Published : 17 May 2022 00:16 IST

దృష్టికోణం

కసారి ఓ సంస్కృత పండితుడు కబీర్‌ దగ్గరికొచ్చి ‘ఏం చేస్తున్నారు ప్రస్తుతం’ అని అడిగాడు. ‘మనసును ప్రాపంచిక విషయాలనుంచి వేరుచేసి భగవంతుడి పాదపద్మాలకు అతికిస్తున్నాను’ అని జవాబిచ్చారాయన. ఇదే ఏకాగ్రత లేదా ధారణ... మనసును ఒకే ఆలోచనపై ఉంచడం. వేదాంతులు మనసును ఆత్మ పైన నిలుపుతారు. హఠయోగులు, రాజయోగులు వారి దృష్టిని ఆరు చక్రాల పైన, శక్తి కేంద్రాల పైన కేంద్రీకరిస్తారు. భక్తులు దృష్టిని తమ తమ ఇష్టదేవతల పైన లగ్నం చేస్తారు.

అభిలషించేవారికి ఏకాగ్రత ఎంతో అవసరం. దృష్టి నిలిపేటప్పుడు మనసులోని విభిన్న కిరణాలు ఒక చోట కేంద్రీకృతమవుతాయి. మనసు ఎగిరిపడదు. గాఢమైన ఏకాగ్రత ఉన్నప్పుడు శారీరక స్పృహగానీ, పరిసరాలను పట్టించుకోవడంగానీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఏకాగ్రతతో ఉంటారు. ఆధ్మాత్మిక లక్ష్యాల్లో ఏకాగ్రత అనంత స్థాయిలో అవసరమవుతుంది.

చదరంగంలాంటి ఆటలకు ఏకాగ్రత ఎంతో అవసరం. ఏకాగ్రత అనేక రకాలుగా వ్యక్తీకరణం చెందుతుంది. తీవ్ర భావపరంపరగా శక్తి వెలువడటం సాధుమార్గంగా గోచరిస్తుంది.

ఉన్నతస్థాయుల్లో ఏకాగ్రత ఎంతో లోతుగా ఉండి, అభ్యాసంలో ప్రశ్నలకందని స్థాయికి చేరుతుంది. యోగిని పూర్తిగా అతడి ఏకాగ్రతతోనే గుర్తిస్తారు.

ఒక విషయం అధ్యయనం చేయాలనే కోరిక ఉంటే, ముందుగా దాన్ని ఇష్టపడాలి. ఆ ఇష్టమే లేకపోతే దానిపట్ల శ్రద్ధ ఉండదు. ఏకాగ్రతకు చోటుండదు. ఇక ఆనందం ఎక్కడుంటుంది? ఏకాగ్రత కుదరడం లేదని చాలామంది చెప్పడానికి అదే ప్రధాన కారణం. ప్రాథమిక సమస్య ఇష్టం లేకపోవడం. మనిషి దేన్నైతే విని అవగాహన చేసుకోవాలనుకుంటాడో దానిలో అతడు లీనమైపోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినికిడి కళ గురించి ఉపదేశిస్తాడు. మనసుతో విని, తాను చెప్పేదాన్ని ఆకళించుకొమ్మంటాడు.

తేనెటీగ ఒక చోటు నుంచి మరో చోటుకు ఎగురుతూ, నచ్చిన పూలను ఎంపిక చేసుకుని వాలుతుంది. అది ప్రయాణించే బాటలో ఎన్నో ముళ్లుంటాయి. అవరోధాలుంటాయి. ఎంతో నేర్పుగా వెళ్ళి పూలను ఎంపిక చేసుకుని, నిరంతర శ్రమతో ఆ అమృతాన్ని సేకరిస్తుంది. అనుకున్న లక్ష్యం పూర్తికాగానే, క్షణం కూడా వృథా చేయకుండా నేరుగా తేనెతుట్టెను చేరుకుంటుంది. సేకరించి తెచ్చిన తేనెను భద్రపరుస్తుంది. దీనికి ఎంతో ఏకాగ్రత అవసరం. చలించకుండా ఉండే శ్రద్ధ, పట్టుదల అవసరమన్న పాఠాన్ని మనుషులు తేనెటీగ నుంచి నేర్చుకోవాలి.

ఆ సృష్టికర్త ఈ భూమ్మీదకు ఇంతమందిని పంపించాడంటే దానికి కారణం లేకపోలేదు. ఆధ్యాత్మిక మూర్తిమత్వానికి కావాల్సిన పరిపూర్ణతను సాధించడానికి ఎదురయ్యే తీపి చేదు అనుభవాలను అసాధారణమైన స్ఫూర్తితో ఎదుర్కొంటూ, ఎంతో ఎరుకతో ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి. లక్ష్యం ఏదైనా పూర్తి ఏకాగ్రత అవసరం. మార్గంలో ధ్యానభంగం కలిగించే పరిస్థితులు ఎదురుకావడం సహజం. అనేకానేక ఆకర్షణలకు లోనై వాటివైపు అనవసరంగా దృష్టి మళ్ళుతుంటుంది. మనిషి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓర్పు, కరుణలతో ఉంచడానికి- ప్రతీకారం వ్యతిరేక భావనల్లాంటివి లేకుండా క్షమాగుణం కలిగి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలని సృష్టికర్త ఉద్దేశం.

సూదిలో దారం ఎక్కించాలంటే ముందు విడివిడిగా కనిపించే దారపు పోగులను ఒకటిగా చేసి కొనదేరేలా చేస్తాం- సులభంగా దారం ఎక్కించడానికి. అదే విధంగా విచ్చలవిడిగా ఉండే కోరికల్ని తొలగించుకుని, అహంకారాన్ని వదిలిపెట్టి, వినమ్రతతో మనసును దైవంపైన లగ్నం చేయడమే- ఏకాగ్రత.

- మంత్రవాది మహేశ్వర్‌

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని