జ్ఞాపకాల జీవితం

విత్తనం- చెట్టు జ్ఞాపకం. యుగాలు గడచినా దానికి మతిమరుపు ఉండదు. అది అదే చెట్టులా అంకురిస్తుందే తప్ప మరో వృక్షంలా మొలకెత్తదు. మేతకు వెళ్లిన పశువులు సాయంత్రంకల్లా యజమాని ఇంటికే

Published : 15 Jun 2022 01:13 IST

విత్తనం- చెట్టు జ్ఞాపకం. యుగాలు గడచినా దానికి మతిమరుపు ఉండదు. అది అదే చెట్టులా అంకురిస్తుందే తప్ప మరో వృక్షంలా మొలకెత్తదు. మేతకు వెళ్లిన పశువులు సాయంత్రంకల్లా యజమాని ఇంటికే తిరిగివస్తాయి తప్ప ఇంకో గృహం గుమ్మం తొక్కవు. లేగదూడ తల్లి ఆవును గుర్తుపడుతుంది. పసిపిల్లలకూ అమ్మ ఎవరో తెలుస్తుంది. జన్మ ఇచ్చిన తల్లిగారింటికి చేరాలని పరితపించే వాన చినుకులు, పిల్లకాలువలు, వాగులు... అన్నీ ముందుగా నదిని చేరుకుంటాయి. ఎందుకంటే, సాగరం ఉండే చోటు నదులకే బాగా తెలుసు కాబట్టి.

జ్ఞాపకశక్తి చైతన్యంలో ఒక భాగం. అందుకే, చైతన్య స్రవంతికి మరుపు అనేది ఉండదు. మట్టిలో ఏ విత్తనం నాటితే ఆ రకం ఫలాన్నే ఇస్తుంది. మనసూ అంతే. అది చైతన్యం అంశ.

మనిషి ఏ పని చెయ్యాలన్నా దానికి ముందు బాగా ఆలోచిస్తాడు. ఆ తరవాతే ఆచరణ (పని చేయడం) మొదలుపెడతాడు. అందుచేత ‘ఆలోచన’ అనేది లేకుండా మానవ మనుగడ ఊహించలేం. అది (ఆలోచన) లేకపోతే మనిషి జీవితం అగమ్యగోచరం. జంతు స్థితి నుంచీ మనిషిగా తీర్చిదిద్దింది ‘ఆలోచనా ప్రక్రియే’. లోతైన ఆలోచనే మనిషిని ‘దేవుణ్ని’ చేసింది. ‘దేవుడు’ అంటే ఎవరు? సృష్టికర్త. నూతన వంగడాలు కనిపెట్టిన సృష్టికర్త ఎవరు? మనిషి. ఉన్నచోటే ఉండి విశ్వంలోని అణువణువునీ వీక్షించే దూరదర్శనులు, దూరశ్రవణాలు తయారుచేసింది ఎవరు? మనిషి. తన లోపలి మార్మికతను ఎరిగి తన అంతరంగ సామ్రాజ్య నేతను కనుగొన్న రుషి ఎవరు? మనిషి. అందుకనే మానవుడే మాధవుడు అన్నారు. ఇంతటి మహిమాన్విత, మహత్తరమైన ఆలోచనకు పురుడు పోసే మాతృకలే- జ్ఞాపకాలు. గతంలోంచి ప్రస్తుత క్షణానికి తిరిగివచ్చే జ్ఞాపకాల వరదే- ఆలోచన. మనసులోని జ్ఞాపకాలు ఆలోచనలవుతాయి. అవే తలంపులు స్మృతులుగా స్థిరపడతాయి.

‘గతం’ అంటే ఏమిటి? గడచిపోయిన ‘కాలం’ మాత్రమే అనుకుంటాం. కానీ గతం అంటే జ్ఞాపకాల ఖజానా. అనేక అనుభవాల భాండాగారం. జ్ఞాపకం మానసికమైనది మాత్రమే కాదు. అది సూక్ష్మస్థాయి శరీర తత్వానిది కూడా. తరాలనాటి తాతముత్తాతల పోలికల్నీ ముందు తరాల వరకూ మోసుకుపోతుంది.

విధి వంచితులు, బాధాతప్త హృదయులు బతుకంతా కుమిలిపోతూంటారు. మతిస్థిమితం లేని పిచ్చివాడు తనలో తానే మాట్లాడుకుంటాడు. అది అతడి తలలో మిగిలిన జ్ఞాపకాల పోరు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాల్లో పుస్తకాలు తెరిచి చదివేదంతా గతం తప్ప మరేమీ కాదు. గతమంతా ఒక సామూహిక జ్ఞాపకం. అనంత జ్ఞాననిధి.

వయోజనులు బంగారు బాల్యాన్ని తలచుకుంటూ శేషజీవితం హాయిగా గడిపివేస్తారు. యువకులు బంగారు భవిష్యత్తును కలగంటూ ఉత్సాహంతో అడుగులు వేస్తారు. తాత్విక కోణం దృష్ట్యా ఇరువురూ చేసేది ఒక్కటే. అది జ్ఞాపకాల నెమరు. ఆనందం- బాల్యంలో ఎక్కువ, వృద్ధాప్యంలో తక్కువ. కారణం, జ్ఞాపకాల భారం- పిల్లలకు తక్కువ. వృద్ధులకు ఎక్కువ. ఎల్లవేళలా మనిషి ఆనందం కోరుకోవడానికి అసలు కారణం- ‘బ్రహ్మానందం’ మూల జ్ఞాపకం కావడమే.

- మునిమడుగుల రాజారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని