కంట్రోల్‌లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం

సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు.

Published : 29 Apr 2024 07:43 IST

సకల శాఖ మంత్రి ఆదేశాలతో నిర్వహిస్తున్న ఏపీ ఎన్జీఓ సంఘం కీలక నేతలు
సన్మానాల పేరుతో ప్రభుత్వ సలహాదారుతో రాజకీయ చర్చలు
నాయకుల తీరును వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించిన సమయంలో కంట్రోల్‌లో ఉండాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికయిన శివారెడ్డి, పురుషోత్తంనాయుడుకు సన్మానం పేరుతో సమావేశాలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి తెర వెనుక ఉండి వీటిని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 15న అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమానికి శివారెడ్డి, పురుషోత్తం నాయుడుతో కలిసే ఆయన వెళ్లారు. వారు కలిసి దిగిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. ఇటీవల మచిలీపట్నంలోనూ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు నేరుగా హాజరుకాని చంద్రశేఖరరెడ్డి సమీపంలోని హోటళ్లలో బస చేసి, అక్కడి నుంచి నాయకులతో రాజకీయ మంతనాలు జరిపారు. ఏపీ ఎన్జీఓ నాయకులపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రశేఖరరెడ్డితో అంటకాగడం ఆపడంలేదు. ఏపీఎన్జీఓ సంఘం హోంలో రాష్ట్ర మహిళా ఎగ్జిక్యూటివ్‌ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

అభ్యర్థిని కలిసి సమావేశం గురించి చెప్పి

ఏపీ ఎన్జీఓ సంఘం కార్యవర్గ సన్మానం పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత ఆ సమాచారాన్ని సకల శాఖ మంత్రికి నివేదిస్తున్నారు. ఎక్కడైతే సమావేశం జరుగుతుందో అక్కడి వైకాపా అభ్యర్థిని కలిసి సమావేశం వివరాలను చంద్రశేఖరరెడ్డి అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత నుంచి బయట పడేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులను వైకాపా వారు ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. నిత్యం సమావేశాలు నిర్వహించాలని, ఉద్యోగులకు వైకాపా గురించి అనుకూలంగా చెప్పాలని సకల శాఖ మంత్రి నుంచి ఆదేశాలు వస్తున్నాయి. వీటికి అనుగుణంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్జీఓ సంఘంలోని కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లెక్క చేయడం లేదు. పురుషోత్తం నాయుడి కుమారుడు ఇప్పటికే వైకాపాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎంతో పేరు సంపాదించుకున్న ఏపీ ఎన్జీఓ సంఘానికి నాయకులుగా ఉన్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడంపై ఉద్యోగుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని