ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ జాబితాలో... తెలంగాణకు మిశ్రమ ర్యాంకులు

కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 8వ నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటలేకపోయాయి.

Updated : 06 Jun 2023 06:26 IST

5 విభాగాల్లో టాప్‌-10లో హైదరాబాద్‌లోని కేంద్ర విద్యా సంస్థలు
రాష్ట్ర విద్యాసంస్థలకు దక్కని చోటు
ఏపీ నుంచి ఒక్కటీ కనిపించని వైనం

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 8వ నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటలేకపోయాయి. 2023 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ర్యాంకుల్లో టాప్‌ 10లో తెలంగాణ విద్యాసంస్థలు కనిపించినా, ఏపీ ఆనవాళ్లు అసలే లేవు. మొత్తం 13 విభాగాల్లో... వ్యవస్థాగతంగా అయిదు(ఓవరాల్‌, కాలేజెస్‌, యూనివర్సిటీస్‌, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, ఇన్నోవేషన్‌)... సబ్జెక్టుల వారీగా ఎనిమిది(ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, లా, మెడికల్‌, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, డెంటల్‌, అగ్రికల్చర్‌ అండ్‌ అలైడ్‌) ర్యాంకులు కట్టబెట్టారు. వీటిలోని 5విభాగాల్లో తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు టాప్‌-10లో నిలిచాయి. వాటిలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(యూనివర్సిటీల కేటగిరీలో 10వ ర్యాంకు), హైదరాబాద్‌ నైపర్‌ (ఫార్మసీ విభాగంలో 1వ ర్యాంకు), హైదరాబాద్‌ ఐఐటీ (ఇంజినీరింగ్‌ విభాగంలో 8, ఇన్నోవేషన్‌ విభాగంలో 3వ ర్యాంకు), హైదరాబాద్‌ నల్సార్‌ (లా విభాగంలో 3వ ర్యాంకు) ఉన్నాయి. దేశంలోని విద్యా సంస్థల ప్రతిభను కొలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి ర్యాంకులిస్తోంది. తొలి పోటీలో 3,565 విద్యాసంస్థలు పాల్గొనగా 2023 నాటికి వాటి సంఖ్య 8,686కి పెరిగింది. ఇందులో ఓవరాల్‌ టాప్‌-10 ర్యాంకుల్లో ఐఐటీలు ఏడు, దిల్లీ ఎయిమ్స్‌, దిల్లీ జేఎన్‌యూ, బెంగళూరు ఐఐఎస్‌సీ ఒక్కో ర్యాంకు చేజిక్కించుకున్నాయి. ఇంజినీరింగ్‌ విభాగంలోనూ ఐఐటీలు ఎనిమిది ర్యాంకులు గెలుచుకున్నాయి. మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎంలు 8, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ముంబయి ఎన్‌ఐఐటీ ఒక్కో ర్యాంకును కైవసం చేసుకున్నాయి. కాలేజీ విభాగంలో టాప్‌10లో అయిదు ర్యాంకులను దిల్లీలోని విద్యాసంస్థలు చేజిక్కించుకున్నాయి. అగ్రికల్చర్‌ అండ్‌ అల్లాయిడ్‌ విభాగంలో... ది ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, దిల్లీ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌ విభాగంలో మద్రాస్‌ ఐఐటీ వరుసగా అయిదేళ్లుగా తొలి స్థానంలోనే ఉంటోంది.

తగ్గిన తెలంగాణ విద్యా సంస్థల వాసి...

ప్రతి లక్ష మంది జనాభాకు 50 కళాశాలలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ... ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో సత్తా చాటలేకపోతోంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో మూడు ఈసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. కానీ... రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ర్యాంకింగ్‌ పెరగకపోగా నిరుటికంటే మరింత పడిపోవడం గమనార్హం. ట్రిపుల్‌ఐటీ మాత్రం టాప్‌-100 వర్సిటీల్లో చోటు దక్కించుకుంది. ఆ సంస్థ ఇంజినీరింగ్‌ విభాగంలోనూ 62 నుంచి 55కి చేరుకుంది. తొలిసారిగా హెచ్‌సీయూలోని ఇంజినీరింగ్‌ కళాశాల 71వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఇంజినీరింగ్‌ విభాగంలో ఎస్‌ఆర్‌ వర్సిటీ తప్ప మరో ప్రైవేట్‌ సంస్థ స్థానం సంపాదించలేకపోయింది. ఫార్మసీ కళాశాలలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. నైపర్‌ను మినహాయిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వ, మూడు ప్రైవేట్‌ విద్యాసంస్థలు టాప్‌-100లో స్థానాన్ని పొందాయి. ఈ తీరుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి మాట్లాడుతూ... మరిన్ని రాష్ట్ర విద్యాసంస్థలు టాప్‌-100లో చేరేందుకు ప్రణాళిక రూపొందించుకొని, ముందుకెళతామన్నారు.


100 విద్యా సంస్థలు... 1.42 లక్షల పరిశోధనా పత్రాలు

వాటిలో 53% ఐఐటీలు, ఎన్‌ఐటీల నుంచే

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఇంజినీరింగ్‌ రంగంలో కేవలం ఒక్క ఏడాదిలో ప్రచురితమయ్యే పరిశోధనా పత్రాల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో తొలి 100 స్థానాల్లో నిలిచిన విద్యాసంస్థల నుంచే 62.95% ప్రచురితమమయ్యాయి. వాటిలోనూ 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు... 54 సంస్థల నుంచే 53% రావడం విశేషం. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ కోసం దేశవ్యాప్తంగా 1238 విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటి నుంచి మొత్తం 2,26,506 రీసెర్చ్‌ పబ్లికేషన్లు ఆయా జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. అందులో 1,42,588 పత్రాలు టాప్‌-100 సంస్థల నుంచే వచ్చాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ల సందర్భంగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి దేశంలో మొత్తం 3,600 వరకు ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు ఉండగా...అందులో 1,238 మాత్రమే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌కు దరఖాస్తు చేశాయి. టాప్‌-100 మినహా మిగిలిన 1138 విద్యాసంస్థల అధ్యాపకులు/ఆచార్యుల నుంచి 83,918 పత్రాలు(37.05 శాతం) ప్రచురితమయ్యాయి.

44.51% మందికే పీహెచ్‌డీ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 1238 ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో మొత్తం 1,61,195 మంది బోధనా సిబ్బంది ఉండగా అందులో 71,745 మంది(44.51%) పీహెచ్‌డీ విద్యార్హత కలిగి ఉన్నారు. మిగిలిన 89,450 మందికి పీజీ డిగ్రీ ఉంది. టాప్‌-100 విద్యాసంస్థల్లో 33,891 మంది పనిచేస్తుండగా వారిలో 27,247 మంది(81.20%)కి పీహెచ్‌డీ పట్టా ఉంది. మిగిలిన 1138 ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో 1,27,296 మంది అధ్యాపకులు ఉంటే... వారిలో 44,479 మందే(34.94%) పీహెచ్‌డీ కలిగి ఉన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని