కోర్టు ఆదేశించినా స్టీల్‌ప్లాంటుకు బొగ్గు తరలింపునకు అవరోధం

అదానీ గంగవరం పోర్టు నుంచి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారానికి బొగ్గు తరలించడంలో అవరోధం కల్పించవద్దని నిర్వాసిత కార్మికులను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడంతో ‘స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌’ ప్రధాన కార్యదర్శి కె.వెంకట దుర్గాప్రసాద్‌ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

Updated : 09 May 2024 07:33 IST

హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం
ప్రతివాదులకు నోటీసులు

ఈనాడు, అమరావతి: అదానీ గంగవరం పోర్టు నుంచి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారానికి బొగ్గు తరలించడంలో అవరోధం కల్పించవద్దని నిర్వాసిత కార్మికులను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడంతో ‘స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌’ ప్రధాన కార్యదర్శి కె.వెంకట దుర్గాప్రసాద్‌ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. బుధవారం ఈ వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు.. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, అదానీ గంగవరం పోర్టు సీఈవో అమిత్‌ మాలిక్‌, విశాఖ పోలీసు కమిషనర్‌ ఎ రవిశంకర్‌, నిర్వాసిత కార్మికులకు నోటీసులిచ్చింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.జయసూర్య బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ప్రతివాదుల వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేశామని, వాటి అమలుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గంగవరం పోర్టు నుంచి విశాఖ స్టీల్‌ప్లాంటుకు బొగ్గు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ‘స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌’ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల హైకోర్టు విచారించింది. బొగ్గు సరఫరాకు అవరోధం కలిగించొద్దని కార్మికులను ఆదేశించింది. మరోవైపు కార్మికులతో చర్చించాలని పోర్టు యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
సరకు తరలింపు విషయంలో ఎవరినీ అడ్డుకోవద్దు
సరకు రవాణాకు అడ్డంకులు సృష్టించకుండా కార్మికులను నిలువరించాలని, పోర్టు పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ అదానీ గంగవరం పోర్టు అధీకృత ప్రతినిధి శిఖర్‌ నిగమ్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. బుధవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య విచారణ జరిపారు. సరకు తరలింపు విషయంలో ఎవరినీ అడ్డుకోవద్దని, పోర్టు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని కార్మికులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని