ఆచూకీ లేని ఏపీ వారు 28 మంది

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో చిక్కుకున్న రాష్ట్రవాసుల్లో 553 మంది సురక్షితంగా బయటపడ్డారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Published : 05 Jun 2023 04:47 IST

ఒడిశాలో స్థిరపడిన ఏపీ వాసి ఒకరు మృతి: బొత్స

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో చిక్కుకున్న రాష్ట్రవాసుల్లో 553 మంది సురక్షితంగా బయటపడ్డారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో 28 మంది ఆచూకీ తెలియడం లేదని వారిలో కొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండగా, కొందరు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో బొత్స సమీక్షించారు. అనంతరం మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

* కోరమాండల్‌, యశ్వంత్‌పూర్‌ రైళ్లలో రాష్ట్రానికి చెందిన 695 మంది టికెట్లు బుక్‌ చేసుకోగా, 92 మంది ప్రయాణం చేయలేదు. ప్రయాణించిన వారిలో 553 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిని స్వస్థలాలకు చేరుస్తున్నాం.

* ఏపీకి చెందిన గురుమూర్తి ఉద్యోగ రీత్యా ఒడిశాలోని బాలేశ్వర్‌లో స్థిరపడ్డారు. స్వస్థలం శ్రీకాకుళం వచ్చి బాలేశ్వర్‌కు యశ్వంత్‌పూర్‌లో వెళ్తూ ప్రమాదంలో చనిపోయారు. మరో 21 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో నలుగురిని విశాఖకు తరలించి చికిత్స చేయిస్తున్నాం. మరో నలుగురు వస్తున్నట్లు సమాచారముంది. 11మంది చికిత్స తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంకా 28 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయి. వారిలో విశాఖకు చెందిన ఆరుగురు, రాజమహేంద్రవరం ఏడుగురు, విజయవాడ ఏడుగురు, ఒంగోలు ఐదుగురు, నెల్లూరుకు చెందిన వారు ముగ్గురు చొప్పున ఉన్నారు. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.

* మొత్తం రైలు ప్రమాద బాధితుల్లో విశాఖ వాసులు 342, రాజమహేంద్రవరం 34, ఏలూరు 10, తాడేపల్లిగూడెం ఇద్దరు, విజయవాడ 176, బాపట్ల 8, గుంటూరు ఇద్దరు, ఒంగోలు 11, నెల్లూరు ముగ్గురు, తిరుపతికి చెందినవారు 107 మంది చొప్పున ఉన్నారు. కోరమాండల్‌లో 484, యశ్వంత్‌పూర్‌ రైలులో 211 మంది ఏపీ వారు ప్రయాణించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు