రాష్ట్రంలో ఓటర్లు 3,99,84,868

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3,99,84,868కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం గురువారం తుది జాబితాను ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 1,30,728 మంది ఓటర్లు పెరిగారు.

Updated : 06 Jan 2023 06:19 IST

పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ
కొత్తగా జాబితాలో చేరింది 5,97,701 మంది
4,66,973 మంది పేర్ల తొలగింపు
1,30,278 మంది ఓటర్ల పెరుగుదల
తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3,99,84,868కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం గురువారం తుది జాబితాను ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 1,30,728 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది నవంబరు 9న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 3,98,54,093 మంది ఓటర్లు ఉండగా... ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 5,97,701 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. 4,66,973 మందిని తొలగించింది. తుదిజాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. సమగ్ర సవరణ అనంతరం రాష్ట్రంలో నికరంగా 0.33% ఓటర్లు పెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 కోట్లకు 15,132 మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45,951 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

17 జిల్లాల్లో పెరుగుదల... 9 జిల్లాల్లో తగ్గుదల

తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 17 జిల్లాల్లో పెరగ్గా.. 9 జిల్లాల్లో తగ్గింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 30,824 మంది, ఎన్టీఆర్‌ జిల్లాలో 15,690 మంది, బాపట్ల జిల్లాలో 13,678 మంది ఓటర్లు తగ్గారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 28,579 మంది, అనంతపురం జిల్లాలో 27,464 మంది, నంద్యాలలో 18,270 మంది ఓటర్లు పెరిగారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాల్లో కర్నూలు మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అనంతపురం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా తొలిస్థానంలో, పార్వతీపురం మన్యం జిల్లా రెండోస్థానంలో ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి మినహా అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.


శ్రీకాకుళంలో సర్వీసు ఓటర్లు అత్యధికం

అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 16,162 మంది, ప్రకాశం జిల్లాలో 7,063 మంది, విజయనగరంలో 5,460 మంది, బాపట్లలో 4,821 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా ఎన్టీఆర్‌ జిల్లాలో 390 మంది ఉన్నారు.


భీమిలిలో అత్యధికం... పెడనలో అత్యల్పం

* రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో విశాఖ జిల్లాలోని భీమిలి, గాజువాక మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం మూడోస్థానంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 2.36% ఈ మూడుచోట్లే ఉన్నారు.

* అతి తక్కువ ఓటర్లున్న జాబితాలో మొదటి మూడు స్థానాల్లో కృష్ణా జిల్లా పెడన, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, ఆచంట ఉన్నాయి. పెడన, నరసాపురాల్లో కలిపి మొత్తం ఓటర్లు 3,24,175 కాగా... భీమిలి నియోజకవర్గంలో అంతకంటే ఎక్కువగా 3,28,899 మంది ఉన్నారు.


థర్డ్‌ జెండర్‌.. కాకినాడ నగరం, కడప నియోజకవర్గాల్లోనే అత్యధికం

కాకినాడ నగర నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలోనే ఎక్కువమంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,924 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉండగా.. కాకినాడ నగరంలో 139 మంది ఉన్నారు. రెండోస్థానంలోని కడప నియోజకవర్గంలో 99 మంది, మూడోస్థానంలోని నంద్యాల నియోజకవర్గంలో 95 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గాల్లో ఈ ఓటర్లే లేరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని