ఏరువాక సాగారో...

అన్నదాతలకు అత్యంత ప్రీతికరమైన పండగల్లో ప్రధానమైనది- ఏరువాక పున్నమి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు రైతులు, కార్మికులు, సకుటుంబంగా ఎంతో ఉత్సాహంగా ఈ పండగను జరుపుకొంటారు. గ్రామీణుల్లో ఈరోజున వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, రంగురంగుల కాగితాలతో అలంకరించి, ధూప, దీప నైవేద్యాలతో సభక్తికంగా పూజిస్తారు.

Published : 04 Jun 2023 00:42 IST

అన్నదాతలకు అత్యంత ప్రీతికరమైన పండగల్లో ప్రధానమైనది- ఏరువాక పున్నమి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు రైతులు, కార్మికులు, సకుటుంబంగా ఎంతో ఉత్సాహంగా ఈ పండగను జరుపుకొంటారు. గ్రామీణుల్లో ఈరోజున వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, రంగురంగుల కాగితాలతో అలంకరించి, ధూప, దీప నైవేద్యాలతో సభక్తికంగా పూజిస్తారు.

వర్షరుతువు ఆరంభంలో వచ్చే ఈ పండగను దుక్కిదున్నే ప్రారంభదినంగా భావిస్తారు. ‘ఏరు’ అంటే నాగలి. ఏరువాక అంటే పొలందున్నే ప్రారంభదినమని అర్థం. హలం పట్టడానికి అనువైన నక్షత్రం ‘జ్యేష్ఠ’ అని జ్యోతిష్యం చెబుతోంది. జ్యేష్ఠా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండగా వచ్చేదే జ్యేష్ఠ పూర్ణిమ. సకల ఓషధులకు అధిపతి చంద్రుడు. పుష్కలంగా ఓషధులుంటేనే వ్యవసాయానికి విశేష ఫలసాయం అందుతుంది.

‘జైమినీయ న్యాయమాల’లోను, ‘విష్ణుపురాణం’లోను, బౌద్ధజాతక కథల్లోను ఈ పండగకు సంబంధించిన ప్రస్తావన ఉంది. కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజు రైతులకు బంగారు నాగళ్లు బహూకరించి ఏరువాక వేడుకలు జరిపేవాడని ఇతిహాస కథనం. హాలుడి ‘గాథాసప్త శతి’లోను ఈ పర్వదినవర్ణన ఉంది. అధర్వణవేదం ‘అనడుత్సవం’ పేరుతో ఈ వేడుక ఉన్నట్లు చెబుతోంది. ‘హలకర్మ’ పేరుతో నాగలి పూజ, ‘మేదినీ ఉత్సవం’ పేరుతో భూమిపూజ, ‘వృషభ సౌభాగ్యం’ పేరుతో పశుపూజ జరుపుతారని వేదం వర్ణించింది. వరాహమిహిరుడి ‘బృహత్సంహిత’లో, పరాశరవిరచిత ‘కృషి పరాశరం’లో ఈ పర్వదిన ఉదంతం ఉంది.

ఈ పండగ నాడు గోగునారతో చేసిన తోరణాలు కట్టి, వాటిని చర్నాకోలతో కొట్టి, దొరికిన పీచును ప్రసాదంగా భావించి తీసుకెడతారు. కాడికి ఓవైపున ఎద్దును కట్టి, మరోవైపు రైతులే భుజాన వేసుకుని భూమిని దున్నే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పశువుల కొట్టాలను శుభ్రంచేసి ఎడ్లను, బండ్లను అలంకరించి టెంకాయలు కొట్టి మంగళవాద్యాలతో ఊరేగిస్తారు. రైతులు, పాలేళ్లతో మమేకమై సంబరం చేసుకుంటారు. ఏరువాక పున్నమి నాడు రైతులు అప్పులు ఇవ్వరు, తీసుకోరు.
మెతుకుపెట్టి జాతికి బతుకునిచ్చే రైతే దేశానికి వెన్నెముక అని ఈ ఒక్కరోజున రైతును ప్రశంసించడంతో రైతు రుణం తీరదు. పుడమిని పుత్తడిగా మార్చడానికి, ఆరుకాలాలు శ్రమించే రైతు స్వేదంలోని వేదన గ్రహించి, అతడి వ్యవసాయానికి అన్ని విధాలా సాయం చేయడమే ముందున్న కర్తవ్యం. అప్పుడే పల్లెలనుంచి, పట్టణాలకు వలస వచ్చే నిస్సహాయ కార్మికుల సంఖ్య తగ్గుతుంది. దేశ సౌభాగ్య సౌధానికి పునాదిరాళ్ల వంటివాళ్లు సేద్యగాళ్లు. రైతు చల్లగా ఉంటేనే జాతి కడుపు చల్లగా ఉంటుంది.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని