నామస్మరణ

‘వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు తదితరాల పరిజ్ఞానం లేకపోయినా భగవంతుణ్ని కనుగొనడానికి సులభమైన మార్గం నామస్మరణ’ అని పెద్దలు చెప్పిన మాట. కలికాలంలో స్మరణ వల్లనే ముక్తి

Updated : 13 Jun 2022 05:44 IST

‘వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు తదితరాల పరిజ్ఞానం లేకపోయినా భగవంతుణ్ని కనుగొనడానికి సులభమైన మార్గం నామస్మరణ’ అని పెద్దలు చెప్పిన మాట. కలికాలంలో స్మరణ వల్లనే ముక్తి కలుగుతుందన్నది వైదిక వచనం. అతి సులభమై ఎల్లప్పుడూ స్మరించదగ్గ భగవంతుడి నామమే ఆ జగన్నాథుణ్ని చేర్చే ధన్యోపాయమని ఆధ్యాత్మిక వేత్తల మాట. ఒక్కొక్క దేవతను ఒక్కొక్క రకమైన నామంతో స్మరించే అవకాశం కల్పించారు మన పెద్దలు. శివ ధ్యానానికి పంచాక్షరి, విష్ణు ధ్యానానికి అష్టాక్షరి, రాముణ్ని తారక మంత్రంతో, స్త్రీ దేవతలను స్తోత్రాలతో ఇలా అనేక రకాల స్మరణ మార్గాలున్నాయి.

‘విడువక స్మరించే భగవన్నామం భక్తి ముక్తి దాయకం’ అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. సర్వవేళలా నమశ్శివాయ నామం మనల్ని వెన్నంటి కాపాడుతుందని కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి చెప్పాడు.

‘శివ శివ శివ అనరాదా! ఓరి భవ భయ బాధలనణచుకోరాదా’ అని ఒక కీర్తనలో నామస్మరణ గొప్పతనాన్ని చెప్పాడు త్యాగరాజు. ఆ జగదభి రాముడి మీద ఎన్నో కీర్తనలు రచించిన ఆయన 96కోట్ల రామ తారకమంత్ర జపం పూర్తయ్యేసరికి లక్ష్మణ సమేతంగా రాముడు విశ్వామిత్ర యాగసంరక్షణ చేసిన నాటి రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆ తారకమంత్ర స్మరణతోనే కంచర్ల గోపన్న రామదాసుగా మారాడని చరిత్ర కథనం.

‘పండిత పామరులను సైతం భక్తి మార్గం వైపు మళ్ళించే సాధనం నామస్మరణే’ అని భజన సంప్రదాయం చెబుతోంది. అందుకే ఓ చిన్న రామ మందిరం ఉన్నా గ్రామ ప్రజలంతా అక్కడకు చేరి భగవంతుని కీర్తిస్తూ భజన పేరుతో భగవన్నామ స్మరణ చేస్తారు. జానపద వాఙ్మయంలోనూ నామస్మరణకు పెద్దపీట వేశారు ఆనాటి ప్రజలు.

విష్ణువు అవతార మహిమలు స్మరిస్తూ ‘రామా నీ మహిమలెన్న తరమా?’ అంటూ రామనామాన్ని వివిధ స్థాయులలో స్మరణ చేస్తారు భజన కూట సభ్యులు.

నిరంతర ప్రభుభక్తి పరాయణుడైన ఆంజనేయుడు రామ నామ స్మరణతోనే రాముడికి నమ్మినబంటు అయ్యాడు. చుట్టూ పుట్టలు వ్యాపించినా రామ నామ స్మరణ వీడని వాల్మీకి కావ్యరచనకు ఆద్యుడయ్యాడు. రామ నామస్మరణ లోని పారమార్థిక చింతన, వేదాంత తత్వం కలగలిపి ఎన్నో భజన కీర్తనలు రచించిన తూము నరసింహదాసు ‘భజన చేసే విధము తెలియండీ... జనులార మీరు, నిజము కనుగొని మోదమందండి’ అంటాడు ఒక భజన సంకీర్తనలో. ‘రామ నామామృతంబే నీకు రక్షణం బనుకోవే మనసా’ అని సెలవిచ్చాడు మరో నామ సంకీర్తనలో. ‘జగజ్జననికి నామ పారాయణప్రీత’ అని పేరు. లలితా సహస్రనామాలలో అది ఒక నామం. ‘మనసు నాయందుంచి ఎవరు స్మరిస్తారో వారిపై నేను దృష్టి ఉంచుతాను’ అని ఆ దేవి చెప్పినట్లుగా దేవీభాగవతం వల్ల మనకు తెలుస్తోంది.

ఎందరో వాగ్గేయకారులు నామ స్మరణ విశిష్టతను తమ కీర్తనలలో తెలియజెప్పారు. ‘గోవింద గోవింద యని కొలువరే గోవిందా యని కొలువరే’ అంటూ గోవింద నామస్మరణే ముక్తి మార్గమని అన్నాడు అన్నమయ్య. ‘నంద కుమారుడైన కృష్ణుని దివ్యనామాన్ని విడువక మనసు నిలిపి మరల మరల స్మరించు’ అంటూ ‘స్మర వారం వారం చేతః స్మర నందకుమారమ్‌’ అనే ఉత్సవ సంప్రదాయ కీర్తనలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అంటారు.

ఇలా స్మరణ మార్గంలో పయనించి భగవంతుని కనుగొన్నవారు, చూసిన వారు, ఆయన్ను చేరుకున్న భక్తులు అనేకులు మనకు చరిత్రలో కానవస్తారు.

- గంటి ఉషాబాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని