సకల పుణ్యరాశి తులసి

ప్రతి ఇంటా ప్రత్యక్షంగా ఎల్లవేళలా దర్శనమిచ్చే మహాలక్ష్మి ‘తులసి’. సాధారణంగా హైందవ గృహిణులు తులసికోట ముందు దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి గాని భోజనం చేయరు.

Published : 30 Jan 2023 00:14 IST

ప్రతి ఇంటా ప్రత్యక్షంగా ఎల్లవేళలా దర్శనమిచ్చే మహాలక్ష్మి ‘తులసి’. సాధారణంగా హైందవ గృహిణులు తులసికోట ముందు దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి గాని భోజనం చేయరు. తులసి కన్యరూపంలో ఓసారి గంగానదీ తీరాన నడిచి వెళుతూంటే వినాయకుడు కనిపించాడు. తాను ధర్మధ్వజుడి కూతురినని, తనను వివాహమాడమని కోరితే గణపతి నిరాకరించాడు. అందుకు కోపించి శపించబోగా, ‘వచ్చే జన్మలో రాక్షస జాతిలో జన్మిస్తావు’ అని గణపతే ఆమెను శపించాడు. తులసి పశ్చాత్తాపాన్ని గ్రహించి తదనంతరం వృక్షరూపం పొంది శ్రీమన్నారాయణుడి గళ సీమను అలంకరిస్తావని వరమిచ్చాడు. తులసి శంఖచూడుడనే రాక్షసుడికి పుత్రికగా జన్మించి జలంధరుణ్ని వివాహమాడింది. విష్ణువు ఆమె పాతివ్రత్యాన్ని భంగంచేసిన తరవాత, శివుడు జలంధరుణ్ని సంహరించగలిగాడు. అటుపిమ్మట తులసి వృక్షరూపం ధరించింది. ఇది బ్రహ్మవైవర్త పురాణ కథనం.

భక్తిగా తులసిని ఆరాధిస్తే ‘తులా’ పురుషుణ్ని ఆరాధించినట్లే అని, తులసీ ప్రదక్షిణంతో అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుందని, తులసి తీర్థం గంగాజలం కన్నా నూరురెట్ల ఫలప్రదమైనదని పురాణ కథనం.
శివాలయం లేని గ్రామంలోను, తులసిమొక్క లేని ఇంటిలోను భోజనం చేయరాదని ధర్మశాస్త్రం చెబుతోంది. తులసి మృత్యువును ధిక్కరించేదన్నది పెద్దల మాట. తులసిమొక్క ఉన్న ఇంట హఠాన్మ రణాలు జరగవని చెబుతారు. తులసివనాన్ని భక్తితో పెంచినవారికి ధర్మార్థ కామ మోక్ష ఫలాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ‘అగస్త్యసంహిత’ చెబుతోంది. వేదమాతను ఆరాధించిన ఫలితాన్ని తులసి ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. గోదాదేవి తులసి మాలను అనుదినం అలంకరించి శ్రీరంగనాథ స్వామిలో ఐక్యమైంది. శ్రీకృష్ణతులాభార ఘట్టంలో తులసి ఎంత మహత్తరంగా నిరూపితమైందో తెలిసిందే!

తులసిని వైష్ణవి, అమృత, పవిత్ర, లక్ష్మి అనే పేర్లతో పిలుస్తారు. సంపూర్ణంగా ఎదిగే కాలం శరదృతువు కావడంతో కార్తికమాసంలో తులసిని ఎక్కువగా ఆరాధిస్తారు. తులసి పెద్ద వృక్షం కాదు. కాయ, పండు, కలప ఇవ్వదు. నీడ, గూడునూ ఇవ్వదు. అయినా అనంతమైన ఔషధ గుణాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. దేవాలయాల్లో తులసిని కలిపిన తీర్థం ఇస్తారు. తులసి సకలరోగ నివారిణి అని అధర్వణవేదం చెబుతోంది. శుభ అశుభ కార్యాలన్నింటిలోను తులసి దళాలను వినియోగిస్తారు.

ప్రధానంగా తులసికి నేల తులసి, అడవితులసి, మరువతులసి, రుద్రతులసి, శ్వేతతులసి, భద్రతులసి, లక్ష్మీతులసి అనే ఏడు పేర్లున్నట్లు చెబుతారు. కృష్ణతులసి అనే పేరు కూడా వ్యవహారంలో ఉంది. తులసిని పున్నమి, అమావాస్య, అష్టమి, ద్వాదశి తిథులలో, మంగళ, శుక్ర, ఆదివారాలలో, పురుడు, మైల, బహిష్టు లాంటి అశుభ తరుణాలలో, పాద రక్షలతో, స్నానాదిక నిత్యకృత్యాల ముందు తుంచకూడదని శాస్త్రం చెబుతోంది. తులసిని నాటడం, నీళ్లు పోయడం, దర్శించడం, స్పృశించడం, ఆరాధించడంవల్ల మనో వాక్కాయ కర్మలతో చేసిన పాపాలన్నీ హరిస్తాయంటారు. గణేశ చతుర్థినాడు గణపతిని తులసిదళాలతో పూజించవచ్చు అంటారు. తులసికి ‘విష్ణువల్లభ’ అనే పేరూ ఉంది. భక్తులు తులసి పూసలమాలతో జపం చేస్తారు. పద్మపురాణం, దేవీభాగవతం, మాఘపురాణం మొదలైన అనేక గ్రంథాల్లో తులసి వృత్తాంతముంది.

 చిమ్మపూడి శ్రీరామమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు