Kadapa: ఎంపీ పట్టుకోమన్నారు.. ఎమ్మెల్యే వదిలేయమన్నారు!

వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన వైకాపా నేత విశ్వనాథరెడ్డి ఆర్థిక నేరాల గురించి అందిన ఫిర్యాదులపై పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోగా ఓ ఎమ్మెల్యే అడ్డుకుని వదిలిపెట్టించారు.

Updated : 19 Nov 2023 10:35 IST

వైకాపా నేతను సాగనంపేసిన కడప పోలీసులు
ఏపీ, తెలంగాణలో పలు ఆర్థిక నేరాల అభియోగాలు

ఈనాడు, కడప: వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన వైకాపా నేత విశ్వనాథరెడ్డి ఆర్థిక నేరాల గురించి అందిన ఫిర్యాదులపై పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోగా ఓ ఎమ్మెల్యే అడ్డుకుని వదిలిపెట్టించారు. ఈ వ్యవహారం శుక్రవారం అర్ధరాత్రి జరగ్గా శనివారం వెలుగులోకి వచ్చింది. వల్లూరు మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన పి.విశ్వనాథరెడ్డి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురి నుంచి అప్పులు తీసుకోవడం, వాటిని తిరిగి చెల్లించకపోవడం, వ్యాపార లావాదేవీల్లో మోసాలపై కొంతమంది ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఓ కీలక ఎంపీకి సైతం విషయాన్ని చేరవేశారు. బాధితుల్లో ఓ సినీనటుడి సోదరి కూడా ఉన్నారు. ఆమెకు రూ.4.50 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. పలువురు బాధితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెక్‌ బౌన్స్‌కు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు సీఎం పేషీ, ఇటు ఎంపీ ఆదేశాల మేరకు పోలీసులు.. పరారీలో ఉన్న విశ్వనాథరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కడప నగరం సమీపంలోని సీకేదిన్నె పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డిని అరెస్టు చేస్తే తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందంటూ పోలీసులపై ఒత్తిడి చేసి స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిపోయినట్లు సమాచారం. సీఎం పేషీ, ఎంపీ చెప్పినా ఎమ్మెల్యే సైతం క్రియాశీలక వ్యక్తి కావడంతో పోలీసులు ఆయన మాటకే విలువిచ్చి వదిలేశారు. ఆర్థిక నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎమ్మెల్యే వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు సైతం ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని