RK Roja: మీ భాష, ఆలోచన అసహ్యంగా ఉన్నాయి

‘మీ భాష, ఆలోచన విధానం చాలా అసహ్యంగా ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరూ లేరు. నేను చెప్పేదే వినండి’ అంటూ క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి రోజా మీడియాపై విరుచుకుపడ్డారు.

Updated : 02 Dec 2023 09:38 IST

మీడియాపై క్రీడల మంత్రి రోజా ఆగ్రహం
చెప్పిందే వినాలంటూ మళ్లీ హుకుం
మంత్రి తీరుపై మీడియా ప్రతినిధుల నిరసన

ఈనాడు, అమరావతి: ‘మీ భాష, ఆలోచన విధానం చాలా అసహ్యంగా ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరూ లేరు. నేను చెప్పేదే వినండి’ అంటూ క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి రోజా(RK Roja) మీడియాపై విరుచుకుపడ్డారు. ఈనెల 15 నుంచి నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంపై శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, క్రీడలశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, శాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ధ్యానచంద్రతో కలిసి విజయవాడలో శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లలో కొత్తగా ఎన్ని క్రీడా మైదానాలు నిర్మించారు? ఉన్నవాటిలో నిర్వహణ లేక టాయ్‌లెట్లు కూడా అసహ్యంగా ఉన్నాయి కదా అని అడగ్గా, మంత్రికి కోపం వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో స్టేడియాలు, బాత్రూంలు బాగోలేవని మీకు తెలీలేదా? అప్పుడు ఎందుకు అడగలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

మీడియా: గత నాలుగున్నరేళ్లలో మైదానాల్లో మౌలిక సదుపాయాలు ఎందుకు మెరుగుపరచలేదు.. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?

మంత్రి: ఖేలో ఇండియా నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. ఉన్న నిధుల్లో సంక్షేమం, అభివృద్ధితో పాటు క్రీడలకు ఎంత కేటాయించాలో అంత ఇస్తున్నాం. భారీ స్టేడియాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు.

మీడియా: మైదానాల్లో సదుపాయాలు, నిపుణులైన కోచ్‌లు, అకాడెమీలు లేకుండా క్రీడాకారులను ఎలా తయారు చేస్తారు?

మంత్రి: కిడాంబి శ్రీకాంత్‌, పీవీ సింధుకు అకాడెమీల ఏర్పాటుకు భూములు కేటాయించాం. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు వారు ముందుకొచ్చారు. సాకేత్‌కూ భూమి కేటాయించబోతున్నాం.

మీడియా: గతంలో సీఎం కప్‌, ఇప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజేతలకు ఇస్తున్న సర్టిఫికెట్లతో ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఇవ్వడం?

మంత్రి: సర్టిఫికెట్లతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించే విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తాం.

‘ఈనెల 15 నుంచి అయిదు దశల్లో నిర్వహించే క్రీడా పోటీల్లో కోటి మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని, ఇప్పటికే 3 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు.

ప్రతి క్రీడా పరికరం పైనా జగన్‌ ఫొటో

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో పాల్గొనే వారికి ఇచ్చే 10-15 రకాల క్రీడా పరికరాలు, బ్యాగులను మీడియా సమావేశంలో శాప్‌ అధికారులు ప్రదర్శించారు. వాటన్నింటిపైనా ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ముద్రించారు. క్రీడాకారులకు ఇచ్చే టోపీలు వైకాపా రంగులతో తయారు చేశారు.

‘ఐ ప్యాక్‌ టీం’ సభ్యుల డైరక్షన్‌

శాప్‌ మీడియా సమావేశం మొత్తం ‘ఐ ప్యాక్‌ టీం’ కనుసన్నల్లో జరిగింది. ‘ఆడుదాం ఆంధ్రా’ కోసం తయారు చేసిన వీడియో ఏ సమయంలో ప్రదర్శించాలో కూడా వారే సూచించారు. సాధారణంగా మీడియా సమావేశాల్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్వాహకులు సమాధానం చెబుతుంటారు. ఇక్కడ మాత్రం ఐ ప్యాక్‌ టీం సభ్యులు వింత పోకడ ప్రవేశపెట్టారు. మంత్రి రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య ‘రాపిడ్‌ ఫైర్‌’ నిర్వహించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు శాప్‌ ఛైర్మన్‌ సమాధానం చెబితే, ఆయన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. తర్వాతే మీడియా ప్రశ్నలకు జవాబులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని