పీఆర్సీపై హైకోర్టుకు అధికారుల ఐకాస

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ఇచ్చిన పీఆర్సీ(వేతన సవరణ) ఉత్తర్వులను(జీవో 1) సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య గురువారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాటి అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల

Published : 21 Jan 2022 05:17 IST

ఉత్తర్వులను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించండి
వాటితో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతపడుతుంది
సవరించేలా ఆదేశించాలని కోరిన గెజిటెడ్‌ అధికారుల సంఘం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ఇచ్చిన పీఆర్సీ(వేతన సవరణ) ఉత్తర్వులను(జీవో 1) సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య గురువారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాటి అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందన్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రభుత్వాలు జీతాలను తగ్గిస్తాయని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీ విభజన చట్టానికి జీవోలు వ్యతిరేకంగా ఉన్నాయని వాటిని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. తమ వినతులను పరిగణనలోకి తీసుకొని వేతనాలను తాజాగా సవరించేలా ఆదేశించాలని కోరారు. జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు. వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పే రివిజన్‌ కమిషన్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

పిటిషన్‌లో ఏముందంటే...

‘ఏపీ విభజన చట్టంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినప్పటికీ పరిపాలనను 2016లో అమరావతికి మార్చారు. దీంతో ఉన్నపళంగా కుటుంబాలను హైదరాబాద్‌లోనే వదిలేసి ఉద్యోగులు అమరావతికి మారాల్సి వచ్చింది. మాపై హైదరాబాద్‌తోపాటు అమరావతిలో ఇంటి అద్దెల భారం పడింది. అకస్మాత్తుగా రాజధానిని తరలించడంతో గుంటూరు, విజయవాడల్లో అద్దెలు అసాధారణంగా పెరిగాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం... ఉద్యోగులకు చెల్లించే మూల వేతనం(బేసిక్‌ పే)లో 30% ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ)గా ప్రకటించారు. ప్రతి అయిదేళ్లకోసారి పీఆర్సీ వేస్తారు. అప్పటి జీవన విధానానికి అవుతున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకొని ఎంతమేరకు జీతాలు పెంచాలనే అంశంపై కమిషన్‌ సిఫారసు చేస్తుంది. ఉద్యోగి నివసించే నగరంతోపాటు అక్కడున్న అద్దెలను పరిగణనలోకి తీసుకొని న్యాయబద్ధంగా హెచ్‌ఆర్‌ఏ నిర్ణయించాల్సి ఉంటుంది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అశుతోష్‌ మిశ్ర నేతృత్వంలో 2018లో అప్పటి ప్రభుత్వం పే రివిజన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ లేవనెత్తిన అంశాలపై మేం సమగ్ర వివరాలు ఇచ్చాం. దురదృష్టవశాత్తు ఆ కమిషన్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు. కమిషన్‌ నివేదికను పరిశీలించేందుకు కార్యదర్శులతో ప్రభుత్వం మరో కమిటీ వేసింది. ఇది చట్ట విరుద్ధం. పీఆర్సీ కమిషన్‌ స్థాయిని తక్కువ చేయడమే. పీఆర్సీ కమిషన్‌ నివేదికను కాని, తదనంతర ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ పరిశీలించిన విషయాలను ప్రభుత్వం బయటపెట్టకుండా ఏకపక్షంగా జీవోను జారీచేసింది. సహజ న్యాయసూత్రాలకు, విభజన చట్టానికి విరుద్ధంగా జీవో ఉంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 78(1) ప్రకారం ఏపీ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను స్పష్టంచేస్తోంది. ఆ సెక్షన్‌ ప్రకారం ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చినా సర్వీసు నిబంధనలు, వారి కల్పించే హెచ్‌ఆర్‌ఏ తదితర ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది. ప్రస్తుత పీఆర్సీని 2018 జులై 1 నుంచి అమలవుతుందని పేర్కొనడం ద్వారా... ఇప్పటివరకు ఉద్యోగులకు అదనంగా ఏమైనా చెల్లించి ఉంటే వాటిని తిరిగి రాబట్టుకునే అధికారం కల్పించడం అసంబద్ధం. మేం ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోకుండా వేతన సవరణ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం జోక్యాన్ని కోరుతున్నాం’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని