జిల్లా జిల్లాకో విమానాశ్రయం

ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని (వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ ఎయిర్‌పోర్టు) అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల నమూనా ఒకే విధంగా ఉండాలని...

Published : 21 Jan 2022 03:17 IST

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని (వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ ఎయిర్‌పోర్టు) అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల నమూనా ఒకే విధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాల పనుల పురోగతిపై అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వేను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, కడప, కర్నూలు విమానాశ్రయాల విస్తరణతో పాటు కొత్తగా ప్రతిపాదించిన రెండు విమానాశ్రయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. విజయనగరంలోని భోగాపురం, నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయాలు త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చూడాలి. దీనికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలి.  

నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులనూ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేయాలి. గన్నవరం విమానాశ్రయం విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రద్దీకి తగ్గినట్లు మౌలిక సదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలి...’’ అని అధికారులకు చెప్పారు.  


ఓడరేవుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

‘‘రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 3 ఓడ రేవులు, 9 చేపల రేవుల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. నిర్దేశిత వ్యవధిలో అవి అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక ఉండాలి...’’ అని సీఎం జగన్‌      అధికారులను ఆదేశించారు. 9 చేపల రేవుల్లో తొలిదశలో ఉప్పాడ,  నిజాంపట్నం, మచిలీపట్నం, జువ్వలదిన్నెలను అక్టోబరు నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని, రెండో విడత చేపట్టనున్న 5 చేపల రేవులను నిర్దేశిత కాల పరిమితిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.  పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, ప్రత్యేక సీఎస్‌ కరికాల్‌ వళవన్‌, మారిటైం బోర్డు సీఈవో మురళీధరన్‌, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ   సలహాదారు భరత్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని