జయాపజయాలు

మనిషి తాను తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం పొందాలని కాంక్షిస్తాడు. అందుకు మొదట సంకల్పం చేస్తాడు. ప్రణాళిక వేసుకుంటాడు. ప్రయత్నం చేస్తాడు. సాధన చేస్తాడు. శ్రమిస్తాడు. ఇతరుల విమర్శలను లెక్కచేయడు.

Published : 21 May 2023 00:18 IST

మనిషి తాను తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం పొందాలని కాంక్షిస్తాడు. అందుకు మొదట సంకల్పం చేస్తాడు. ప్రణాళిక వేసుకుంటాడు. ప్రయత్నం చేస్తాడు. సాధన చేస్తాడు. శ్రమిస్తాడు. ఇతరుల విమర్శలను లెక్కచేయడు. ఎంతకాలం పట్టినా, ఎంత కష్టమైనా తన ప్రయాణం మానుకోడు. చివరికి గమ్యం చేరతాడు. విజయం సాధిస్తాడు. అయితే ఒక్కొక్కప్పుడు పరాజయం పాలవుతాడు కూడా. ఈ ఓటమికి అనేక కారణాలు ఉండవచ్చు.

మనిషి తన కోసం చేసే పనులు కొన్ని, ఇతరుల కోసం చేసేవి కొన్ని ఉంటాయి. ఏ పనులైనా ధర్మబద్ధంగా ఉండాలి. కేవలం తనకోసమే జీవితం అనుకోవడం స్వార్థం అనిపించుకుంటుంది. ‘పుట్టుక నీది, చావు నీది, మధ్య బతుకు దేశానిది’ అంటాడో కవి. అవి అక్షరసత్యాలు. తన కోసం, తన కుటుంబం కోసం శ్రమించగా వచ్చిన ఫలితానికి, విజయానికి మనిషి సంతుష్టి చెందాలి. అత్యాశకు పోయి అక్రమార్జన చేసి అంతులేని సంపదను కూడబెట్టుకోవడం విజయం అనిపించుకోదు. అది సంతృప్తిని ఇవ్వకపోగా, దుఃఖానికి దారితీస్తుంది. భయాన్నీ పెంచుతుంది. ప్రేమతో, సేవాభావంతో పరులకు చేసే ఉపకారం మనిషికి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అసలైన విజయం అంటే అదే! అటువంటి విజయం మనిషిని శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. అఖండమైన ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. మనిషిని మహామనిషిని చేస్తుంది. ఆ విజయం సత్యమైనది, శాశ్వతమైనది, ఆదర్శవంతమైనది.

ఓ మంచి ఆలోచనవల్ల, మాటవల్ల, ప్రవర్తనవల్ల, పరోపకార ప్రవృత్తివల్ల లభించే ఆనందం, విజయం జన్మకు సార్థకత చేకూరుస్తాయి. దుఃఖాన్ని సహించడంలో నష్టాన్ని భరించడంలో మనిషికి అణకువ అలవడుతుంది. ఆ అణకువే అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. మంచి మాట దానం లాంటిది. ప్రతిఫలంగా పుణ్యం ఇస్తుంది. చెడ్డమాట అప్పులాంటిది. ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. నోరు విప్పేవరకు మాటపైన పెత్తనం మనదే. నోరు జారితే ఆ మాటే మనపైన పెత్తనం చేస్తుంది. కష్టాలను చిరునవ్వుతో, ఒత్తిడిని మనోబలంతో, విమర్శలను ఆత్మవిశ్వాసంతో అధిగమించడమే విజయం. విజయ రహస్యాలన్నీ తెలిసి కూడా పని ప్రారంభించనివాడు ఏదీ తెలియనివాడితోనే సమానం. సంశయం, ఆలస్యం, అశ్రద్ధ- విజయ సాధనకు ప్రధాన అవరోధాలు.

‘జయాపజయాలు దైవాధీనాలు’ అనే నానుడిని మనం తరచూ వింటుంటాం. కార్యశీలుడు ఆధ్యాత్మిక చింతన అనే చివరిమెట్టు ఎక్కితే దైవాధీనమైన విజయమే చేతికందుతుంది. పాండవులు ధర్మవర్తనులు. అందువల్లనే ధర్మ పక్షపాతి వాసుదేవుడు వారి పక్షాన నిలుచుని వాళ్లను విజేతల్ని చేశాడు. అరణ్య, అజ్ఞాతవాసాలు చేయాల్సి వచ్చినా పాండవులు ఏనాడూ కుంగిపోలేదు. నిరాశ పడలేదు.

మనిషి అన్నాక గెలుపు, ఓటమి సహజం. గెలుపొందినప్పుడు తన ప్రతిభే కారణమని అహంకారంతో విర్రవీగకూడదు. ఓటమి ఎదురైనప్పుడు ‘అంతా నా ఖర్మ’ అని కుంగిపోనూకూడదు. ఆత్మనిర్భరత అంతిమ విజయాన్ని ఇస్తుంది. పరహిత వ్రతం ఆచరించేవాణ్ని ఎప్పుడూ విజయమే వరిస్తుంది. స్వార్థపరుణ్ని ఓటమి తన బానిసగా చేసుకుంటుంది. ‘ఆత్మజ్ఞాని కానివాడికి విజయం లభించదు’ అంటారు ఆదిశంకరులు. సత్సంగంవల్ల సద్గురు బోధవల్ల మాత్రమే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. క్షీరసాగర మథనం చేసిన దేవతలు పడిన శ్రమ మానవజాతికి సర్వదా స్మరణీయం. నదికి రెండు తీరాలు ఎంత సహజమో, జీవితంలో జయాపజయాలు అంతే సహజమన్న సత్యాన్ని గ్రహించాలి.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని