యోగిరాజ వల్లభుడు దత్తుడు

గృహస్థ ధర్మం పేరిట, ఇంద్రియ లోలత్వం పట్ల లాలసత్వం చూపుతూ ప్రజలు అంతర్ముఖత్వానికి దూరమవుతూ ఆత్మతత్వం కనుమరుగవుతున్న వేళ అనసూయ, అత్రి దంపతులకు దత్తుడై ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించడానికి జన్మించాడు దత్తాత్రేయ స్వామి.

Published : 07 Dec 2022 00:44 IST

గృహస్థ ధర్మం పేరిట, ఇంద్రియ లోలత్వం పట్ల లాలసత్వం చూపుతూ ప్రజలు అంతర్ముఖత్వానికి దూరమవుతూ ఆత్మతత్వం కనుమరుగవుతున్న వేళ అనసూయ, అత్రి దంపతులకు దత్తుడై ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించడానికి జన్మించాడు దత్తాత్రేయ స్వామి. బ్రహ్మ, విష్ణు, రుద్రాంశలతో త్రిమూర్త్యాంశగా మార్గశిర శుక్ల పౌర్ణమినాడు ఉద్భవించాడు స్వామి. ఆ రోజునే దత్తజయంతిగా భక్తజనులు జరుపుకొంటారు. యోగీశ్వరుడై, దుష్ట దైత్య సంహారకుడై, శిష్టజన పాలకుడై, భక్తజనుల పాలిట కల్పతరువై, జగద్రక్షకుడై, తన జ్ఞానబోధతో అనుగ్రహిస్తూ సహ్యాద్రి గుహలలో నివసించసాగాడు.

అనేక వేల సంవత్సరాలు మహా యోగసాధనలు చేసిన మునివృద్ధులకు సైతం అందని మహా చిత్రాలు చూపించి బాలకేళిగా అల్లరి పనులతో వారిని దిగ్భ్రమకు గురిచేసి లోకాన్ని రక్షించాడు. జ్ఞానరూపిణియైన అనసూయా మాత పుత్రవ్యామోహంతో ఆయన నిష్క్రమణను అడ్డుకుని నీకీ చర్మదేహం ఇచ్చింది నేనేనని హెచ్చరిస్తే, తన చర్మాన్ని ఒలిచి ఆమె అజ్ఞాన పొరలు చీల్చి జ్ఞానకాంతిని ప్రసాదించాడు. శాంత మనోహరమైన యతిరూపంలో ఒకసారి, చిత్ర విచిత్ర బీభత్స స్వరూపాల్లో మరోసారి కనిపించి భక్తులను పరీక్షించి పరిరక్షించాడు. కేవలం నామస్మరణతోనే మానవుల పాపాలను, దుఃఖాలను పరిహరిం పజేసిన కరుణాంతరంగుడు దత్త స్వామి. ఒకప్పుడు అవిద్యను సృష్టించి వేదాలను మరచిపోయిన బ్రహ్మదేవుడికి త్రుటికాలంలో సమస్త వేదాలను స్ఫురింపజేశాడు. వృద్ధ  ప్రహ్లాదుడి మొరాలకించి పరమహంస యోగాన్ని బోధించి అంతర్జ్యోతి దర్శనం కలిగించాడు. కార్త వీర్యార్జునుడికి దృఢదేహాన్ని, రాజ్యాన్ని అనుగ్రహించి అతడి సందేహ కంటకాలను తొలగించి జ్ఞానయోగాన్ని ప్రసాదించాడు.

శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని, వాటికి విరోధ భావం లేదని మహావాక్యోపదేశాన్ని అను గ్రహించాడు. భూమండలంపై ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసిన పరశురాముడి అశాంతి జ్వాలలను చల్లార్చి ఆత్మవిచార తత్త్వ సిద్ధిని ‘త్రిపురా రహస్యం’ పేరిట వివరించాడు. ఆదరించే దత్తుణ్ని అజ్ఞానంతో మనం విస్మరించినా లోకాంతరాల్లో, జన్మాంతరాల్లో సైతం ఆయన మనల్ని విడిచిపెట్టడంటారు. గాలవపుత్రుడిగా జన్మించిన ధర్మకీర్తిని ఆదరించి స్వామి ధర్మోపదేశం గావించి జ్ఞానభిక్ష ప్రసాదించాడు. కానీ వక్రబుద్ధితో, దుష్టసావాసంతో అహంకరించి స్వామిని దూరం చేసుకున్నా, నీచ స్థితికి చేరిన ధర్మకీర్తిని శిష్య ప్రేమతో ఏకాదశి ఘడియల్లో మరణింపజేసి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు స్వామి.

దత్తప్రభువు ప్రేమాస్పదుడు. నమ్మినవారు దరికి రాలేని స్థితిలో ఉంటే, తానే వారి చెంతకు నడిచివెళ్ళి ఆదుకుని అనుగ్రహించే పరమ పురుషుడు. ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులుగా, నృసింహ సరస్వతిగా అవతరించి భక్తులకు ఐహికాముష్మిక ఫలాలను అందించి ఆనందం కలిగించాడంటారు. షోడశావతారాల్లోను, నవనాథుల పేరిట తొమ్మిది అవతారాల్లో మన రాష్ట్రంలోను, రాష్ట్రేతర ప్రాంతాల్లోను వెలసి గురు ఆరాధనా సంప్రదాయంగా పూజలందుకుంటున్నాడు. భక్తుల దోషాలను ప్రేమతో పోగొట్టి, సంపూర్ణసిద్ధి ననుసరించి ఆత్మారామ స్థితిని సమకూర్చే పరిపూర్ణ అవతారం దత్తావతారం. మంగళకరమైన స్వామి నామమే కలుషాలను పరిహరించి పుణ్యాలను సమకూరుస్తుంది. ప్రేమతో, భక్తితో తమను తాము అర్పించుకొనే భక్తులకు కైవల్యానందాన్ని అనుగ్రహిస్తాడు దత్తుడు. తలచినంతనే కరుణించి భక్తి, జ్ఞాన, వైరాగ్య, ముక్తులను అనుగ్రహించే దత్తస్వామి సదా వందనీయుడు.

- మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని