హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ!

వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫార్సు చేసింది.

Updated : 25 Nov 2022 06:02 IST

తెలంగాణ నుంచి ముగ్గురు..
ఏపీ, మద్రాస్‌ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున..
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

ఈనాడు, దిల్లీ: వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌ హైకోర్టుల నుంచి ఇద్దరి చొప్పున న్యాయమూర్తులున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్‌ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్‌ డాక్టర్‌ డి.నాగార్జునను మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ ఏ.అభిషేక్‌రెడ్డిని పట్నా హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ డి.రమేష్‌ను అలహాబాద్‌ హైకోర్టుకు, మద్రాస్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ వి.ఎం.వేలుమణిని కలకత్తా హైకోర్టుకు, జస్టిస్‌ టి.రాజాను రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ నిఖిల్‌ ఎస్‌ కరియల్‌ను పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. బార్‌ అసోసియేషన్‌ నాయకులతో కూడిన ప్రతినిధి బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి కరియల్‌ బదిలీని నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు న్యాయవాదుల ప్రతినిధులు మీడియాతో చెప్పారు.

రాజస్థాన్‌ హైకోర్టుకు మరో 8 మంది..

న్యాయవాదులు అనిల్‌ కుమార్‌ ఉపమాన్‌, నుపుర్‌ భట్‌, న్యాయాధికారులు రాజేంద్రప్రకాష్‌ సోని, అశోక్‌కుమార్‌ జైన్‌, యోగేంద్రకుమార్‌ పురోహిత్‌, భువన్‌ గోయల్‌, ప్రవీర్‌ భట్నాగర్‌, అశుతోష్‌కుమార్‌లను రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన కొలీజియం సమావేశం అంగీకరించింది. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు జస్టిస్‌ నరేంద్రకుమార్‌ వ్యాస్‌, నరేష్‌కుమార్‌ చంద్రవంశీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకూ సమ్మతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని