3పెగ్గులు 6గ్లాసులు

ముఖ్యమంత్రి, అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి సాక్ష్యం.. రాష్ట్రంలో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతి చోటా కనిపిస్తున్న బెల్టు షాపులే. స్థానిక వైకాపా నాయకులు, కీలక కార్యకర్తల అండదండలతో మూడు పెగ్గులు, ఆరు గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది.

Updated : 27 Nov 2022 08:44 IST

వీధి చివర.. ఇంటి పక్కన.. ఎక్కడ చూసినా బెల్టుషాపులే
ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం డెలివరీ
ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో సంచార దుకాణాలు
ప్రభుత్వ దుకాణాల్లో కొని అదనపు ధరకు అమ్మకం
జిల్లాకో ఊరిలో ‘ఈనాడు’ పరిశీలన
ప్రతి చోటా కనీసం 2, 3 బెల్టుషాపులు
స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలదే దందా
ఒక్క బెల్టుషాపూ లేకుండా చేశామన్న సీఎం జగన్‌ మాటలు డొల్లే
ఈనాడు-అమరావతి, యంత్రాంగం

ముఖ్యమంత్రి, అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి సాక్ష్యం.. రాష్ట్రంలో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతి చోటా కనిపిస్తున్న బెల్టు షాపులే. స్థానిక వైకాపా నాయకులు, కీలక కార్యకర్తల అండదండలతో మూడు పెగ్గులు, ఆరు గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో ఊరిని ‘ఈనాడు’ పరిశీలించగా 154 బెల్టు షాపులు లెక్క తేలాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న బెల్టు దుకాణాల్లో ఎంత పెద్ద ఎత్తున దందా సాగుతుందో లెక్కకందని విషయం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఊరినీ మత్తులో ముంచేస్తున్న గొలుసు దుకాణాలపై క్షేత్రస్థాయి ప్రత్యేక కథనం.


నాడు జగన్‌ ఏమన్నారంటే..

ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం సీసాలు

చంద్రబాబు పాలనలో గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రతి గ్రామంలోనూ వీధి చివరన, ఇంటి పక్కన, బడి, గుడి పక్కన మద్యం బెల్టు షాపులున్నాయి. ఒకటో రెండో కాదు.. మూడు నాలుగేసి ఉన్నాయి. ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ వస్తుందో లేదో తెలియదు.. కానీ మద్యం సీసాలను నేరుగా ఇంటికే పంపిస్తున్నారు.

- 2018 డిసెంబరు 11న ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌

లక్ష్యాలు విధించి మరీ అమ్మించారు

గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను పెంచాలని ఎక్సైజ్‌ అధికారులకు లక్ష్యాలను విధించేవారు. విక్రయాలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. రాష్ట్రంలో 43వేల బెల్టు దుకాణాలు నడిపారు. ప్రతి మనిషిని ఎలా తాగుబోతును చేయాలా అనే ఆలోచనతోనే మద్యం విక్రయాలను గ్రామ స్థాయి వరకూ తీసుకెళ్లారు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు దుకాణం లేకుండా చేశామని సభా వేదికగా గర్వంగా చెబుతున్నా.

- 2019 డిసెంబరు 16న అసెంబ్లీలో సీఎం జగన్‌

ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే బెల్టు షాపులుండవు

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే వారి లాభాపేక్ష కోసం, విక్రయాలను పెంచుకోవడానికి బెల్టు షాపులు పుట్టుకొస్తాయి. అందుకే ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతోంది. మేం అధికారంలోకి వచ్చాక 43వేల బెల్టు దుకాణాలను తొలగించాం.

- 2020 మే 6న నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌


ఇదీ వాస్తవం

శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలోని ఈ కిళ్లీ కొట్టు అచ్చంగా ఓ బెల్టుషాపే. దీని పక్కనే ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం తెరిచి ఉన్నా, మూసి ఉంచినా ఈ పాన్‌షాప్‌లో ఎప్పుడు కావాలన్నా సరకు దొరుకుతుంది. ఇలాంటివి ఈ ఊళ్లో నాలుగున్నాయి. పూల కొట్లు, కిరాణా దుకాణాల్లోనూ కొందరు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని గ్రామ సచివాలయం ఎదురుగానే నడుస్తున్నాయంటే ఎవరైనా చూస్తారేమో.. ఫిర్యాదు చేస్తారేమో అనే భయం ఏ కోశానా లేదని అర్థమవుతుంది.


కోరుకున్నచోటే.. కిక్కు కావల్సినంత

రాష్ట్రంలో ప్రతి ఊళ్లోనూ మద్యం బెల్టుషాపులు
పగలూరాత్రీ తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అమ్మకాలు

రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపు అన్నదే లేకుండా తొలగించేశామన్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ జిల్లాలో చూసినా బెల్టుషాపులే. చిల్లర దుకాణాలు, కిళ్లీ కొట్లు, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు, దాబాలు, కిరాణా కొట్లు, కూల్‌డ్రింక్‌ షాపులు ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే. మరికొందరైతే ఇళ్లనే బెల్టుషాపులుగా మార్చేసి నడిపిస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో జిల్లాకు ఒక గ్రామంలో ‘ఈనాడు’ పరిశీలించగా ఇలాంటి విషయాలెన్నో కళ్లకుకట్టాయి.

ప్రతి ఊర్లోనూ తక్కువలో తక్కువ రెండు, మూడు బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఈ దుకాణాల నిర్వహణలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులదే ప్రధాన పాత్ర. రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోంది. సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయాలంటే అధికార పార్టీ పెద్దలకు భారీ మొత్తంలో కమీషన్‌ ఇవ్వాలని, అలా ఇచ్చిన కంపెనీల బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు బెల్టుషాపుల ద్వారా ప్రజల్ని దోచుకుంటున్నారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా గతంలో ఉన్న పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశామని ముఖ్యమంత్రి జగన్‌ పలు సందర్భాల్లో ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు ఏ బెల్టుషాపు వద్ద చూసినా సరే ‘పర్మిట్‌’ లేని రూమ్‌లే కనిపిస్తున్నాయి. వాటిలో అడ్డగోలు మద్యం విక్రయాలే దర్శనమిస్తున్నాయి.

బెల్టుషాపులకు ప్రభుత్వ దుకాణాల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అక్కడ పనిచేసే కొంతమంది సిబ్బంది బెల్ట్టుషాపుల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఒక్కో క్వార్టర్‌ సీసాపై అదనంగా రూ.10- 15 చొప్పున తీసుకుని కావాల్సినన్ని అందిస్తున్నారు. బెల్టుషాపులవారు వాటిని గ్రామాలకు తీసుకెళ్లి ఆ రేటుపై అదనంగా మరో రూ.30-40 వేసి, మందుబాబులకు అమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో రూ.130 ఉండే క్వార్టర్‌ సీసా.. బెల్టుషాపుల్లో రూ.180 వరకూ విక్రయిస్తున్నారు. అవతలి వారి అవసరాన్ని బట్టి ఈ రేటు ఇంకా పెరుగుతుంది కూడా. కొన్నిచోట్ల ప్రభుత్వ దుకాణాల్లో పనిచేసే సిబ్బందే నేరుగా బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ‘ఈనాడు’ పరిశీలన జరిపిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.


వేలం పాడుకుని దక్కించుకున్నారు మరి..

* తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కొత్తవీరాపురంలో ఏడాదిపాటు నాలుగు బెల్టుషాపుల నిర్వహణ కోసం ఈ మే నెలలో స్థానిక వైకాపా నాయకులు వేలం పాట నిర్వహిస్తే కొందరు రూ.70వేలకు దక్కించుకున్నారు. బెల్టుషాపుల ఏర్పాటును వ్యతిరేకించిన గ్రామస్థుల కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడొద్దంటూ దండోరా వేయించడం వైకాపా నాయకుల బరి తెగింపునకు పరాకాష్ఠ. దీంతో మహిళలంతా ఏకమై గ్రామంలో బెల్టుషాపులు తొలగించాలని ఆందోళన చేశారు. అయినా ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి.

* ఏలూరు జిల్లా కైకలూరులో వైకాపా మద్దతుదారులు, కార్యకర్తలు 15 బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. వీటిలో రోజుకు సగటున రూ.లక్ష విలువైన మద్యం అమ్ముతున్నారు.

* అనంతపురం జిల్లా విడపనకల్లులో స్థానిక వైకాపా నాయకుల మద్దతుతో మూడు బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఏపీ మద్యంతో పాటు కర్ణాటక మద్యాన్ని ఇక్కడ టెట్రా ప్యాక్‌లలో విక్రయిస్తున్నారు.

* వైకాపా ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావు దత్తత గ్రామమైన పల్నాడు జిల్లా పాటిబండ్లలో బెల్టుషాపుల నిర్వాహకులు వైకాపా సానుభూతిపరులు. గ్రామ నాయకుల అండదండలు వారికున్నాయి.

* పలు చోట్ల వైకాపా కార్యకర్తలు, మద్దతుదారులే బెల్టుషాపులు నిర్వహిస్తుండటం, మరికొన్ని చోట్ల నిర్వాహకులకు  స్థానిక వైకాపా నాయకుల మద్దతు ఉండటంతో వాటిపై ఫిర్యాదు చేయటానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్దనాగులవరంలో వైకాపా నాయకుల మద్దతుతో బెల్టుషాపులు నడుస్తున్నందునే ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నట్లు గ్రామస్థుడు ఒకరు చెప్పడం దీనికి నిదర్శనం. చాలా సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా వాటిపై చర్యలు ఉండట్లేదన్న విమర్శలున్నాయి.


సిట్టింగ్‌ కోసం బెల్ట్‌ బార్‌

చిల్లర వస్తువులు అమ్మే ఈ దుకాణంలో మద్యం సీసాలు విక్రయిస్తున్నారు. అక్కడితో ఆగకుండా కూర్చుని తాగేందుకు వీలుగా దుకాణం వెనుక భాగంలోనే అన్ని ఏర్పాట్లు సమకూరుస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజుపూడి గ్రామంలో కిళ్లీకొట్టు ముసుగులో సాగుతున్న బెల్టుషాపు ఇది. ఈ ఊరిలో ఇలాంటివి పది ఉన్నాయి. చీకటి పడితే చాలు ఈ దుకాణాలన్నీ మందుబాబులతో నిండిపోతున్నాయి.


రోడ్డు పక్కనే..

రోడ్డు పక్కనే కూర్చుని ఎంత దర్జాగా మద్యం తాగుతున్నారో చూశారుగా! బాపట్ల జిల్లా చందోలులో కాల్వకట్టపై రోజూ ఇదే దృశ్యం. ఈ కట్టకు సమీపంలో బెల్టు దుకాణాలున్నాయి. ఒక్క ఫోన్‌ చేస్తే చాలు ద్విచక్ర వాహనాలపై వచ్చి మద్యం సీసాలు అందించే మొబైల్‌ బెల్టుషాపులనూ కొందరు నడిపిస్తున్నారు.


జనాభా 6 వేలు..బెల్టుషాపులు 16

పేరుకే ఇది చిల్లరకొట్టు. ఎప్పుడు చూసినా మద్యం అమ్మకాలు, మందుబాబులతో కోలాహలంగా కనిపిస్తుంది. 6వేల జనాభా కలిగిన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో ఇదొక్కటే కాదు.. ఇలాంటివి 16 బెల్టుషాపులున్నాయి. వీటి నిర్వహణలో కీలకపాత్రధారులైన నలుగురు వ్యక్తులు ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొని బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారు.


అవును.. ఇవి మొబైల్‌ బెల్టుషాపులు

* ప్రముఖ పుణ్యక్షేత్రమైన వైయస్‌ఆర్‌ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోనే బైక్‌లపై బెల్టుషాపులు నడుస్తున్నాయి. కొందరు యువకులు మద్యం సీసాలను పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ అడిగిన వారికి సరఫరా చేస్తున్నారు. బాపట్ల జిల్లా చందోలులోనూ ఇదే తరహాలో బైక్‌లపై బెల్టుషాపులు నడుస్తున్నాయి. వీరిలో కొందరు మందుబాబుల నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

* డా.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం, పల్నాడు జిల్లా పాటిబండ్లలో కొందరు బెల్టుషాపుల నిర్వాహకులకు ఫోన్‌ కొడితే చాలు ఇంటికే మద్యం తెచ్చి అందిస్తున్నారు. మరికొందరైతే ఆటోలనే బెల్టుషాపులుగా మార్చేశారు.


ఉదయం అరువు.. సాయంత్రం వసూలు

కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో బెల్టుషాపుల నిర్వాహకులు కొందరు మద్యానికి బాగా బానిసైన వారిని గుర్తించి వారితో ప్రభుత్వ దుకాణాల వద్ద నుంచి మద్యం కొనిపిస్తున్నారు. ప్రతిగా వారికి 90 మి.లీ. ఉచితంగా పోస్తున్నారు.

* ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలకు అరువుపై మద్యం ఇస్తున్నారు. సాయంత్రం వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.


‘బార్లా’ తెరిచేసిన కిళ్లీకొట్లు,ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు

కాకినాడ జిల్లా రాజపూడిలో ప్రధాన రహదారిని ఆనుకుని సుమారు పది దుకాణాల్లో బెల్టుషాపులు నడుస్తున్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.30 వేల విలువైన మద్యం విక్రయిస్తారు. కిళ్లీ కొట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు వెనుక భాగంలో గ్రీన్‌ నెట్‌తో చిన్న గదులు ఏర్పాటు చేసి వాటిని బార్లుగా మార్చేస్తున్నారు. మందుబాబులకు కావాల్సిన ఆహారం, గ్లాసులు వంటివి సరఫరా చేస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. మద్యం అక్రమ రవాణా, అడ్డగోలు విక్రయాలను అరికట్టాల్సిన సెబ్‌ సిబ్బంది ఇటువైపు కన్నెత్తే చూడట్లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా గండిగుండంలోని ఓ రెండు బెల్టు షాపుల వద్ద కూర్చొని తాగేందుకు ఏర్పాట్లు చేశారు.


ఇల్లు, చిల్లర దుకాణాలు.. కావేవీ అనర్హం

* చిల్లర దుకాణాలు, పాన్‌షాప్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, దాబాలు, కిరాణాకొట్లు, కూల్‌డ్రింక్‌ షాపులతో పాటు ఇళ్లల్లోనూ బెల్టుషాపులు నడుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ‘ఈనాడు’ పరిశీలించిన అన్నిచోట్లా ఇదే పరిస్థితి. నెల్లూరు జిల్లాలోని పలుకూరివారిపాలెం, జంగాలపల్లిలో గడ్డివాములు, పశువుల కొట్టాల్లో మద్యం నిల్వ చేసి, విక్రయిస్తున్నారు.

* అనంతపురం జిల్లా విడపనకల్లులో ఓ ఇంట్లో మద్యం సీసాలు నిల్వ ఉంచి రోజూ వచ్చేవారికి అమ్ముతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో కొందరు ఇళ్లల్లోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెరలో ప్రభుత్వ మద్యం దుకాణానికి సమీపంలోని కొన్ని ఇళ్లల్లోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి.

* కైకలూరు, కంచికచర్ల, పెద్దనాగులవరం బడ్డీకొట్లు, శీతల పానీయాల దుకాణాలు, చిల్లరకొట్లలో బెల్టుషాపులు నడుస్తున్నాయి. రావులపాలెంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలోనే బెల్టుషాపులు నడిపిస్తున్నారు.

* అనకాపల్లి జిల్లా కశింకోట, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుల్లో టీ, టిఫిన్‌ దుకాణాలు, కిళ్లీ కొట్లలో యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు.

* శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం గరుగుతండాలో మూడు బెల్టుషాపులు నడిపిస్తున్నారు. కొంతమంది ఇళ్లల్లో నిల్వ ఉంచి తెలిసినవారికి అమ్ముతున్నారు. మరికొందరు కిరాణాదుకాణాల్లో విక్రయిస్తున్నారు. ముదిగుబ్బలోని ప్రభుత్వ దుకాణాల నుంచి వీటికి సరకు సరఫరా అవుతోంది. కర్ణాటక నుంచి అరటిపండ్ల లోడుతోపాటు మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు.

* ప్రభుత్వ మద్యం దుకాణాలకు సమీపంలోని పాన్‌షాపులు, చిల్లర దుకాణాలు నిర్వహించే వారు కొన్నిచోట్ల బెల్టుషాపులు నడుపుతున్నారు. ప్రభుత్వం దుకాణం మూసి ఉన్న సమయంలో ఇక్కడ అమ్మకాలు జరుపుతుంటారు. చాలా చోట్ల బెల్టుషాపులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి.


ఈనాడు - అమరావతి, యంత్రాంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని