మీ లాకర్‌ తెరిచారు.. అది మీరేనా?

‘విజయవాడ పటమటలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ)లో ఉన్న మీ బ్యాంకు లాకరును సాయంత్రం 5.32 నిమిషాలకు తెరిచారు. అది మీరేనా? ఒకవేళ మీరు కాకుంటే వెంటనే బ్యాంకు శాఖను సంప్రదించండి’ అని సందేశం వస్తే మీరేం చేస్తారు.

Published : 09 May 2024 07:29 IST

మీరు కాకుంటే బ్యాంకును సంప్రదించండి
ఎస్‌బీఐ ఖాతాదారులకు మొబైల్‌ సందేశాలు
తీరా.. తూచ్‌ అది టెస్టింగ్‌ అంటున్న సిబ్బంది

ఈనాడు, అమరావతి: ‘విజయవాడ పటమటలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ)లో ఉన్న మీ బ్యాంకు లాకరును సాయంత్రం 5.32 నిమిషాలకు తెరిచారు. అది మీరేనా? ఒకవేళ మీరు కాకుంటే వెంటనే బ్యాంకు శాఖను సంప్రదించండి’ అని సందేశం వస్తే మీరేం చేస్తారు. లాకర్‌ ఎవరు తెరిచారో, అందులో ఏం తీశారో అనే ఆందోళన మొదలవుతుంది. పనులన్నీ పక్కన పెట్టేసి, ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని దాటుకుంటూ మరీ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. తీరా అక్కడికెళ్లాక తూచ్‌.. ఇది టెస్టింగ్‌ కోసమే అంటే పరిస్థితి ఏంటి? గుండెబలం తక్కువ ఉన్న వారైతే తట్టుకోగలరా? రెండు మూడు రోజులుగా ఎస్‌బీఐ నుంచి లాకర్‌ వినియోగదారులకు ఇలాంటి సందేశాలే వస్తున్నాయి. దాంతో ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి లాకర్‌ ఎవరు తెరిచారు? అనే ప్రశ్నలు వేస్తున్నారు. లాకర్‌ తెరిచిన సమయాన్ని తెలియజేసేందుకు అలర్ట్‌ పంపే విధానం ప్రారంభించామని, లాకర్‌ తీసుకున్న వారి మొబైల్‌ నంబర్లకు టెస్టింగ్‌ చేస్తున్నామని సిబ్బంది వివరిస్తున్నారు. అయితే దీనిపై ఖాతాదారులు అసంతృప్తిగా ఉన్నారు. సందేశంలో టెస్టింగ్‌ అని పెట్టొచ్చు కదా? ఇంత పెద్ద బ్యాంకింగ్‌ సంస్థకు ఆ మాత్రం తెలియదా అని వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని