ఇంటెలిజెన్స్‌ డీజీ నేతృత్వంలో ఫోన్‌ ట్యాపింగ్‌.. తెదేపా వర్క్‌షాప్‌లో పట్టుబడిన కానిస్టేబుల్‌

ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 24 Mar 2024 10:39 IST

పక్కా ఆధారాలు సేకరించిన తెదేపా నేతలు
కేశినేని చిన్ని ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు బోండా ఉమా ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో తెదేపా అభ్యర్థులకు నిర్వహించిన వర్క్‌షాప్‌పై నిఘాపెట్టిన ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ జి.విశ్వేశ్వరరావును పట్టుకున్నామని తెలిపారు. ఆయన నుంచి కేశినేని చిన్ని ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నట్లు పలు ఆధారాలను సేకరించామన్నారు. ఈ వ్యవహారంపై ఆరాతీయగా డీజీ పంపితేనే వచ్చినట్టు ఆయన చెప్పారని బోండా ఉమా వెల్లడించారు. దీనికి బాధ్యులైన సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులను ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండు చేశారు. విజయవాడలో కేశినేని చిన్ని, పట్టాభిరాంతో కలిసి బోండా ఉమా విలేకర్ల సమావేశం నిర్వహించారు.

‘‘తమ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్‌ చేస్తోందని ఓ సందర్భంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా వెల్లడించారు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి సీఎం జగన్‌ కూడా కొనుగోలు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, పురందేశ్వరి సహా పలువురు ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారు. మేము ఏం మాట్లాడినా ఫోన్‌ ట్యాప్‌ చేసి వింటున్న పోలీసులు.. మా ఇళ్లు, ఆఫీసుల వద్ద గస్తీ కాస్తున్నారు. మా విషయాలన్నీ పోలీసులకు ఎలా చేరుతున్నాయని సాంకేతిక నిపుణులతో పరిశీలన చేయిస్తే ఫోన్లు ట్యాప్‌ అయినట్లు నిర్ధరణ అయింది. దీనిపై సీఎం జగన్‌ వెంటనే సమాధానం చెప్పాలి. ఈ కుట్రచేసిన, చేయిస్తున్న అందరిపై చర్యలు తీసుకుంటేనే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరుగుతాయి. ఈ వ్యవహారంపై సీఈఓను కలిసి అన్ని ఆధారాలు సమర్పిస్తాం’’ అని బోండా ఉమా పేర్కొన్నారు.


జగన్‌కు అనుకూలంగా కొంతమంది పోలీసులు

‘‘నా ఫోన్‌ ట్యాప్‌ చేసేలా ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రయత్నించింది. కానిస్టేబుల్‌ను పట్టుకుంటే అసలు బండారం బయటపడింది. జగన్‌కు అనుకూలంగా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.’’

కేశినేని చిన్ని, విజయవాడ తెదేపా లోక్‌సభ అభ్యర్థి


ట్యాపింగ్‌లో కేశినేని నాని పాత్ర

‘‘కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్‌లా కాకుండా జేపీఎస్‌ (జగన్‌ పోలీస్‌ సర్వీస్‌) మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్యాపింగ్‌లో కేశినేని నాని పాత్ర కూడా ఉంది. ఓటమి భయంతో కుటిల యత్నాలకు తెర తీస్తున్నారు’’

కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెదేపా అధికార ప్రతినిధి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని