తపోధనులు

పూర్వకాలం మునులు, రుషులు మొదలైనవారు నదీతీరాల్లోగాని, అడవుల్లో గాని కళ్లు మూసుకుని తీక్షణంగా తపస్సు చేసుకునేవారు. దీనికోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకునేవారు. తమకు తామే కఠిన నియమాలను విధించుకొని దైవధ్యానం కావించడం

Published : 23 Sep 2022 01:24 IST

పూర్వకాలం మునులు, రుషులు మొదలైనవారు నదీతీరాల్లోగాని, అడవుల్లో గాని కళ్లు మూసుకుని తీక్షణంగా తపస్సు చేసుకునేవారు. దీనికోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకునేవారు. తమకు తామే కఠిన నియమాలను విధించుకొని దైవధ్యానం కావించడం తపస్సు ముఖ్య ఉద్దేశం. కాలాలు, రుతువులు మారినా కఠోర తపోదీక్ష సాగించేవారు. వారికి తపస్సే సర్వం.

ఎండలో వానలో తిండీతిప్పలు మానేసి ధ్యానించడమే తపస్సు అని వారి భావన. కానీ, అందరికీ ఆమోదయోగ్యమైన మూడు  విధాల తపస్సులను సూచించారు గీతాచార్యులు. మానసికంగా ఉండే మాలిన్యాలను తొలగించడమే తపస్సు ప్రధాన ధ్యేయం. అదే మోక్షానికి కారణం కాగలదు కూడా. జీవిత పరమార్థ సాధనకు ఇది చాలా ప్రధానమైనది.

మొదటిది శారీరక తపస్సు. ఇందులో అయిదు సాధనాల గురించి వివరించారు. పెద్దలను సేవించడం, పూజించడం ప్రధానం. పెద్దలను, పండితులను, జ్ఞానులను పూజించడం, సేవించడం వల్ల రెండు మహత్తర ఫలితాలు కలుగుతాయి. అవి వారి అనుగ్రహం లభించడం, తమ అహంకార అభిమానాలు నశించడం.

ఆధ్యాత్మిక మార్గంలో సర్వేశ్వరుడు, సద్గురువులు, మహాత్ముల అనుగ్రహం లేనిదే లౌకికమైన మాయ నశించదు. ప్రతిబంధకాలు తొలగిపోవు. కాబట్టి పూజ, సేవలతో వినయ విధేయతలతో వారి అనుగ్రహం, ఆశీర్వాదం సంపాదించాలి. అలాంటి మహాత్ములను సత్క రించడం, సేవించడమే ఒక విధమైన తపస్సు. సాధకుడు చాలా జాగ్రత్త వహించి పరిస రాల శుభ్రత, శుచిత్వం, సాత్వి కాహార స్వీకరణ లాంటి సద్గు ణాలతో శారీరక, మానసిక మాలిన్య త్యాగాల ద్వారా మన సును శుచిగా ఉంచుకోవాలి. త్రికరణ శుద్ధితో సత్ప్రవర్తన కలిగి ఉండటం దీనికి అవసరం.

బాహ్యాంతరాలు శుచిగా ఉంచుకోవడమే శారీరక తపస్సు. ఇతరులకు బాధ కలిగించనిది, సత్యమైనది, ప్రియంగాను, హితంగాను ఉండేదైన వాక్కు, వేదాల అధ్యయనం మొదలైన వాటిని వాచక తపస్సుగా వ్యవహరిస్తారు. మనసును నిశ్చలంగా ఉంచుకోవడం, ముఖంలో ప్రసన్నత, దైవధ్యానం, మనో నిగ్రహం, పరిశుద్ధ భావం కలిగి ఉండటం... ఇవన్నీ మానసిక తపస్సు కిందకు వస్తాయి.

ఇవికాక సాత్విక, రాజసిక, తామసిక తపస్సుల గురించి మరొక వివరణ ఉంది. సాత్విక తపస్సును ఆచరించేవారు మూడు సుగుణాలు కలిగి ఉండాలి. వారు పరమ శ్రద్ధాపరులై  ఉండాలి. ఫలాన్ని ఆశించకుండా కర్మలను చేయాలి. నిశ్చల చిత్తం కలిగి ఉండాలి. ఇలాంటి ఉత్తమ స్వభావాలు కలిగి పైన తెలిపిన శారీరక, మానసిక, వాచక తపస్సులను ఆచరిస్తే దాన్ని సాత్విక తపస్సు అంటారు.

ఇతరులు తనను సత్కరించాలని, గౌరవించాలని, పూజించాలనే డంబంతో చేసే తపస్సు అస్థిరమై అనిశ్చిత ఫలాన్ని కలిగి ఉంటుంది. దీన్ని రాజసిక తపస్సు అంటారు. కాబట్టి విజ్ఞులు దీన్ని అనుసరించకూడదు. మూర్ఖపు పట్టుదలతో శుష్క ఉపవాసాల ద్వారా శరీరాన్ని బాధించుకుంటూ   తపస్సు చేస్తారు కొందరు. ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ తపస్సు చేస్తారు. దీన్ని తామసిక తపస్సు అంటారు. ఇది ఎవరికీ ఆచరణీయం కాదు.
తపస్సును  దుర్వినియోగం చేయడం మరో పాపకార్యం అవుతుంది. కాబట్టి దాన్ని పోగొట్టుకుని రాజసిక, తామసిక తపస్సును ఆశ్రయించకుండా సాత్విక తపస్సును సన్మార్గంలో సక్రమంగా ఆచరించి దైవప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తే సత్ఫలితాన్నిస్తుంది. లోకంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయి.

- వి.ఎస్‌.రాజమౌళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని