Margadarsi: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నిరాధార, ఊహాజనిత ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న జగన్‌ ప్రభుత్వం.. తాజాగా మరోసారి కక్ష సాధింపు చర్యలకు తెగబడింది.

Updated : 18 Aug 2023 06:58 IST

మూసివేత లక్ష్యంగా చర్యలకు తెగబడ్డ ప్రభుత్వం
సీఐడీ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సోదాలు
సీసీ కెమెరాలన్నీ ఆపేసి, సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీలు
డబ్బులు చెల్లించటానికి వచ్చిన చందాదారులకు అనుమతి నిరాకరణ
గేట్లకు తాళాలేసి, తలుపులు మూసేసి సోదాలు
సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం  
రాత్రిపూటా తనిఖీలు
బ్రాంచ్‌లు కొనసాగుతున్న భవనాల యజమానులను పిలిపించి పత్రాలు సమర్పించాలని ఆదేశాలు

ఈనాడు, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నిరాధార, ఊహాజనిత ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న జగన్‌ ప్రభుత్వం.. తాజాగా మరోసారి కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. ఎలాగైనా సరే మార్గదర్శిని మూసివేయించాలన్న కుట్ర, దురుద్దేశంతో సీఐడీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలనూ మార్గదర్శి పైకి పంపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గదర్శి చిట్స్‌ వ్యాపారం జరగనీయకుండా చూడాలన్న దుర్బుద్ధితో చేసిన ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితమివ్వకపోవటంతో.. వివిధ ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకుని వేధింపులకు తెరలేపింది. మార్గదర్శిపై ఎలాంటి తీవ్రమైన చర్యలూ తీసుకోవద్దని, చందాదారులను ఇబ్బందులకు గురిచేయ వద్దని ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి చిట్స్‌కు సంబంధించిన 37 బ్రాంచిల్లో గురువారం సోదాలు జరిపింది. సీఐడీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అగ్నిమాపకశాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ ఇంటలిజెన్స్‌, పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు మార్గదర్శి చిట్స్‌ బ్రాంచీల్లో తనిఖీలు కొనసాగాయి. కొన్నిచోట్ల సాయంత్రం 6 గంటలతో తనిఖీలు ముగించినట్లే ముగించి.. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో తలుపులు తీయించి సోదాలు మొదలుపెట్టాయి.

విజయనగరం తదితర చోట్ల సీఐడీ, పోలీసు సిబ్బంది రాత్రి మార్గదర్శి బ్రాంచీల్లోనే పడుకున్నారు. సోదాల పేరిట సంస్థ సాధారణ వ్యాపార కార్యకలాపాలకు అధికారులు తీవ్ర ఆటంకం కలిగించారు. డబ్బులు కట్టడానికి వచ్చిన చందాదారులను ఇబ్బందులకు గురిచేశారు. పలు బ్రాంచిల్లో గేట్లు, తలుపులు మూసేసి లోపలికి ఎవర్నీ రానీయకుండా, లోపలున్న వారిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పలుచోట్ల తనిఖీ బృందాల సిబ్బంది మాస్కులు ధరించి లోపలికి ప్రవేశించారు. తనిఖీలకు వచ్చిన వెంటనే బ్రాంచ్‌లోని సీసీ కెమెరాలన్నింటినీ ఆపేశారు. మార్గదర్శి సిబ్బంది మినహా ఇతర వ్యక్తులందర్నీ బయటకు పంపించేశారు. పలుచోట్ల మార్గదర్శి బ్రాంచి కార్యాలయాలు కొనసాగుతున్న భవనాల యజమానులను పిలిపించి ఆ స్థలానికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు, భవన నిర్మాణ అనుమతులు, విద్యుత్తు బిల్లుల రసీదులు, ఆస్తిపన్ను చెల్లింపు రసీదు వంటివి సమర్పించాలని ఆదేశించారు. అగ్రిమెంట్‌ ఎప్పటివరకూ ఉందనే అంశంపై ఆరా తీశారు. కొన్ని చోట్ల ఆయా భవనాల చుట్టూ కొలతలు తీసుకున్నారు. అగ్నిమాపక శాఖాధికారుల ఆయా భవనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపాలేమైనా ఉన్నాయా? అని వెతికారు. పలుచోట్ల చీటీపాటలకు సంబంధించిన మినిట్స్‌ పరిశీలించారు. పెద్ద మొత్తాలకు సంబంధించిన చిట్లు వేసిన వారిని పిలిపించి ప్రశ్నించారు. విజయనగరంలో షణ్ముఖరావు అనే ఖాతాదారు ఇంటికి రాత్రి 8 గంటల ప్రాంతంలో  పోలీసులను పంపించి పిలిపించి చిటీ గురించి విచారించారు.

చందాదారుల్ని వెనక్కి పంపించేసి

  • విజయనగరంలో మార్గదర్శి బ్రాంచ్‌ గేటు బయట పోలీసులను కాపలాగా పెట్టి.. లోపలికి ఎవర్నీ అనుమతించలేదు. డబ్బులు కట్టటానికి వచ్చిన చందాదారులను తనిఖీలు జరుగుతున్నాయని చెప్పి వెనక్కి పంపించేశారు.
  • తిరుపతిలోనూ చందాదారుల్ని కార్యాలయం లోపలికి అనుమతించలేదు. ఒకాయనను లోపలికి పిలిపించి దాదాపు 40 నిమిషాల పాటు ఆయన వ్యక్తిగత వివరాలపై ప్రశ్నల వర్షం కురిపించి భయభ్రాంతులకు గురిచేసి బయటకు పంపారు.
  • ఏలూరులో మార్గదర్శి బ్రాంచ్‌ గేటుకు తాళం వేసి. లోపల నుంచి తలుపులు మూసేసి సోదాలు జరిపారు. దీంతో అక్కడ వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
  • విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ బ్రాంచ్‌ ప్రధాన తలుపులకు తాళాలు వేశారు. డబ్బులు కట్టేందుకు వచ్చామంటూ కొంతమంది చందాదారులు తలుపులు కొట్టినా తెరవలేదు.
  • గోపాలపట్నం బ్రాంచ్‌లోనూ తలుపులన్నీ  మూసేసి తనిఖీలు జరిపారు. దీంతో వివిధ పనులపై వచ్చిన చందాదారులు వెనుదిరిగారు.
  • కాకినాడలో చందాదారులను కార్యాలయం లోపలికి అనుమతించకపోవటంతో వారు వెనుదిరిగారు.
  • ప్రొద్దుటూరులో తొలుత చందాదారుల్ని అడ్డుకున్నారు. చందాదారుల్ని ఇబ్బందులకు గురిచేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అధికారులకు మార్గదర్శి తరఫు న్యాయవాదులు చూపించటంతో ఆ తర్వాత వారిని అనుమతించారు.

సీసీ కెమెరాలు ఆపేసి..

విజయవాడ వన్‌టౌన్‌, విశాఖపట్నంలోని గోపాలపట్నం, నెల్లూరులోని వేదాయపాలెం తదితర బ్రాంచీల్లోని సీసీ కెమెరాలను సీఐడీ సిబ్బంది ఆపేశారు. డాబా గార్డెన్స్‌లో సీసీ కెమెరాలు నిలిపేయాలని సూచించారు. ఎలక్ట్రీషియన్లు అందుబాటులో లేకపోవటంతో సీసీ కెమెరాను ఎరుపు రంగు రుమాలుతో కప్పేశారు. చాలా బ్రాంచీల్లోని మార్గదర్శి సిబ్బంది  సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

భవన యజమానులకు బెదిరింపులు

అనంతపురంలో మార్గదర్శి కార్యాలయం కొనసాగుతున్న భవన యజమానిని పిలిపించి ఆ స్థలానికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు, భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలు, విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపు పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. అమలాపురంలో భవన యజమానిని పిలిపించి మార్గదర్శితో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని పరిశీలించారు. పన్నుల చెల్లింపు రసీదులను అడిగి తీసుకున్నారు. గుడివాడలో భవన యజమానిని రావాలని ఆదేశించారు.

భవనాలకు కొలతలు.. అగ్నిమాపక శాఖాధికారులతో తనిఖీలు

విశాఖపట్నంలోని పీఎంపాలెం మార్గదర్శి బ్రాంచ్‌ కొనసాగుతున్న భవనాన్ని నగర ప్రణాళిక విభాగం కార్యదర్శులు పరిశీలించారు. ఆ భవనం హద్దులకు సంబంధించిన కొలతలు తీసుకున్నారు. జీవీఎంసీ నుంచి తగిన అనుమతులున్నాయా? లేదా? పరిశీలించారు. ఎన్‌ఏడీలోని బ్రాంచ్‌ ఉన్న భవనం చుట్టూ కొలతలు వేసి.. వివరాలు నమోదు చేసుకున్నారు. భవన యజమానికి ఫోన్‌ చేసి సేఫ్టీ అంశాలపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.

బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు

చిట్‌రిజిస్ట్రార్‌లు రమ్మంటున్నారంటూ గుంటూరులోని అరండల్‌పేట బ్రాంచ్‌ నుంచి సీఐడీ అధికారులు కొంతమంది ఖాతాదారులకు ఫోన్లు చేసి పిలిపించారు. ఓ మహిళా ఖాతాదారు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నరసరావుపేటలో మార్గదర్శి ఏజెంట్‌ను పిలిపించి ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? చిట్‌ మార్కెటింగ్‌ ఎలా చేస్తారు? తదితర వివరాలు గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. తెనాలి బ్రాంచ్‌లో మన్నె రామకృష్ణను బెదిరించి.. ఆయనతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. కర్నూలులో మార్గదర్శి మేనేజర్‌ నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. తాము రాసుకున్న వాంగ్మూలాలపై సంతకాలు చేయాలని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు.

  • చిత్తూరులో మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్‌పై కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు.

మార్గదర్శి చందాదారులకు ఫోన్లు చేస్తున్న అధికారులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: మార్గదర్శిపై కక్ష కట్టిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఖాతాదారులకు ఫోన్లు చేసి మార్గదర్శితో ఏమైనా ఇబ్బందులున్నాయా అంటూ వాకబు చేస్తోంది. రాత్రిళ్లు సైతం అధికారులు ఖాతాదారులకు ఫోన్లు చేయడం గమనార్హం. దీనిపై ఖాతాదారులు గట్టిగానే వారికి సమాధానమిస్తుండటంతో కంగుతింటున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన కోలా రాధాకృష్ణనాయుడుకు గురువారం రాత్రి 7.10 గంటలకు ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి మీరు మార్గదర్శి ఖాతాదారేనా అని అడుగుతూ మీకు ఏమైనా ఇబ్బందులున్నాయా..? అని ప్రశ్నించారు. రాధాకృష్ణ అసలు మీరెవరూ, ఎందుకు ఫోన్‌ చేశారని ప్రశ్నించడంతో ఆ వ్యక్తి తను మచిలీపట్నం చిట్స్‌ రిజిస్ట్రార్‌ను అని చెప్పడంతో తను, తన భార్య 35 ఏళ్లుగా మార్గదర్శి ఖాతాదారులమని, ఏనాడూ తనకు మార్గదర్శి వలన ఇబ్బందులు ఎదురుకాలేదని బదులిచ్చారు. అసలు నాకెందుకు రాత్రిపూట ఫోన్‌ చేశారంటూ ఆయన నిలదీశారు. దీంతో అవతలి వ్యక్తి ఫోన్‌ పెట్టేశారు. తర్వాత కాసేపటికి అదే నంబరు నుంచి మరో వ్యక్తి ఫోన్‌ చేసి మాట్లాడుతూ అసలు మీకు ఆదాయ మార్గాలు ఏంటని ప్రశ్నించడంతో రాధాకృష్ణ ఆగ్రహంతో.. అన్నీ పక్కాగానే ఉన్నాయి, వివరాలు మీకెందుకు చెప్పాలి అని నిలదీయడంతో ఫోన్‌ పెట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు