Antaryami: నిరంతర అభ్యాసం

మనం చేసే ప్రతి పనీ సరోవరం ఉపరితలంపై సంచరించే అల వంటిది. అల క్షణాల్లోనే అదృశ్యమవుతుంది. మనసులో తలెత్తే ఆలోచనలు మనం చేసే పనిలాగే క్షణభంగురాల్లా  అనిపిస్తాయి. కానీ, లోపలి

Updated : 01 Aug 2022 05:45 IST

మనం చేసే ప్రతి పనీ సరోవరం ఉపరితలంపై సంచరించే అల వంటిది. అల క్షణాల్లోనే అదృశ్యమవుతుంది. మనసులో తలెత్తే ఆలోచనలు మనం చేసే పనిలాగే క్షణభంగురాల్లా  అనిపిస్తాయి. కానీ, లోపలి పొరల్లో అవి సంస్కార రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. అనేక సంస్కారాల తుది రూపమే ఆధ్యాత్మిక ఔన్నత్యం.

అభ్యాసం మనిషి స్వభావంలోనే ఉంది. ఒక కొత్త అలవాటును అలవరచుకోవడానికి దృఢమైన సంకల్పం కావాలి. చేపట్టే పని ఏదైనా అభ్యాసం లేకపోతే నైపుణ్యం లోపిస్తుంది. అప్పుడు భయం మనసులో చొరబడి సంకల్పాన్ని అస్థిరపరుస్తుంది.
గురుకులంలో ద్రోణాచార్యుడి వద్ద పాండవులు కౌరవులు విలువిద్య అభ్యసించారు. ఓ రోజు ద్రోణుడు శిష్యుల విద్యను పరీక్షించదలచి దూరంగా ఓ నమూనా పక్షి ఉంచాడు. దాని కంటికి గురిపెట్టి బాణం వెయ్యాలని యుధిష్ఠిరుణ్ని ఆదేశించాడు. ఈ సమయంలో నీకు ఏమి కనిపిస్తున్నదని అడిగాడు. పక్షి కనిపిస్తోందన్నాడు యుధిష్ఠిరుడు. నీకు విలువిద్యలో అభ్యాసం ఇంకా అవసరం వెళ్ళమన్నాడు. అలాగే మిగిలిన వారంతా పరీక్షలో విఫలమయ్యారు. చివరికి అర్జునుడి వంతు వచ్చింది. తనకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోందని చెప్పాడు. వెంటనే బాణం సంధించమని ఆదేశించి ఆశీర్వదించాడు ద్రోణుడు. గురితప్పని ధనుర్ధారిగా అర్జునుడు ఎనలేని కీర్తి గడించాడు.

ప్రతిరోజూ ఉదయం చన్నీటితో స్నానం చేస్తున్నప్పుడు ఒక క్లిష్టమైన గణిత సూత్రమో, శ్లోకమో, సంగీతమో సాధన చేయవచ్చు. అభ్యాస సిద్ధికోసం నిరంతర సాధనకు పనికివచ్చే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి. అప్పుడే నిష్ణాణత సిద్ధిస్తుంది. నిరంతర అభ్యాసం వల్ల మనకు తెలియకుండానే ఆమూలాగ్ర పరివర్తన వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన.

కేవలం భావోద్వేగాలతో విజయం వరించదు. ఈ తరహా ఉద్వేగాలు దుర్బల మనస్కుల్లో అధికంగా ఉంటాయి. దక్షిణ గోగ్రహణ సమయంలో కౌరవుల మీద యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికాడు ఉత్తరకుమారుడు. తీరా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టగానే భయానికి లోనయ్యాడు. చివరికి బృహన్నల రూపంలో ఉన్న రథసారథి అర్జునుడు గాండీవంతో యుద్ధం చేసి విజయం సాధించాడు.

ఆత్మ విమర్శ లేదా సింహావలోకనం అత్యుత్తమమైన అభ్యాసం. మృగరాజు తరచూ తన ముఖాన్ని వెనక్కు తిప్పి నడిచి వచ్చిన మార్గాన్ని చూసుకుంటుంది. దీన్ని సింహావలోకనం అంటాం. ప్రతి దినం మన నిత్యకృత్యాలను రాత్రి నిద్రించే ముందు సింహావలోకనం చేసుకోవడం అభ్యాసం చేయాలి. దీనివల్ల స్వీయ నియంత్రణ, నిబద్ధత తద్వారా ఉన్నత వ్యక్తిత్వం సిద్ధిస్తాయి. అద్దంలో ప్రతిబింబం చూసుకుంటూ బాహ్య సౌందర్యానికి మెరుగులు దిద్దినట్టు, అంతరంగంలో చేసుకునే ఆత్మవిమర్శ వల్ల సద్గుణాలు సొంతమవుతాయని బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ సూచించాడు.

మోయలేని బరువులు తలకు ఎత్తుకుంటే పరాజయం పాలవుతాం. అది మరో ప్రయత్నంలో ఉత్సాహ శూన్యుణ్ని చేస్తుంది. తొలి ప్రయత్నంలో లభించే యశస్సు మలి ప్రయత్నానికి ప్రేరణ కావాలి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే విధివాదులుగా ఉండకూడదు. అభ్యాసం, ప్రయత్నం ద్వారా దేనినైనా సాధించగలమనుకునే సాధకులుగా ఉండాలి. ఆరువంతుల మానవ ప్రయత్నం, ఏడో వంతు దైవ కృప అన్నారు పెద్దలు. అభ్యాసం ద్వారా మనలోనే దాగి ఉన్న అనంత శక్తిని జాగృతపరచే సాధన చేయాలి. అభ్యాసం ఆధ్యాత్మిక ప్రయాణానికి దోహదపడే నిరంతర స్రవంతి.

- ఎం.వెంకటేశ్వరరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని