CBI: వివేకా హత్య వార్త జగన్‌కు ముందే తెలుసు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎం.వి.కృష్ణారెడ్డి ఉదయం 6.15కు ప్రపంచానికి వెల్లడించకముందే హత్య గురించి ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సమాచారం అందినట్లు తేలిందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది.

Updated : 27 May 2023 13:07 IST

ఉదయం 6.15 గంటలకు ముందే ఆయనకు సమాచారం
విషయం చేరవేసిన వైనంపై దర్యాప్తు చేయాల్సి ఉంది
4.11కు వాట్సప్‌లో చురుగ్గా ఉన్న అవినాష్‌రెడ్డి
హత్యానంతరం ఎంపీ ఇంట్లో సునీల్‌ యాదవ్‌
22న అరెస్ట్‌కు యత్నం, శాంతి భద్రతల దృష్ట్యా విరమణ
హైకోర్టులో సీబీఐ అదనపు కౌంటరు
ఈనాడు - హైదరాబాద్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎం.వి.కృష్ణారెడ్డి ఉదయం 6.15కు ప్రపంచానికి వెల్లడించకముందే హత్య గురించి ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సమాచారం అందినట్లు తేలిందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌ను ఐపీడీఆర్‌ ద్వారా పరిశీలిస్తే హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 4.11 గంటలకు వాట్సప్‌లో చురుగ్గా ఉన్నారని, వై.ఎస్‌.జగన్‌కి వివేకా హత్య గురించి సమాచారం అందించడంలో అవినాష్‌రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. వివేకా హత్య అనంతరం అర్ధరాత్రి 1.58 గంటలకు రెండో నిందితుడైన వై.సునీల్‌యాదవ్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉండటం, దీంతోపాటు అవినాష్‌ వాట్సప్‌ వాయిస్‌ కాల్‌లో ఉండటం వంటి అంశాల దృష్ట్యా పోలీసు కస్టడీలో ఎంపీని విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు జారీ చేస్తున్నా విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించకపోవడంతో అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ బృందం కర్నూలు వెళ్లిందని తెలిపింది. అయితే అవినాష్‌ అనుచరులు ఆసుపత్రి దారులను మూసివేసి అడ్డుకోవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఎస్పీ సాయాన్ని కోరినట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ శుక్రవారం అదనపు కౌంటరు దాఖలు చేసింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలును వ్యతిరేకిస్తున్నామని, దర్యాప్తును సత్వరం పూర్తి చేయడానికి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గతంలో విచారణ సందర్భంగా తప్పించుకునే సమాధానాలు చెబుతూ దర్యాప్తునకు సహకరించలేదన్నారు. భిన్నమైన ప్రకటనలు ఇచ్చినట్లు వెల్లడైందని, హత్య వెనుక కుట్రను ఛేదించడానికి ఆయన ముందుకు రావడంలేదన్నారు. పోలీసు కస్టడీలో విచారణ అవసరమని ఇంతకుముందు కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపింది.

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌లో గత నెల 25న కౌంటరు దాఖలు చేసినపుడు అన్ని విషయాలూ కోర్టు ముందు ఉంచామని, తదనంతర పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. అవినాష్‌రెడ్డి మొబైల్‌ ఫోన్‌ను ఐపీడీఆర్‌ ద్వారా పరిశీలిస్తే వివేకానందరెడ్డి హత్యకు ముందు 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి దాటాక 00.27 నుంచి 1.10 (15వ తేదీ)వరకు వాట్సప్‌లో యాక్టివ్‌గా ఉండి.. వాట్సప్‌ కాల్స్‌ కూడా చేశారని తెలిపింది. వివేకానందరెడ్డి హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులు ఆ రాత్రి 1.30 గంటల ప్రాంతంలో వివేకా ఇంట్లోకి చొరబడినట్లు పేర్కొంది. అంతేగాకుండా వివేకా హత్య అనంతరం రెండో నిందితుడైన వై.సునీల్‌యాదవ్‌ ఆ రాత్రి 1.58 గంటలకు వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి/భాస్కరరెడ్డిల ఇంట్లో ఉన్నట్లు మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ సూచించిందని తెలిపింది. 15వ తేదీ తెల్లవారుజామున 4.11 గంటలకు అవినాష్‌రెడ్డి వాట్సప్‌ ద్వారా సంభాషించినట్లు ఐపీడీఆర్‌ పరిశీలనలో తేలిందని సీబీఐ వివరించింది.

తల్లి ఆరోగ్యం సాకుతో విచారణకు ఎగవేత

విచారణ కోసం ఈ నెల 16న 11 గంటలకు హాజరుకావాలంటూ అవినాష్‌రెడ్డికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద 15వ తేదీన నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా 4 రోజులు గడువు కావాలంటూ ఆయన హాజరుకాలేదని తెలిపింది. దీంతో 19న 11 గంటలకు హాజరుకావాలంటూ 16న మరో నోటీసు జారీ చేసినా హాజరుకాకుండా తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, కుదుటపడిన తరవాత హాజరవుతానని ఆయన చెప్పారంది. 19న హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం సాకుతో దర్యాప్తునకు హాజరుకాకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోయారని తెలిపింది. తరువాత ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు నిమిత్తం రావాలని కోరినా రాకుండా పులివెందుల వైపు వెళుతున్నట్లు తెలిసిందని సీబీఐ తెలిపింది.

అవినాష్‌రెడ్డి హాజరు నిమిత్తం కడప ఎస్పీని సాయం కోరామని, అయితే అవినాష్‌ పులివెందుల రాకుండా కర్నూలు వెళ్లారంది. 22న సీబీఐ ముందు హాజరుకావాలని 19న మరో నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. నోటీసును ఇవ్వడానికి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళితే తాళం వేసి ఉందని, పులివెందులలో కూడా అందుబాటులో లేరని తెలుసుకొని అక్కడే ఉన్న వ్యక్తిగత సహాయకుడికి నోటీసును అందజేసినట్లు తెలిపింది. అంతేగాకుండా నోటీసును ఈమెయిల్‌, వాట్సప్‌ ద్వారా కూడా పంపినట్లు తెలిపింది. ఈ నోటీసు నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసుకోవాల్సి ఉందని, అందువల్ల హాజరును 7 రోజులపాటు వాయిదా వేయాలని ఆయన సమాచారం ఇచ్చారని సీబీఐ తెలిపింది.


అరెస్ట్‌కు బయలుదేరాం

ఈ నెల 22న అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడానికి సీబీఐ బృందం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి బయలుదేరిందని, అయితే అక్కడ అవినాష్‌ అనుచరులు గుమిగూడి దారులను బ్లాక్‌ చేశారని సీబీఐ వివరించింది. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న ఆందోళనతో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు కర్నూలు ఎస్పీ సాయం కోరినట్లు తెలిపింది. 22న కూడా ఆయన విచారణకు హాజరుకాలేదని తెలిపింది. జూన్‌ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయినా అవినాష్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా విచారణకు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొంది. ఈ కారణాల నేపథ్యంలో ముందస్తు బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. బెయిలు పిటిషన్‌ను కొట్టివేస్తే జూన్‌ 30లోగా దర్యాప్తు పూర్తి చేయడానికి అవకాశం ఉందని పేర్కొంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు