Kishan Reddy: హైదరాబాద్‌ చుట్టూ రైలు మార్గం

‘‘హైదరాబాద్‌ చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర అవుటర్‌ రింగ్‌ రైలు మార్గం నిర్మించనున్నాం. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఇప్పటికే ఆదేశించారు.

Updated : 29 Jun 2023 09:39 IST

ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా నిర్మాణానికి సర్వే
రూ.330 కోట్లతో రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ విస్తరణ
జీనోమ్‌వ్యాలీలో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు లేదని స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: ‘‘హైదరాబాద్‌ చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర అవుటర్‌ రింగ్‌ రైలు మార్గం నిర్మించనున్నాం. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఇప్పటికే ఆదేశించారు. డీపీఆర్‌ రూపకల్పన కోసం స్థల నిర్ధారణ తుది సర్వే చేయడానికి రైల్వే శాఖ రూ.13.95 కోట్లను కేటాయించింది’’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు దిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘సర్వే విషయమై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. అవుటర్‌ రింగ్‌ రైలు మార్గాన్ని దేశంలోనే మొదటిసారి తెలంగాణలో చేపడుతున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ప్రాంతీయ బాహ్య రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌)కి వెలుపల సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలోని విజయవాడ, గుంటూరు, నిజామాబాద్‌, మెదక్‌, కర్నూలు, ముంబయి, వికారాబాద్‌, కరీంనగర్‌ల నుంచి వచ్చే రైలు మార్గాలను అనుసంధానిస్తూ బైపాస్‌లు, ఆర్వోఆర్‌లతో (రైల్‌ ఓవర్‌ రైల్‌ బ్రిడ్జి) సాగే ఈ నిర్మాణంతో ఎక్కడికక్కడ నూతన జంక్షన్లు ఏర్పాటవుతాయి. అవుటర్‌ రింగ్‌ రైలుతో దూర ప్రాంతాల ప్రజలు సికింద్రాబాద్‌, కాచిగూడలకు రాకుండానే ప్రయాణం సాగించే వీలుంటుంది. నూతనంగా ఏర్పడే జంక్షన్ల సమీపంలోని పట్టణాలు, గ్రామాల ప్రజలకు నగరంలోకి రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు ఇప్పటికే సాగుతున్నాయి. అయితే... భూ సేకరణ పరిహారం చెల్లింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన ఆర్‌ఆర్‌ఆర్‌, అవుటర్‌ రింగ్‌ రైలుతో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో, వ్యాపార, రవాణా రంగంలో గణనీయ మార్పులు వస్తాయి.  అలాగే 61 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్‌-హసన్‌పర్తి అనుసంధాన రైలు  మార్గం స్థల నిర్ధారణ తుది సర్వే కోసం రైల్వే శాఖ రూ.1.50 కోట్లను మంజూరు చేసింది.

యాదాద్రి కోసం రాయగిరి వరకు కేంద్రం నిధులతో ఎంఎంటీఎస్‌-2

యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య పెరగడంతో వారి సౌకర్యార్థం ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల ఎంఎంటీఎస్‌ మార్గాన్ని కేంద్రం సొంత నిధులతో పొడిగించనుంది. ఎంఎంటీఎస్‌ రెండో దశ కింద దాన్ని పొడిగించాలని సూచిస్తే... మూడింట రెండొంతుల వ్యయాన్ని భరించడానికి ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నూతన భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన సమయంలో ఎంఎంటీఎస్‌ విస్తరణ అంశాన్ని ఆయన దృష్టికి నేను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశంతో ఎంఎంటీఎస్‌-2 దశ కింద ఈ రైలుమార్గం విస్తరణకు రూ.330 కోట్లు అవుతాయని రైల్వే శాఖ అంచనా వేసింది. త్వరలోనే టెండర్లు పిలుస్తుంది.

ఎన్సీడీసీ ఏర్పాటుకు ఇప్పటికే లేఖ రాశా

తెలంగాణలో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికోసం స్థలం కేటాయించాలని గతంలోనే నేను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు రాశా. కానీ, ఆయన నుంచి స్పందన కరవైంది. అవసరమైన భూమిని జీనోమ్‌వ్యాలీలో కేటాయించి, కేంద్ర వైద్య శాఖకు అప్పగిస్తే వెంటనే భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. భూ కేటాయింపు, బదలాయింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి లేఖ రాస్తా.

రూ.2,102 కోట్ల కేటాయింపునకు ఆమోదం

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం కింద (50 సంవత్సరాలకు వడ్డీలేని రుణాలు) నిధులు కేటాయించింది. అందులో తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. వాటిని విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చు. ఈ పథకంలో 2021 నుంచి ఇప్పటివరకు తెలంగాణకు రూ.5,221 కోట్లు మంజూరు చేసి, రూ.4,144 కోట్లు విడుదల చేశాం. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,696 కోట్లు పూర్తిగా వినియోగించుకుంది. వినియోగ ధ్రువపత్రాలు సమర్పిస్తే కేంద్రం మిగతా నిధులను విడుదల చేస్తుంది’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.


తెలంగాణ పార్టీ అధ్యక్ష మార్పు లేదు

తెలంగాణలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై తమ పార్టీలో చర్చ జరగలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంలో భాజపా కార్యకర్తల్లో ఎలాంటి అనుమానాలు లేవని మీరే (మీడియాను ఉద్దేశించి) గందరగోళం చేస్తున్నారని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ వార్తలు ఎందుకొచ్చాయో తమకు తెలియదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవనుండడంపై ప్రశ్నించగా... మంత్రుల బృందం సమావేశానికి ముందు అమిత్‌ షాను కలవబోతున్నానని, వేరే సమావేశంలోనూ ఇంతకుముందే ఆయన్ని కలిశానని తెలిపారు. ఒకరిద్దరు ఇతర పార్టీల్లోకి పోయినంత మాత్రాన ఏమీ జరగదంటూ కాంగ్రెస్‌లో చేరికలపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందనే అంశాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళతానని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని