కరుణాంతరంగా...

ఓ నా స్వామీ! అంతర్యామీ! అన్నింటిలోనూ నిన్నే చూస్తున్నాను. అడుగడుగునా నీవు అగుపడుతుంటే నా ఆనందానికి అవధులు లేవు.

Updated : 23 Jan 2023 02:53 IST

నా స్వామీ! అంతర్యామీ! అన్నింటిలోనూ నిన్నే చూస్తున్నాను. అడుగడుగునా నీవు అగుపడుతుంటే నా ఆనందానికి అవధులు లేవు. విశాలంగా పరచుకొని ఉన్న భూమండలంలో ప్రతి మట్టి కణంలో నీవే ఉన్నావు. మట్టిముద్దను ప్రతిమలుగా తీర్చిదిద్దుతుంటే నీ రూపం గోచరమవుతోంది. మెత్తగా, కఠినంగా, మిట్టలుగా, పల్లాలుగా, కొండలుగా, కోనలుగా, విశాల మైదానాలుగా నీ రూపం అపురూపమై నన్ను అలరిస్తోంది. స్ఫటిక ప్రవాహంలా స్వచ్ఛంగా ఉండే నీళ్ళలో నీ రూపం కనబడుతుంటే, అందులో నా ప్రతిబింబాన్ని చూసుకుంటూ నీవే నేనని, నేనే నీవని భావిస్తున్నాను. ఆ నీళ్లలో స్నానం చేస్తుంటే నీవు నన్ను ఆలింగనం చేసుకొన్నంత మధురానుభూతిని పొందుతున్నాను. ఆ పులకరింతకు ఉప్పొంగి నిన్ను నాలో నిక్షిప్తం చేసుకుందామని నీళ్లను కడుపునిండా తాగుతున్నాను. గొంతులో నుంచి అమృత ప్రవాహంలా కడుపు చెరువులోకి చేరుతున్న నీవు నా ఆకలి బాధను దూరం చేస్తున్నావు. శరీరమంతా నీరు రూపంలో నీవే నిండి ఉన్నా పుడమి అంతటా జలాశయాలుగా విశ్వరూపం ధరించావు. ఘనీభవించి మంచువయ్యావు. మిలమిలా మెరిసే నీ సౌందర్యం మంచుకొండల రూపంలో పరచుకొని ఉంది. వేడికి కరిగే నీ రూపం, వేదనకు కరిగే హృదయంలా నాకు కనబడుతోంది. నా కల్మషాలన్నింటినీ జలరూపంలో ఉన్న నీతోనే కడిగివేసుకుంటున్నాను. ఉదయం నుంచి సాయంకాలం దాకా సూర్యకిరణాల రూపంలో నీవు నా శరీరాన్ని తాకుతూనే ఉంటావు. కన్న తండ్రిలా తలపై స్పృశిస్తావు. దీవెనలు అందిస్తావు. నీ కిరణాలు సోకకుంటే నా హృదయ కమలం విరబూయదు. అవి లేనిదే నేను బతకలేను. నీ కిరణాల నిచ్చెనలపై ప్రయాణించి, నిన్ను చేరుకోవాలనుకుంటాను. కానీ, నీ తేజస్సుకు నేను తట్టుకోలేను. దివ్య చక్షువులు లేనిదే అర్జునుడు నీ రూపాన్ని చూడలేకపోయినట్లే, నాకూ నీవు ప్రసాదించే దివ్య నేత్రాలు కావాలి. నా శ్వాసలో, ధ్యాసలో నీవే వినబడుతున్నావు. మెల్లగా వీచే చల్లగాలిలో, ప్రచండంగా వీచే వేడిగాలిలో, పరిమళాలను వెదజల్లే మలయమారుతంలో నీవు నన్ను తాకుతున్నావు. అన్ని అనుభూతులనూ నాకు అందిస్తున్నావు. వణికించే చల్లగాలిలో, చెమటలు పట్టించే వడగాలిలో, తడిపివేసే గాలివానలో నా శరీరాన్ని సహనశీలంగా మారుస్తున్నది నీవే! నీ సహన ప్రబోధం నాకు అవగతమవుతోంది. వినీలాకాశ రూపంలో నీ సౌందర్యం వర్ణనాతీతం! సూర్యచంద్రులు, కొన్ని గ్రహాలు, కొన్ని తారకలు తప్ప విశ్వాంతరాళంలో ఏమేమున్నాయో నేను చూడలేకపోతున్నాను. ఎన్ని జన్మలు కావాలి ఈ విశ్వరూపాన్ని శోధించేందుకు?

నాకు ఈ పుడమిపై జన్మను ప్రసాదించి, అంతులేని సంపదలను నా ముందు ఉంచావు. నా చుట్టూ నా కుటుంబాన్ని ఏర్పరచావు. విశాల జనసమూహాన్ని అండగా ఇచ్చావు. పుష్కలంగా పనులను కల్పించావు. ఇక నీవు నాకు ఇవ్వవలసిందేమీ లేదు. నీవు అందించిన ప్రకృతి వనరులను నేను చక్కగా ఉపయోగిస్తే చాలు... ఈ భూమండలం నాకు నీవు అందించిన అక్షయపాత్రే అవుతుంది. ప్రకృతి విపత్తులు చురకలు వేస్తున్నా నాకు జ్ఞానోదయం కలగడం లేదు. అయినా, నీ అపార కారుణ్యం నన్ను ఎల్లవేళలా కాపాడుతోంది. నేను ఎన్నటికైనా మారుతానని నీవు సహిస్తున్నావు. నీవు ఎంతటి కరుణాసముద్రుడివి! నీ అనంత గుణాలు నన్ను అబ్బురపరుస్తున్నాయి. వాటిలో కొన్నింటిని నాకు ప్రసాదించి నన్ను కరుణించు!

డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని