ముక్తిదాయకం

గాలి వీస్తున్నట్టుగానో, నది ప్రవహిస్తున్నట్టుగానో మనిషి  మదిలో నిరంతరం ఆలోచనల స్రవంతి కొనసాగుతూ ఉంటుంది. వాటికి కర్త, కర్మ, క్రియ మనం ఎంతమాత్రం కాదు. ప్రదేశాలు, పరిస్థితులు, జీవితంలో తటస్థపడిన మనుషులు వారి మనస్తత్వాలు, గత స్మృతులు... ఇలా అనేకం ఆలోచనల తేనెతుట్టెను నిరంతరం కదుపుతూనే ఉంటాయి.

Published : 09 Nov 2022 00:52 IST

గాలి వీస్తున్నట్టుగానో, నది ప్రవహిస్తున్నట్టుగానో మనిషి  మదిలో నిరంతరం ఆలోచనల స్రవంతి కొనసాగుతూ ఉంటుంది. వాటికి కర్త, కర్మ, క్రియ మనం ఎంతమాత్రం కాదు. ప్రదేశాలు, పరిస్థితులు, జీవితంలో తటస్థపడిన మనుషులు వారి మనస్తత్వాలు, గత స్మృతులు... ఇలా అనేకం ఆలోచనల తేనెతుట్టెను నిరంతరం కదుపుతూనే ఉంటాయి. అనవరతం జనించే ఆలోచనలను అదిమిపట్టడం, అరికట్టడం ఎవరికీ సాధ్యంకాదు. అదొక నిర్విరామ, నిరాఘాటమైన ప్రక్రియ. కాకపోతే కొంత సాధనతో ఆలోచనలను సరైన దారిలో ప్రవహింపజేయవచ్చు.

ఒక మనిషిని చూస్తే వెనువెంటనే మంచో చెడో ఏదో ఒక అభిప్రాయం అసంకల్పితంగా కలుగుతుంది. అప్పటిదాకా కలవని మనిషి పట్ల అలాంటి ఒక అభిప్రాయం కలగడానికి కారణమేమిటి, అసలు ఎందుకు కలగాలి? మనసు అప్పటిదాకా ప్రోది చేసుకున్న అనుభవాలతో మంచివైపో, చెడువైపో మొగ్గి ఉంటుంది. ఆ దిశగానే కనిపించిన రూపాన్ని బట్టి ఒక అంచనాకు వస్తుంది. చాలామంది తాము మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని చూసినప్పుడు కలిగిన అభిప్రాయం అనంతర కాలంలో తప్పో ఒప్పో కావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.

దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనకు ఒక అపరిచితుడి నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు అతడి గొంతు విన్న మన మనసు ఒక రూపం ఏర్పరచి, అతడెప్పుడు మాట్లాడినా ఆ రూపమే మదిలో మెదిలేలా చేస్తుంది. భవిష్యత్తులో అతడు ఎదురైనప్పుడు కలిగిన వాస్తవ రూప దర్శనంతో, మనసులో ఉన్న రూపం అదృశ్యమై ఆశ్చర్యపోవడం మనవంత వుతుంది. ఎందుకిలా జరుగుతుందంటే, మనసు పని రూపకల్పన. నవల చదువుతున్నప్పుడు సినిమా చూస్తున్న అనుభూతి కలగడానికి మనసు మాయాజాలమే కారణం. మనసు నిశ్చలంగా ఉండాలంటారు కొందరు పెద్దలు. అలా ఉంటే- తటస్థంగా వెలిగే దీపానికి, కాగితం మీది దీపం చిత్రానికీ తేడా ఏముంటుంది? సున్నితమైన గాలి అలలకు వయ్యారాలు పోతూ వెలిగే దీపమే కళ్లకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది. అలాగని పెద్ద ఎత్తున వీచే గాలిలో దీపాన్నుంచితే రెపరెపలాడుతూ, ఆరిపోతుందేమోనన్న ఆందోళన కలగడం ఖాయం. మనసులోని ఆలోచనల ప్రవాహం మనం ఏర్పరచిన హద్దుల నడుమ, పద్ధతయిన ఒరవడితో సాగిపోయేలా చేయడం ముఖ్యం. మనస్తత్వ నిపుణులు తరచూ చెప్పే భావోద్వేగాల అదుపు అంటే అదే. భావవ్యక్తీకరణ అన్నది ఒక కళ. అవసరానికి తగినట్టు, విషయానికి ప్రాధాన్యం ఇస్తూ తూచినట్టుగా పదాలను వెలువరించే వ్యక్తి పదిమంది గౌరవం పొందుతాడు. అతడి మాటలు విలువైనవి, ఆచరణీయం అవుతాయి.

సానుకూల ఆలోచనలు మనిషి ఉన్నతికి దోహదం చేస్తాయి. కనిపించే మనిషి రూపానికి విలువను ఆపాదించేవి, గుర్తింపును తెచ్చేవి మనసులో అహర్నిశం ఊరే ఆలోచనలే. ఆలోచనలు మాటల రూపంలో పెదవులు దాటడానికి, చేతలుగా బహిర్గతం కావడానికన్నా ముందు మనసును మరొక్కసారి పరిశీలించుకునే తర్ఫీదు ఇస్తే- మానవుడు మాననీయుడిగా కీర్తిప్రతిష్ఠలు పొందుతాడు.

పొరపాటు జరిగాక క్షమించమని అడగడం మనిషితనం. పొరపాటు చెయ్యకుండా ఉండటం ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనం. వ్యక్తిత్వ వికాసంతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం పరమార్థ సాధకం, ముక్తిదాయకం.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని