Konaseema Dist: రైతు కడుపు మండింది.. ట్రాఫిక్‌ నిలిచింది

తడిసిన ధాన్యానికి తక్కువ ధర ఇస్తామని చెప్పడంతో రైతులు రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ ఉదంతం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల వద్ద శనివారం చోటుచేసుకుంది.

Updated : 10 Dec 2023 08:50 IST

ధాన్యం కొనలేదని.. రోడ్డుపై నిరసన

కొత్తపేట, రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: తడిసిన ధాన్యానికి తక్కువ ధర ఇస్తామని చెప్పడంతో రైతులు రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ ఉదంతం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల వద్ద శనివారం చోటుచేసుకుంది. పలివెలకు చెందిన రైతు గుర్రం నాగేశ్వరరావు తన ధాన్యాన్ని విక్రయించేందుకు వాడపాలెంలోని రైసుమిల్లు వద్దకు ట్రాక్టర్‌పై తీసుకెళ్లారు. కొంత తీసుకుని, మిగిలిన ధాన్యం ఎక్కువగా తడిసిందని.. బస్తాకు రూ.800 మాత్రమే ఇస్తామని మిల్లరు చెప్పారు. దాంతో సుమారు 60 బస్తాల ధాన్యాన్ని ట్రాక్టర్‌లో వేసుకుని పలివెల వంతెన వద్దకు వచ్చి అమలాపురం ప్రధాన రహదారిపై ట్రాక్టర్‌ను అడ్డంగా పెట్టి ధాన్యం బస్తాలను రోడ్డుపై దించి నిరసన తెలిపారు. నాగేశ్వరరావుకు మద్దతుగా గ్రామానికి చెందిన పలువురు రైతులు, నాయకులు అక్కడకు చేరుకుని ధర్నా చేశారు. సాయంత్రం అయిదు గంటలకు ప్రారంభమైన నిరసన సుమారు రెండున్నర గంటలు కొనసాగింది. దీంతో రెండువైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దారు కిషోర్‌బాబు, ఎస్సై జ్వాలాసాగర్‌ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి మిల్లుకు తరలించడంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని