AP Roads - CM Jagan: సాఫీ ప్రయాణం సీఎంకేనా?

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా చింతపల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి ఇలా అధ్వానంగా మారింది. నెల కిందట గుంతల్లో కంకరవేశారు. తర్వాత పనులు చేయకపోవడంతో కంకర కూడా పోయి, మళ్లీ గుంతలతో నిండిపోయింది.

Updated : 08 Sep 2023 08:47 IST

రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా మారిన రహదారులు
గోతులు తేలిన రోడ్లపై వాహనదారుల నరకయాతన
మరమ్మతులు లేక ప్రమాదాల బారినపడుతున్న జనం
వర్షాలకు మరింతగా దిగజారిన పరిస్థితులు
ఎక్కడ గొయ్యి ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలియని దుస్థితి
ఈనాడు - అమరావతి, ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా చింతపల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి ఇలా అధ్వానంగా మారింది. నెల కిందట గుంతల్లో కంకరవేశారు. తర్వాత పనులు చేయకపోవడంతో కంకర కూడా పోయి, మళ్లీ గుంతలతో నిండిపోయింది.


ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయటకు వెళ్లేదే తక్కువ... ఎక్కువ సందర్భాల్లో ఆయన హెలికాప్టర్‌లోనే ప్రయాణిస్తుంటారు. ఏ విజయవాడలో జరిగే కార్యక్రమానికో పొరపాటున రోడ్డు మార్గంలో వెళుతుంటే, ఆయన ప్రయాణం సాఫీగా... చిన్న కుదుపులు కూడా తెలియకుండా... పూల తేరుపై వెళ్లినట్టుగా... మెత్తగా సాగేలా అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సీఎం ఆ మార్గంలో వెళుతున్నారని ఇటీవల తాడేపల్లి నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే సర్వీసు రోడ్డులో ఉన్న స్పీడ్‌ బ్రేకర్లని (మల్టిపుల్‌ బంప్స్‌) ఎత్తూపల్లాలు తీసేసి నున్నగా మార్చేశారు. సీఎం ప్రయాణించే ఖరీదైన వాహనంలో సాధారణంగా కుదుపులు తెలియవు. అయినా... ఆయనకు ఆ కొద్దిపాటి అసౌకర్యం కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సీఎం కోసం ఆ మాత్రం ఏర్పాట్లు చేయడంలో తప్పులేదు. కొన్ని వారాల క్రితం విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళుతున్నారని... ముందు రోజు మధ్యాహ్నం కృష్ణా నదిపై గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే బ్రిడ్జిపై ఒక వరుస రహదారిలో ట్రాఫిక్‌ ఆపేసి, పోలీసుల్ని కాపలాపెట్టి మరీ యుద్ధప్రాతిపదికన రోడ్డుకు మరమ్మతులు చేశారు. జాతీయ రహదారిపై కొన్ని నిమిషాలు ట్రాఫిక్‌ నిలిచిపోతేనే తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అలాంటిది కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపేసి పనులు చేశారు. ఆ వేగం హర్షణీయమే..! ముఖ్యమంత్రికి చిన్నపాటి కుదుపులు కూడా లేకుండా అధికారులు అంతగా తపన పడుతున్నారే..! మరి ఓట్లేసి జగన్‌కు సీఎం పదవి కట్టబెట్టిన కోట్ల మంది ప్రజల పరిస్థితేంటి..? రాష్ట్రంలో అనేకచోట్ల రహదారులు ఛిద్రమై, పెద్ద పెద్ద గోతులతో దారుణంగా మారి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే అసలేమాత్రం పట్టించుకోరా? భారీ గోతులన్నీ వర్షాలకు చెరువుల్లా మారి... అసలు రోడ్డు ఎక్కడుందో వెతుక్కోవలసిన దుస్థితిలో ఉంటే... వాటిపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుంటే.. కనీసం ఆ గోతులు పూడ్చేందుకూ చేతులు రావా? చాలాచోట్ల గోతులు తప్ప రోడ్డే కనిపించనంత దారుణమైన పరిస్థితులున్నా... కనీస మరమ్మతులూ ఎందుకు చేయరు? సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు... అక్కడ ఆయన ప్రయాణించే రెండు, మూడు కిలోమీటర్ల రోడ్లను యుద్ధప్రాతిపదికన అద్దంలా మార్చేస్తున్నారే..! మరి ప్రజలు ఏళ్ల తరబడి అవే రోడ్లపై, తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణిస్తుంటే... వారి కష్టాలు అధికారులకు కనిపించవా? సీఎం మాత్రమే సాఫీగా ప్రయాణించాలా? ఆయన్ను ఎన్నుకున్న ప్రజలు ఎలా పోయినా ఫర్వాలేదా?

రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ రహదారులు అత్యంత అధ్వానంగా మారాయి. భారీ గుంతలతో ప్రమాదకరంగా ఉన్నాయి. మూడు నెలలుగా వర్షాలు కురుస్తున్నా, ఏ రహదారిలోనూ గుంతలు పూడ్చిన దాఖలాల్లేవు. అత్యంత ఘోరంగా మారిన రహదారుల పునరుద్ధరణ (రెన్యువల్‌) గురించి ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. నాలుగేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే బ్యాంకు రుణం తీసుకొని, పునరుద్ధరించింది. పెట్రోల్‌, డీజిల్‌పై రహదారి అభివృద్ధి పన్ను పేరిట... లీటరుకి రూపాయి చొప్పున నెలకు రూ.50 కోట్లు, ఏడాదికి రూ.600 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ నిధులతో కనీసం గుంతలు కూడా పూడ్చకపోవడం వారికి ద్రోహం చేయడం కాదా? ఇది రాష్ట్రంలో కొన్ని కోట్ల గొంతుకల నుంచి వస్తున్న ప్రశ్న..?
రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వానంగా, భయంకరంగా ఉన్నాయో ఈ చిత్రాల్ని చూస్తే కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది.


విజయనగరం

విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం నుంచి కొఠారిపురం, లక్ష్మీపురం గ్రామాలకు వెళ్లే రహదారి ఇది. ఏళ్ల తరబడి దీనికి కనీస మరమ్మతులూ చేయడంలేదు. ఇటీవలే దీని మరమ్మతులకు రూ.50 లక్షల మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు.


విజయవాడ నుంచి రేపల్లెకు కృష్ణానది కరకట్ట మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రు వద్ద గుంతలు తప్పించే క్రమంలో రోడ్డు అంచులోకి వెళ్లి ఇలా కూరుకుపోయింది. మరొక్క అడుగు పక్కకు వెళ్లివుంటే.. 15 అడుగుల దిగువకు  దూసుకుపోయేది. డ్రైవర్‌ బస్సును అదుపుచేశారు. అందులోని 40 మంది ప్రయాణికులు డ్రైవర్‌ డోర్‌, అత్యవసర ద్వారం నుంచి బయటకు వచ్చారు.


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని గుడిమెళ్లంక వంతెన కూడలి నుంచి చింతలపల్లి కళింగుల కూడలి వరకు ఆర్‌అండ్‌బీ రహదారి దుస్థితి ఇది. ఇందులో 4.6 కి.మీ. అభివృద్ధికి న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) ప్రాజెక్ట్‌ కింద రూ.11 కోట్లు మంజూరైనా, గుత్తేదారు పనులు చేయడంలేదు.


శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి కూడలిలో గోతులమయమైన అలికాం-బత్తిలి ఆర్‌అండ్‌బీ రహదారి. ఈ రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినా, నిధులు మాత్రం కేటాయించడంలేదు.


ప్రకాశం

ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం-ముడివేముల రహదారి దుస్థితి ఇది. 9 కిలోమీటర్లలో కొంత పీఆర్‌, మరికొంత ఆర్‌అండ్‌బీకి చెందినది ఉంది. ఏళ్ల తరబడి ఇది
మరమ్మతులకు, రెన్యువల్‌కు నోచుకోవడం లేదు.


పశ్చిమగోదావరి

భారీ గుంతలతో అధ్వానంగా మారిన ఈ మార్గం పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నుంచి కోపల్లె వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు. నాలుగేళ్లుగా దీని నిర్వహణను పట్టించుకోవడం లేదు.


ఎన్టీఆర్‌ జిల్లా

మోస్తరు వర్షం కురిసినప్పుడు.. భారీ వర్షం తరువాత రోడ్డు దుస్థితిని తెలియజేస్తున్న ఈ చిత్రాలు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ శివారు నిడమానూరు గ్రామానికి వెళ్లే మార్గానివి. ఇక్కడ వర్షపునీరు పోయే అవకాశంలేక వాన కురిసిన ప్రతిసారి రహదారి చెరువులా మారిపోతుంది. ఎక్కడ గుంత ఉందో తెలియక నిత్యం పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.


చిత్తూరు

చిత్తూరు నగరంలో కట్టమంచి నుంచి సాంబయ్యకండ్రిగ వరకు ఉన్న 3 కి.మీ. బైపాస్‌ రహదారి ఇది. నాలుగేళ్లుగా ఇది అధ్వానంగా మారింది. పురపాలిక రోడ్‌గా ఉన్న దీనిని ఆరు నెలల కిందట   ఆర్‌అండ్‌బీకి బదలాయించారు. అయినా దీనికి మోక్షం కలగలేదు.


నంద్యాల

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానందికి వెళ్లే రహదారి అడుగడుగునా గుంతలతో నిండిపోయింది. మహానంది నుంచి మహానంది ఫారం వరకు 3 కిలోమీటర్ల మేర ఘోరంగా మారడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోడ్డు అభివృద్ధికి రెండేళ్ల కిందట రూ.8 కోట్ల నిధులు విడుదలైనా పనులు చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఉన్నాయని, త్వరలో పనులు చేస్తామని ఇంజినీర్లు చెబుతూనే ఉన్నారు.


కర్నూలు

కర్నూలు జిల్లాలో ఆదోని-రాయచూరు రహదారిలో భారీ గుంతలు ఏర్పడటంతో.. స్థానిక దుకాణదారులు ఇలా రాళ్లు అడ్డంగాపెట్టి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.


గుంటూరు

విజయవాడ-అమరావతి మార్గంలో రాజధాని గ్రామం తుళ్లూరు టిడ్కో గృహాల వద్ద రహదారి గుంతలో ఇరుక్కుపోయిన వాహనం. ఇసుక లారీల రాకపోకలతో ఈ రోడ్డు ఘోరంగా తయారైంది.


కృష్ణా

కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో భీమవరం రోడ్‌ నుంచి చౌటపల్లి గ్రామానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ   రహదారిలో సగం భాగం ఇలా కోతకు గురైంది. అయిదేళ్లుగా దీనికి కనీసం మరమ్మతులు కూడా చేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని