ఉపాసన కళలు

ఈ విశ్వం అంతా నాద, బిందు, కళామయం అని వేదాలు ఘోషిస్తున్నాయి. నాదం అంటే ధ్వని. అది సృష్టికి మూలమైన ప్రణవ ధ్వనిలో నుంచి పుట్టింది. ప్రణవంలో గల మూడు అక్షర ధ్వనులు అ, ఉ, మ అనేవి. ఇవి సృష్టి, స్థితి, లయాలకు ప్రతీకలు...

Published : 07 Feb 2023 00:22 IST

విశ్వం అంతా నాద, బిందు, కళామయం అని వేదాలు ఘోషిస్తున్నాయి. నాదం అంటే ధ్వని. అది సృష్టికి మూలమైన ప్రణవ ధ్వనిలో నుంచి పుట్టింది. ప్రణవంలో గల మూడు అక్షర ధ్వనులు అ, ఉ, మ అనేవి. ఇవి సృష్టి, స్థితి, లయాలకు ప్రతీకలు. ఈ ప్రణవనాదం నుంచే ప్రపంచంలోని శబ్దజాలం అంతా పుట్టింది. సామవేదంలోని గానాత్మక మంత్రాలుగా విస్తరించింది. లోకంలోని సంగీత శాస్త్రాలుగా వ్యాప్తమైంది. భావ రాగతాళాలతో ఆపాత మధురో పాసనగా రూపొందింది.
బిందువు అంటే చుక్క. అది అన్నింటికీ మూల స్థానం. అన్ని కళలూ ప్రారంభం అయ్యేది బిందువులోనే. బిందువే సింధువై విలసిల్లుతుందని వేదవాక్కు. బిందుస్థానం సకల దేవతలకూ నిలయం.

శ్రీచక్రంలోని త్రికోణాం తర్గతమైన బిందుస్థానం మహా శక్తికి నిలయమని తంత్రశాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. భ్రూమధ్యంలో ఉండే ఏకాగ్రస్థానంపై దృష్టి ఉంచి, తపస్సు చేసే మహర్షులు నిరంతరం దర్శించేది ఈ బిందు స్థానాన్నే. ‘కళ’ అనే పదాన్ని సంస్కృతంలో ‘కల’ అని పిలుస్తారు. కలనం అంటే లీనం కావడం. తాదాత్మ్య స్థితిలో మనిషి మనసు లీనమయ్యే చోటు కళాస్థానమే. ‘కలలు కనడం’ అంటే స్వప్నంలో కళలను దర్శించడమే.
కైలాసపర్వతంపై ప్రతినిత్యం సాయం సంధ్యావేళలో ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులు స్వేచ్ఛానృత్యాలు చేస్తారని పురాణేతిహాసాల కథనం. పార్వతి చేసే అభినయాన్ని ‘లాస్యం’ అని, పరమేశ్వరుడి అభినయాన్ని ‘తాండవం’ అనీ అంటారు. ఇలా ఈ జంట చేసే అభినయాలే విశ్వకల్యాణ కారకాలని వేదాలు చెబుతున్నాయి.

వంశీనాదంతో శ్రీకృష్ణుడు, ఢక్కానాదంతో శివుడు, వీణానాదంతో సరస్వతీ దేవి, నారదతుంబురులు ఆనందిస్తారు. మహాకాళక్షేత్రమైన ఉజ్ఞయినిలో శివుడు తాండవ నృత్యం చేస్తుంటే మేఘాలు గర్జిస్తూ మృదంగాల్లాగా ధ్వనిచేస్తూ శివుణ్ని సేవిస్తాయని మహాకవి కాళిదాసు మేఘసందేశంలో అంటాడు.
మనిషి పుట్టినప్పటి నుంచి జీవితాన్ని ముగించే వరకు సాగే సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఎన్నో కళలను దర్శిస్తాడు. వాటిలో కొన్నింటిని సాధిస్తాడు. సాధించిన కళలను అందరి ఆనందం కోసం ప్రదర్శిస్తాడు. ఇదంతా భగవదుపాసనలో ఒక భాగమే.

ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే స్వరాలతో కూడిన వేదమంత్ర పఠనం ఒక ఉపాసనమే. ప్రముఖ వాగ్గేయకారులైన త్యాగరాజు, రామదాసు వంటి మహనీయుల కీర్తనలన్నీ ఉపాసన కళలే. పరమేశ్వరుడి ఢక్కానాదం నుంచి వెలువడిన వ్యాకరణ సూత్రాలు శబ్దశాస్త్రాలకు మూలాలై, అధ్యయనం చేసేవారికి ఉపాసనలయ్యాయి. శివరంజని, హంసధ్వని, మోహన, ఆనందభైరవి వంటి రాగాలను ఆలపిస్తున్నప్పుడు సాధకుడు భగవదుపాసనలో లీనమైనట్లు భావిస్తాడు. లయబద్ధమైన ఛందోగతిలో పఠించే శివతాండవాది స్తోత్రాలను వింటున్నప్పుడు మనసు అద్వితీయ భావనలో తేలియాడుతుంది. ఉపాస్యదేవతలే కళ్లకెదురుగా నిలిచినట్లు అనుభూతి కలుగుతుంది.  

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని