కాలశక్తి

ప్రపంచంలో అన్నింటికంటే శక్తిమంతమైంది కాలం. కాలం అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. కాలం అన్నింటిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కాలం అన్నింటినీ తనలో లీనం చేసుకొంటుంది.

Published : 21 Nov 2022 00:24 IST

ప్రపంచంలో అన్నింటికంటే శక్తిమంతమైంది కాలం. కాలం అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. కాలం అన్నింటిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కాలం అన్నింటినీ తనలో లీనం చేసుకొంటుంది. అందుకే కాలాన్ని మించిన శక్తి ప్రపంచంలోనే ఏదీ లేదు.

కాలాన్ని గురించి శాస్త్రజ్ఞులు ఎంతగానో శోధించారు. తత్త్వవేత్తలు ఎంతగానో వ్యాఖ్యానించారు. కవులు ఎన్నో వర్ణనలు చేశారు. కాలం ఎవరికీ చిక్కకుండా పాదరసంలా జారిపోతూనే ఉంది. కన్నులు మూసి తెరిచేంతలో సుదూర తీరాలకు పయనిస్తూనే ఉంది.

కాలం సామాన్యులనే కాదు- మాన్యులనూ తన ప్రభావానికి లొంగే విధంగా చేస్తుంది. భారత సంగ్రామంలో పద్మవ్యూహాన్ని ఛేదించి, అరివీరభయంకరంగా పోరా డినవాడు అభిమన్యుడు. అతడు అజేయ ధనుర్ధారి అయిన అర్జునుడి కొడుకు. సాక్షాత్తు కృష్ణుడి మేన ల్లుడు. అయినా కాలానికి అతడు లొంగిపోక తప్పలేదు. వీరమరణంతో కాలగర్భంలో కలిసిపోయాడు. కాలానికి ఉన్న శక్తి అది!

‘ఈ రోజు ఉదయమే కదా అతడు చక్కగా పాటలు పాడాడు. నవ్వుతూ అందరినీ నవ్వించాడు. అంతలోనే మరణించాడా?’ అని తమ ఆప్తమిత్రుడి గురించి లోకంలో జనులు ఆశ్చర్యపడుతుంటారు. ఇది కాలశక్తి కాక మరేమిటి? మనిషి తనకు ఏదైనా మంచి జరిగితే కాలం కలిసి వచ్చిందని, చెడు జరిగితే కాలం మూడిందని అనుకుంటుంటాడు. జరగరాని సంఘటన ఏదైనా జరిగితే ‘ఇది కాలవైపరీత్యమే’ అంటాడు. దీన్నిబట్టి అన్నింటికీ కాలమే మూలమని తెలుస్తోంది.

‘కాలం ఎలాంటిదంటే అది ముంచుకొని వస్తున్నా మనుషులు తెలుసుకోలేరు’ అంటాడు ఒక నీతికారుడు. జనులు తమ ఆత్మీయుడో, బంధువో మరణిస్తే, అతడి శవం ముందు కూర్చొని భోరుమని ఏడుస్తుంటారు. తమకూ కాలం మూడితే అలాంటిదే వస్తుందని గ్రహించలేరు. కాలం అంతగా మాయ చేస్తుంది!

మనుషులకు విశ్రాంతి ఉంటుందే కానీ, కాలానికి విశ్రాంతి ఉండనే ఉండదు. అది మెల్లమెల్లగా కదులుతూనే ఉంటుంది. ప్రపంచాన్నే తమ శక్తియుక్తులతో వశం చేసుకున్న చక్రవర్తులెందరో చరిత్రలో కనిపిస్తారు. వారంతా ఏరి, ఎక్కడికి వెళ్లారు, వారి ప్రతిభాశక్తులు ఏవీ ఇప్పుడు కనబడవే? ఇలా ప్రశ్నించుకుంటే లభించే ఒకే ఒక సమాధానం ‘వారంతా కాలగర్భంలో కలిసిపోయారు’ అని.

కాలం మూడితే ఎంత సురక్షితస్థానంలో ఉన్నా మరణం తప్పదు. పక్షులు వినీలాకాశంలో సుదూర ప్రాంతాలకు ఎగిరిపోతూ ఉంటాయి. అయినా అవి కూడా ఆపదకు లోనైతే మరణిస్తాయి. అగాధ జలనిధిలో అట్టడుగు భాగంలో ఉన్నా చేపలకు కాలం మూడితే చనిపోవలసిందే. కాలం ముంచుకొనివస్తే ఎక్కడ ఉన్నా ఆపద తప్పదు. ఇదే కాలానికి గల దివ్యశక్తి!

అవక్రవిక్రముడైన విక్రమార్క చక్రవర్తి ఏమయ్యాడు? లోకాన్ని తన కావ్యాలతో అలరించిన కాళిదాస మహాకవి కనబడడే? ఈ భూమండలాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంతో పాలించిన మాంధాత వంటి పాలకులు ఏ లోకాలకు వెళ్ళారు? అంతా కాలప్రవాహంలో కొట్టుకొనిపోయారనే సమాధానమే వస్తుంది. అందుకే కాలం అత్యంతబలీయం!

గడిచే కాలాన్ని అనుక్షణం సార్థకం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి. గడచిన రోజులు మళ్ళీ రావు. గడుస్తున్న దినాలే అమూల్యవరాలు. మనిషి వ్యర్థంగా కాలం గడపకుండా తాను సాధించవలసిన అభ్యుదయాలను సాధించడానికి కృషి చేయాలి. అప్పుడే కాలం అమృతఫలాలను ప్రసాదిస్తుంది!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు