కోతకు ముందే కన్నీళ్లు

జెమిని వైరస్‌ ఒకవైపు.. తామర పురుగు మరోవైపు మిరపను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలూ తోడై రైతును నట్టేట ముంచేస్తున్నాయి. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాక పంటను

Published : 29 Nov 2021 03:30 IST

మిరపను మింగేస్తున్న తామర పురుగు, జెమిని వైరస్‌
వేలాది ఎకరాల్లో తోటల తొలగింపు
ఎకరాకు రూ.70 వేల వరకు నష్టపోతున్న రైతాంగం

గుంటూరు జిల్లా సిరిపురం వద్ద వదిలేసిన మిరప చేలో మేస్తున్న ఎడ్లు


* కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లికి చెందిన గువ్వల హనుమంతు ఎకరా భూమిలో మిరప నాటారు. వైరస్‌ ఆశించి మొక్కలు చనిపోయాయి. మళ్లీ నాటినా నిలవలేదు. రూ.70 వేల పెట్టుబడి అయింది. మరో మూడెకరాల్లో సాగు చేసిన పత్తి గట్టెక్కిస్తుందనుకుంటే.. వర్షాల్లేక ఎకరాకు రెండు క్వింటాళ్ల లోపే వచ్చింది. తెచ్చిన అప్పు తీర్చేందుకు.. లక్షకు కొన్న ఎడ్ల జతను రూ.50 వేలకు అమ్మేసి.. భార్యతో కలిసి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వలస వెళ్లి పత్తి ఏరుకుంటున్నారు.


* గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన కావూరు పిచ్చయ్య ఎకరన్నరలో మిరప వేస్తే.. పెట్టుబడి రూ.75 వేలు అయింది. వైరస్‌ సోకడంతో పైరు పీకేశారు. ఈ గ్రామంలో 90% పైరు తెగులుతో దెబ్బతింది. ‘మళ్లీ మిరప వేద్దామనుకున్నా.. పెట్టుబడి తట్టుకోలేక మానుకున్నాను. అందుకే కంది వేశా’ అని వివరించారు.


ఈనాడు, అమరావతి: జెమిని వైరస్‌ ఒకవైపు.. తామర పురుగు మరోవైపు మిరపను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలూ తోడై రైతును నట్టేట ముంచేస్తున్నాయి. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాక పంటను తొలగించే పరిస్థితి కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఎదురైన గడ్డు పరిస్థితులు మునుపెన్నడూ లేవని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు, తెగుళ్ల నివారణకు కొందరు వారానికి నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో.. ఒకటికి రెండుసార్లు మొక్కలు కొని తెచ్చి నాటుతున్నారు. అయినా ఫలితం లేక వేలాది ఎకరాల్లో మొక్కల్ని తొలగిస్తున్నారు. వీటిని తట్టుకుని పంటను కాపాడుకున్నా.. అధిక వానలతో మొక్కలు ఉరకెత్తి చనిపోతున్నాయి. గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా కన్పిస్తోంది. అనంతపురం, కృష్ణా జిల్లాలోనూ తెగుళ్ల ప్రభావం ఉంది. వైరస్‌ తట్టుకునే రకాలంటూ.. కొందరు వ్యాపారులు నల్లబజారులో అధిక ధరలకు విత్తనాలు అంటగట్టారు. వీటికీ వైరస్‌ సోకి నష్టపోయామని గుంటూరు జిల్లా పెదకూరపాడు ప్రాంత రైతులు వాపోతున్నారు.

రికార్డు స్థాయిలో సాగు

గతేడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 4.59 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. నిరుటి కంటే ఇది 1.11 లక్షల ఎకరాలు ఎక్కువ. గుంటూరు జిల్లాలో 2.41 లక్షలు, ప్రకాశంలో 94 వేలు, కర్నూలు 56 వేలు, కృష్ణా జిల్లాలో 35వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది.

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎండిపోతున్న మిర్చిపంటను ట్రాక్టర్‌ సాయంతో తొలగింపు


వైరస్‌కు తోడు.. తామర పురుగు

త కొన్నేళ్లుగా మిరపలో జెమిని వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉంటోంది. ఇది సోకిన మొక్కల ఆకులు ముడతలుపడి, కుంచించుకుపోతాయి. ఆ మొక్కలను తొలగించడం తప్ప గత్యంతరం లేదు. పలువురు రైతులు పొలాల్ని దున్ని మళ్లీ కొత్తగా మొక్కలు నాటుతున్నారు. వాటికీ తెగులు సోకడంతో మళ్లీ తొలగించాల్సి వస్తోంది. ఈ వైరస్‌ బారి నుంచి మొక్కలను కాపాడుకున్నా.. కొత్తగా తామర పురుగులు మిరప పంటను ఆశించి, పూతను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీంతో దిగుబడులు భారీగా తగ్గుతాయి. రైతులు వీటిని నల్లి తాకిడిగా భావిస్తూ మందులు కొడుతుండటంతో ఖర్చు పెరుగుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సస్యరక్షణ చర్యలపై రైతుల్లో అవగాహన కల్పించడానికి ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. వైరస్‌తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌, బెంగళూరు శాస్త్రవేత్తల బృందం డిసెంబర్‌ 2 తర్వాత రాష్ట్రంలో పర్యటించనుంది.


కాపు రాకముందే.. ఎకరాకు రూ.70వేల నష్టం

కరా మిరప సాగుకు రూ.1.75 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు ఖర్చవుతోంది. ఎకరా రూ.30 వేలకు పైగా కౌలు ముందే చెల్లిస్తున్నారు. విత్తనాలు, దుక్కి, మొక్కల పెంపకం, నాటడం, ఎరువులు, పురుగుమందులు, కలుపుతీతలు ఇతరత్రా ఖర్చులకు కాపు రాక ముందే.. ఎకరాకు రూ.70 వేల వరకు ఖర్చవుతోంది. కోత, అమ్మకం ఖర్చులు క్వింటాలుకు రూ.4వేల పైనే అవుతాయి. ఈ ఏడాది మొక్క దశ నుంచే వైరస్‌, తామర పురుగు ఆశించడంతో తొలగించక తప్పడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని