మహిళల భద్రతపై జగన్‌ సర్కారు చిత్తశుద్ధి ఇదేనా?

మహిళల భద్రతపై ఎప్పుడు ప్రస్తావించినా... ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు ‘దిశ బిల్లు’ గురించి తెగ గొప్పలు చెబుతారు. సుచరిత హోం మంత్రిగా ఉండగా.. అమలులో లేని దిశ చట్టం కింద శిక్షలు కూడా వేసేసినట్టు చెప్పి నవ్వులపాలయ్యారు.

Updated : 23 Sep 2023 06:29 IST

మూడున్నరేళ్లుగా కేంద్రం వద్దే నానుతున్న దిశ బిల్లు
ఇంతకాలం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారట

ఈనాడు, అమరావతి: మహిళల భద్రతపై ఎప్పుడు ప్రస్తావించినా... ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు ‘దిశ బిల్లు’ గురించి తెగ గొప్పలు చెబుతారు. సుచరిత హోం మంత్రిగా ఉండగా.. అమలులో లేని దిశ చట్టం కింద శిక్షలు కూడా వేసేసినట్టు చెప్పి నవ్వులపాలయ్యారు. దిశ బిల్లు మూడున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరే నానుతోందన్నది పచ్చి నిజం. ఆ విషయాన్ని శాసన సభ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది. తెదేపా సభ్యులు ఆదిరెడ్డి భవానీ తదితరులు అడిగిన ప్రశ్నకు తెలిపిన సమాధానంలో రాష్ట్ర హోంశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. దిశ చట్టం ఏర్పాటు కోసం క్రిమినల్‌ లా సవరణ, దిశ చట్టం ఏర్పాటు, మహిళలపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు నిమిత్తం 2019లో శాసన సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టామని, అవి అప్పటి నుంచి కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దీన్నిబట్టి మహిళల భద్రతపై జగన్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జగన్‌ ఎన్నిసార్లు దిల్లీ వెళ్లి ఉంటారు? కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఎన్నిసార్లు కలిసి ఉంటారు? నిజంగానే వైకాపా సర్కారుకు మహిళల భద్రతపై అంత శ్రద్ధ ఉంటే, గట్టిగా ప్రయత్నించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఎందుకు పొందలేదు? కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ, పార్లమెంటులో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక బిల్లులకు బేషరతుగా మద్దతు పలుకుతున్న జగన్‌ ప్రభుత్వం.. దిశ బిల్లుకి ఎందుకు ఆమోదం పొందలేకపోయింది? మూడున్నరేళ్లయినా ఎందుకు చట్టం చేయలేకపోయింది? దీన్నిబట్టే మహిళల భద్రతపై జగన్‌ ప్రభుత్వానివి ఉత్తుత్తి మాటలేనని, చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతోంది. 2019 నుంచి రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు.. 2019లో 17,746, 2020లో 17,089, 2021లో 17,752 నేరాలు చోటుచేసుకున్నట్లు రాష్ట్ర హోం శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని