ఇవి పోలీసు హత్యలు కావా?

‘నన్ను, నా కుటుంబసభ్యుల్ని కొంతమంది కొట్టారు.. నాకు న్యాయం చేయండి’ అంటూ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తే ఫిర్యాదుదారునే చితకబాదుతారు.

Updated : 17 Nov 2023 07:10 IST

వైకాపా నేతల మెప్పు కోసం పోలీసు దాడులు
అవమానం తట్టుకోలేక బాధితుల ఆత్మహత్యలు
ఈనాడు - అమరావతి

‘నన్ను, నా కుటుంబసభ్యుల్ని కొంతమంది కొట్టారు.. నాకు న్యాయం చేయండి’ అంటూ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తే ఫిర్యాదుదారునే చితకబాదుతారు. ‘మా ఫ్లెక్సీలు ఎవరో చించేశారు’ అని వైకాపా నాయకులు ఫిర్యాదివ్వటమే తరువాయి... దళిత యువకుడిని ఆఘమేఘాలపై స్టేషన్‌కు తరలించి అక్రమంగా నిర్బంధిస్తారు. అవమానభారంతో మొన్నటికి మొన్న నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో 24 ఏళ్ల యువకుడు బాలనరసింహులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా హోం మంత్రి తానేటి వనిత నియోజకవర్గమైన కొవ్వూరు మండలం దొమ్మేరులో దళిత యువకుడు బొంతా మహేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించేవారిని కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల ఆదేశాలతో అక్రమంగా నిర్బంధించి అవమానిస్తున్నారు. దీంతో బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటివారిలో అత్యధికులు దళితులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం దాష్టీకం

నేరం వేరు.. చిన్న చిన్న పొరపాట్లు వేరు. తెలిసో తెలియకో ఎవరైనా పొరపాటు చేస్తే కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించాల్సిన పోలీసుల్లో కొందరు... అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం లాఠీకి పని చెబుతున్నారు. తమకు పోస్టింగు ఇప్పించిన నాయకుల ఆగడాల్ని ఎవరైనా ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, సామాజిక మాధ్యమాల్లో వారిపై పోస్టులు పెట్టినా వారిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆ అవమానం తాళలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

పోలీసులే దాడులు చేస్తే ఎలా?

పౌరుల్ని కాపాడాల్సిన పోలీసులే ప్రజలపై దాడులకు పాల్పడటం ఏంటి? నాలుగున్నరేళ్లుగా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే... వాటి నివారణకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీఆర్‌కు పంపడం, సస్పెన్షన్‌ లాంటి నామమాత్రపు చర్యలు కాకుండా గట్టి హెచ్చరిక పంపించేలా కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? కొన్ని ఘటనల్లో కేసులు పెట్టినా.. శిక్షలు పడేలా ఎందుకు చేయట్లేదు? ఉన్నతాధికారుల ఉదాసీనతే పోలీసుల ఆగడాలకు దారితీస్తోంది.

ఎన్నో ఉదాహరణలు

  • ‘పోలీసుల దాష్టీకం వల్లే నంద్యాలలో అబ్దుల్‌ సలాం, ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ కేసులో వాస్తవాలు కలవరపరిచేలా ఉన్నాయి. ఈ ఘటనతో పోలీసులకు ప్రత్యక్ష సంబంధం ఉంది’ అని జాతీయ మానవహక్కుల కమిషన్‌ పేర్కొంది.
  • డా.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణ భగవాన్‌ (20)ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అవమానభారం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
  • శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగికి చెందిన కోన వెంకటరావు (38) ఓ వైకాపా నాయకుడిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. గంటలోగా స్టేషన్‌కు రాకపోతే కుటుంబసభ్యుల్ని తీసుకెళ్తామంటూ బెదిరించగా.. వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నారు.
  • పోలీసుల చెర నుంచి విడిపించినందుకు ఓ తెదేపా నాయకుడిని పొగుడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లకు చెందిన ఎం.రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడిని పోలీసులు వేధించటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

సైనికోద్యోగిని కొడితే కేసు పెట్టరా?

  • దిశ యాప్‌ను బలవంతంగా డౌన్‌లోడ్‌ చేయించి, ఓటీపీ అడిగిన కానిస్టేబుళ్లను ప్రశ్నించినందుకు సైనికోద్యోగి సయ్యద్‌ అలీముల్లాపై పరవాడ పోలీసులు దాష్టీకానికి తెగబడితే బాధ్యులపై కేసే పెట్టలేదు.
  • కాకినాడ బస్టాండు సమీపంలో కారులో కూర్చొని తన స్నేహితుడితో కలిసి భోజనం చేస్తున్న ఆనంద్‌కుమార్‌ అనే వైద్యుడ్ని పోలీసులు విచక్షణరహితంగా లాఠీలతో కొట్టారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే వేకువజామున నాలుగు గంటల వరకూ స్టేషన్‌లోనే కూర్చోబెట్టుకుని కేసు నమోదు చేయకుండానే వెనక్కి పంపేశారు.

దళిత యువకులపై దాష్టీకం

  • ఓ మహిళ అదృశ్యం కేసులో అనుమానితుడికి ద్విచక్ర వాహనాన్ని ఇచ్చాడంటూ తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం కుంకుడుమిల్లికి చెందిన దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్‌ను కడియం పోలీసులు చితకబాదారు. దాహం వేస్తోందని, మంచినీళ్లు ఇప్పించాలని వేడుకోగా.. ‘నా మూత్రం తాగు’ అంటూ ఎస్సై అవమానించారు.
  • కోళ్లు దొంగిలించారని ఆరోపిస్తూ విచారణ పేరిట విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బాందేవపురానికి చెందిన దళిత యువకుడు బాందేవపురం పాపు, గాలి ఎర్నిబాబును పోలీసులు విచక్షణరహితంగా కొట్టారు. రాత్రంతా తమ ఆధీనంలోనే ఉంచుకుని పాపు కాలిని విరగ్గొట్టారు.
  • ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు, దాని వెనకున్న అధికారపార్టీ నాయకుల్ని ప్రశ్నించినందుకు దళిత యువకుడు ప్రసాద్‌కు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని