APSRTC Drivers: ప్రాణాలపై ఆశలొదులుకున్నాం

ఒక్కసారిగా అంతమంది తమపై దాడి చేయడానికి రావడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని.. దేవుడి దయతోనే బతికి బయటపడ్డామని కావలిలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌లు బి.ఆర్‌.సింగ్‌, శ్రీనివాసరావులు వాపోయారు.

Updated : 29 Oct 2023 09:49 IST

కావలి వద్ద దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్లు బి.ఆర్‌.సింగ్‌, శ్రీనివాసరావు

ఈనాడు - అమరావతి, నెల్లూరు: ఒక్కసారిగా అంతమంది తమపై దాడి చేయడానికి రావడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని.. దేవుడి దయతోనే బతికి బయటపడ్డామని కావలిలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌లు బి.ఆర్‌.సింగ్‌, శ్రీనివాసరావులు వాపోయారు. తమపై విచక్షణారహితంగా దాడి చేసిన 14 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక విజయవాడకు చేరుకున్న వారు.. ‘ఈటీవీ’తో మాట్లాడారు. ఘటన జరిగిన తీరు, పడిన వేదన.. వారి మాటల్లోనే

వైకాపా నాయకులంటున్నారు...

బి.ఆర్‌. సింగ్‌ మాట్లాడుతూ.. ‘కావలి డిపో నుంచి బయటకొచ్చాక.. ఒక సైకిల్‌ బస్సు దగ్గరగా వస్తుంటే హారన్‌ కొట్టా.. దీంతో మా ముందు కారులో వెళుతున్నవారు ఆగి మా వద్దకు వచ్చారు. ఏం తప్పు చేశానని అడిగేలోపే హారన్‌ ఎందుకు కొట్టావంటూ దాడికి దిగారు. ఇంతలో పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపించేశారు. బస్సు శివార్లలోకి వచ్చాక నిందితులు మరి కొంతమందితో కలిసి మూడు కార్లలో వచ్చారు. మా దగ్గరకు వచ్చి మళ్లీ అసభ్యకరంగా తిడుతూ కొట్టారు. తెలుపు రంగు దుస్తుల్లో ఉన్న వ్యక్తి గట్టిగా కొట్టాడు. అడ్డుకోబోయిన వారిపైనా దాడికి దిగారు. నన్ను కొట్టిన వ్యక్తి స్థానిక కౌన్సిలర్‌ అట..అక్కడున్న వాళ్లను అడిగితే వాళ్లు వైకాపా వాళ్లన్నారు. వారు ఏ పార్టీ అనేది నాకైతే సరిగా తెలియదు. మాపై దాడి చేసిన 14 మంది ఫొటోలూ నా వద్ద ఉన్నాయి. ఆ సమయంలో రవాణా శాఖమంత్రి వాహనం అటుగా వస్తోందని పోలీసులు మమ్మల్ని పక్కకు లాగేశారు. మంత్రి వాహనం వెళ్లిపోయాక సీఐ వచ్చి విషయం తెలుసుకున్నారు. వారిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నా మా(ఆర్టీసీ) ఎండీ కూడా ఈ విషయంలో స్పందించాలి’ అని విజ్ఞప్తి చేశారు. రెండో డ్రైవర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘మాపై వారు రౌడీల్లా దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన మా బస్సులోని కొందరు ప్రయాణికులపై దాడి చేయబోతే వారు తప్పుకొన్నారు. ఒకరికి దెబ్బ కూడా తగిలింది. ఇప్పుడు మాకు జరిగింది.. రేపు మరో డ్రైవర్‌కు జరగదని నమ్మకం ఏముంది?’ అని ప్రశ్నించారు.

నేడు నల్లబ్యాడ్జీలతో విధులకు..

ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఘటనకు నిరసనగా ఆర్టీసీ ఉద్యోగులంతా ఆదివారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని, డిపోల వద్ద నిరసనలు తెలపాలని ఈయూ, ఎన్‌ఎంయూఏ పిలుపునిచ్చాయి. నిందితులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ డీజీపీ, ఆర్టీసీ ఎండీకి ఎన్‌ఎంయూఏ వినతిని అందజేసింది. సోమవారం నెల్లూరు కలెక్టర్‌, ఎస్పీని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఈయూ తెలిపింది. బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, కార్మిక పరిషత్‌, టీఎన్‌టీయూసీ వేర్వేరు ప్రకటనల్లో కోరాయి. ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ రామ్‌సింగ్‌ని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు పరామర్శించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల సూచన మేరకు బాధితుడిని పరామర్శించారు. టీఎన్‌టీయూసీ నాయకులు శనివారం రాత్రి ఆటోనగర్‌ ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు

కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాంసింగ్‌పై జరిగిన దాడి ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఆదివారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు.

అంత దారుణంగా కొడతారా?: లోకేశ్‌

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనపై నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై వైకాపా నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారని ట్వీట్‌లో విమర్శించారు.

పోలీసులు దుండగులతో కుమ్మక్కయ్యారు: వైకాపా ఎమ్మెల్యే

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసినవారు నరరూప రాక్షసులని వైకాపాకు చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు పోలీసులు వారితో కుమ్మక్కై నేరాలకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వీడియో విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని