పీపీఏ లేఖ నిజమే.. సమాధానమిస్తాం

దిగువ కాఫర్‌డ్యాం పనులు జులై నెలాఖరులోగా పూర్తి చేయకపోవడంతో నష్టం జరిగిందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) జులై 22న రాసిన లేఖలో పేర్కొన్నది వాస్తవమేనని

Updated : 11 Aug 2022 09:43 IST

గుంతలు పూడ్చలేక..  సాంకేతికత అర్థంకాక చస్తున్నాం: అంబటి

ఈనాడు, అమరావతి: దిగువ కాఫర్‌డ్యాం పనులు జులై నెలాఖరులోగా పూర్తి చేయకపోవడంతో నష్టం జరిగిందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) జులై 22న రాసిన లేఖలో పేర్కొన్నది వాస్తవమేనని రాష్ట్ర జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అంగీకరించారు. వరదల కారణంగానే పనులు పూర్తి చేయలేకపోయామంటూ వారికి సమాధానమివ్వబోతున్నామన్నారు. పోలవరం పనులకు సంబంధించి ఇటీవల రూ.453 కోట్లు అదనంగా ఇచ్చిన విషయమై విజయవాడలో విలేకరులు ప్రశ్నించగా.. తర్వాత చెబుతామని సమాధానమిచ్చారు. ‘జులై 31నాటికి దిగువ కాఫర్‌డ్యాం పనులు పూర్తి చేయాలని పీపీఏ చెప్పింది. డిజైన్లు ఏప్రిల్‌లో ఇచ్చారు. ఇందులో వారి తప్పేమీ లేదు. అక్కడ భయంకరమైన గుంతలు ఏర్పడటంతో జియోబ్యాగ్స్‌తో జెట్‌ గ్రౌటింగ్‌ చేయమని చెప్పారు. అయితే ఎవరూ ఊహించనట్టుగా జులై 8న వరదలు మొదలుకావడంతో 9, 10వ తేదీలనుంచి పనులకు ఆటంకమేర్పడింది. వరదలు రావడం, మునిగిపోవడం నిజం కాదా?’ అని అంబటి ప్రశ్నించారు. ‘డయాఫ్రంవాల్‌ ఆరోగ్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. పెద్ద పెద్ద గుంతలు పూడ్చలేక, సాంకేతికత అర్థం కాక చస్తున్నాం’ అని వివరించారు. ‘ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రంవాల్‌ కట్టడమే దీనంతటికీ కారణం. కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

సీఎంకు గాలి జనార్దన్‌రెడ్డి ముఖ్యమన్నట్లు చిత్రీకరణ
ముఖ్యమంత్రి జగన్‌కు గాలి జనార్దన్‌రెడ్డి ఎంతో ముఖ్యమనేట్టుగా బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి రాంబాబు విమర్శించారు. ‘కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వివాదం తేలడంతో తవ్వకాలకు అనుమతివ్వాలని ఓబులాపురం సంస్థ సుప్రీంకోర్టును కోరింది. వివాదం తేలినందున తవ్వకాలకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ ఇచ్చింది. ఇది చాలా పెద్ద తప్పు.. నేరంగా చూపిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts