అయినా బహుఫలాల్ని ఇస్తుంది. మర్రిచెట్టు ఎంతో పెద్దగా ఎదుగుతుంది. కానీ అంత పెద్ద చెట్టు కూడా ఒక చిన్న గింజనుంచే పుట్టిందనే సత్యాన్ని మరువరాదు. ఇలా వేమన్న పలికిన మాటలు సమాజానికి బంగరు బాటలై, జనుల హృదయాలలో చెరగని ముద్రవేశాయి!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని