Cyclone Midhili: తుపానుగా తీవ్ర వాయుగుండం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 17 Nov 2023 08:01 IST

త్వరలో మరో అల్పపీడనానికి అవకాశం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ., పరదీప్‌ (ఒడిశా)నకు దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్‌)కు దక్షిణ-నైరుతి దిశలో 410 కి.మీ, ఖెపుపరా (బంగ్లాదేశ్‌)కు 540 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు. తుపానుగా మారితే ‘మిధిలి’గా(Cyclone ‘Midhili’) నామకరణం చేయనున్నారు. ఈ పేరును మాల్దీవులు సూచించింది. తుపాను ఈ నెల 18 (శనివారం)న తెల్లవారుజామున బంగ్లాదేశ్‌ సమీపంలో తీరం దాటొచ్చని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలకు అవకాశముందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని