ఆత్మావలోకనం

చాలామందికి ఆత్మగురించిన ఆలోచనే ఉండదు. ఎన్నిమార్లు భగవద్గీత విన్నా సరే, వేదాంత గ్రంథాలు చదివినా అంతే. అగుపించని ఆత్మ గురించి ఆలోచన ఎందుకు అనుకుంటారు.

Published : 19 Mar 2023 00:13 IST

చాలామందికి ఆత్మగురించిన ఆలోచనే ఉండదు. ఎన్నిమార్లు భగవద్గీత విన్నా సరే, వేదాంత గ్రంథాలు చదివినా అంతే. అగుపించని ఆత్మ గురించి ఆలోచన ఎందుకు అనుకుంటారు. కనిపించే దేహమే ప్రధానమనుకుంటారు. ఇలా అనుకోవడంలోనే జీవితం గతించిపోతుంది. శక్తులన్నీ ఉడిగిపోయి, వార్ధక్యంలోకి అడుగుపెట్టగానే కొందరికి ఆత్మవిచారం మొదలవుతుంది. ఈ శరీరమిలా అయిపోయిందేమిటి? అలనాటి రూపురేఖలన్నీ ఇలా మారిపోయాయేమిటి? కొంత దిగులు... కొంత విచారం... మనిషిని సతమతం చేస్తుంటాయి. కొందరికి వార్ధక్య భయం ఉంటుంది. వార్ధక్య లక్షణాలు దాచుకునేందుకు అనేక పాట్లు పడతారు. జుట్టుకు రంగు వేసుకుంటారు. పడుచువాళ్లు వేసుకునే దుస్తులు ధరిస్తారు. ఎన్ని పాట్లు పడినా, వార్ధక్య చిహ్నాలు మాయం కావు. యౌవనం తిరి గిరాదు. మార్పులకు మనిషి సిద్ధంగా ఉండాలి. పరిణామ శీలంగల ప్రకృతిలో మార్పు సహజం. అనివార్యం. దీన్ని మనం స్వీకరించాలి. అప్పుడే జీవన సత్యాలు గోచరిస్తాయి. అజేయ ధనుర్ధారిగా ప్రఖ్యాతి పొందిన అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణం తరవాత గాండీవాన్ని మోయ లేనంత అశక్తుడవుతాడు. అప్పుడు గానీ అర్థం కాలేదు, తనలో ఇంతకాలమూ ప్రజ్వరిల్లింది పర మాత్మ దివ్యశక్తి తప్ప తనదంటూ ఏమీ లేదని.

నరనారాయణ రుషుల్లో నరుడే అర్జునుడు. సర్వమానవాళికి ప్రతి నిధి. అందుకే శ్రీకృష్ణుడు గీతాబోధను అర్జునుడి ద్వారా సమస్త మానవజాతికి బహూకరించాడు. గీత ఒక దివ్య ఆధ్యాత్మిక గృహం. సాధకుడు విషాదంతో అందులోకి ప్రవేశిస్తాడు. జయం అనే పద్దెనిమిది అధ్యాయాల అధ్యయనంతో మాయనుంచి విముక్తుడై, యోగిగా పరివర్తన చెందుతాడు. ‘యోగి’ అంటే దైవస్వరూపుడు! ‘నేనే యోగి’ రూపుణ్ని అంటాడు శ్రీకృష్ణుడు. అంటే యోగి వేషధారులంతా దైవస్వరూపులని కాదు. వేమన యోగికి వస్త్రాలే ఉండేవి కావు. రమణ మహర్షులూ అంతే. చిన్న కౌపీనం ధరించేవారు. యోగులు శరీరంతో అనుబంధం పెట్టుకోరు. దానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వరు. అంతరంగంలో దేదీప్యమానంగా వెలిగిపోయే ఆత్మ వెలుగులు వారి మొహంలో ప్రస్ఫుటమవుతుంటాయి. నిర్మలమైన చూపులు, చెరగని మందహాసంతో- వారి ప్రతి పలుకులో ప్రేమ తొణికిసలాడుతుంది. భగవంతుడి భాష ప్రేమ. ఆయన అనంత ప్రేమ అనేక రూపాల్లో అనుక్షణం మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. ఆత్మను స్పృశిస్తూ పరవశింపజేస్తుంటుంది.

ఆ పారవశ్యాన్ని అనుభూతి చెందాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం ఆత్మావలోకనంతో ఆరంభం కావాలి. మన చూపులన్నీ బయటి ప్రపంచంపైనే ఉంటాయి. అంతర్యామి నివాసంలోకి చూడాలనే ఆసక్తి మనకు కలిగిననాడు అంతర్నేత్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు మనం చూస్తున్న బాహ్యప్రపంచానికన్నా ఎన్నోరెట్లు ఆనందమయ, ప్రశాంత వాతావరణంలోకి మనసు ప్రవేశిస్తుంది. మనోనేత్రాలకు కనిపించే దివ్య దృశ్యాలన్నీ మనల్ని పరవశుల్ని చేస్తాయి. అందులోనే లీనమై, అంతర్యామి దర్శనం కోసం తపిస్తే, దివ్య తేజస్సు ఆవిష్కృతమవుతుంది. అదే రుషులు చెప్పిన ఆత్మసాక్షాత్కారం. ఆ తేజస్సు రూపం దాలిస్తే, అది మన రూపమేనని అర్థమవుతుంది! ఆత్మావలోకనం అంటే మనలోని మనల్ని వీక్షించడం!

 కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని