మహర్దశ తెస్తానని.. మగ్గాన్నే విరిచేశారు!

వారివి పడుగు-పేకలతో అల్లుకున్న బతుకులు... జగన్‌ చేసిన నమ్మకద్రోహానికి దారం తెగిన గాలిపటాలయ్యాయి! మగ్గాలను నడిపిన చేతులు... మట్టి పనిచేస్తున్నాయి! పట్టుచీరలు నేసిన హస్తాలు... సోడాలమ్ముతున్నాయి!

Published : 08 Apr 2024 04:54 IST

నేతన్నల ఉపాధిపై జగన్‌ కోలుకోలేని దెబ్బ
అమ్మకాలకు సరైన ప్రోత్సాహం కరవు
గత తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఎత్తివేత
ఆకలిదప్పులు తాళలేక కూలీలుగా మారిన కార్మికులు
ఈనాడు, అమరావతి

వారివి పడుగు-పేకలతో అల్లుకున్న బతుకులు... జగన్‌ చేసిన నమ్మకద్రోహానికి దారం తెగిన గాలిపటాలయ్యాయి! మగ్గాలను నడిపిన చేతులు... మట్టి పనిచేస్తున్నాయి! పట్టుచీరలు నేసిన హస్తాలు... సోడాలమ్ముతున్నాయి! నేతన్న కష్టాలు కళ్లముందే కనిపిస్తున్నా ఆయన మాత్రం చేష్టలుడిగి చూశారు! మరోసారి ‘సిద్ధం’ అంటూ బస్సుయాత్రకు దిగారు!!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వస్త్రాలను నేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచిన చేనేత రంగాన్ని సీఎం జగన్‌ ఛిద్రం  చేశారు. మగ్గానికి మహర్దశ తెస్తామని 2019 ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అధికారంలోకి రాగానే నేతన్నల వెన్నువిరిచారు. మగ్గంపై పడుగు, పేకలు ఆడక నేతన్నల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా కనికరించలేదు. చివరికి కుటుంబ పోషణ కష్టమై వారు కూలీ పనుల బాట పట్టినా మిన్నకున్నారు. గత ఎన్నికల ముందు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి దానిపైనా నాలుక మడతేశారు. ఆఖరుకు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే... వారికి కొత్తగా పింఛన్‌ మంజూరు చేసేందుకూ నిబంధనల కొర్రీలు వేసి దక్కకుండా చేశారు. పదేపదే ‘నా బీసీ, నా బీసీ’లంటూ గుండెలు బాదుకునే జగన్‌... వెనకబడిన వర్గాలైన చేనేతలతో వ్యవహరించిన తీరిదీ. సొంత మగ్గాలున్న వారికి ఏడాదికి ఒకసారి నేతన్న నేస్తమంటూ బటన్‌ నొక్కడమే తప్ప... వృత్తిరీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడంగానీ, వాటిని పరిష్కరించేందుకు ముందడుగు వేసిన సందర్భంగానీ లేవు.

త్రిఫ్ట్‌ ఫండ్‌ను తీసేశారు

సంఘాల్లోని కార్మికుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు అప్పట్లో ‘త్రిఫ్ట్‌’ పథకం అమలైంది. నేత కార్మికుడు తన నెలవారీ ఆదాయంలో 8% పొదుపు చేసుకుంటే దానికి సమానంగా 8% ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదట్లో ఈ ఎనిమిది శాతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 4% చొప్పున భరించేవి. కేంద్రం ఈ పథకాన్ని తీసేసినా... అప్పటి తెదేపా ప్రభుత్వం మొత్తం 8% తానే భరిస్తానని హామీ ఇచ్చింది. కానీ, జగన్‌ దీన్ని అమలు చేయలేదు.

కరోనా సమయంలో పట్టించుకోలేదు

నాడు కరోనా మహమ్మారి ప్రభావం చేనేత రంగంపై తీవ్రంగా పడింది. అమ్మకాలు లేక కార్మికులు, మాస్టర్‌ వీవర్ల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన జగన్‌ ఆ పని చేయలేదు. పట్టుచీరల తయారీకి ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం, మదనపల్లె, ఎమ్మిగనూరు, మైలవరం, మాధవరం, జమ్మలమడుగులో నేతన్నలు అల్లాడినా పట్టించుకోలేదు.

మార్కెటింగ్‌ ప్రోత్సాహకాల నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాల్లో 3.50 లక్షల మంది కార్మికులు 800కిపైగా చేనేత సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరి ఉపాధి కల్పనకు వీలుగా గత ప్రభుత్వాలు మార్కెటింగ్‌ ఇన్సెంటివ్‌ పథకాన్ని అమలు చేశాయి. చేనేత సొసైటీ ద్వారా జరిగే అమ్మకాల ప్రాతిపదికగా దీన్ని కొనసాగించాయి. మూడేళ్ల సరాసరి అమ్మకాలను ప్రాతిపదికగా తీసుకుని దానిపై 10% రాయితీ ఇచ్చేవి. ఫలితంగా ఒక్కో సంఘానికి రూ.8 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు లబ్ధి చేకూరేది. జగన్‌ దీన్ని పూర్తిగా నిలిపేశారు. ఆయన చర్య కార్మికుల ఉపాధిని దారుణంగా దెబ్బతీసింది.

జీఎస్టీతోనూ వ్యాపారం కుదేలు

చేనేతలపై జీఎస్టీ గుదిబండగా మారింది. నూలుపై 5%, రంగుపై 18%, రసాయనాలపై 18% జీఎస్టీ అమలవుతోంది. కరోనాకు ముందు ముడిసరకు కిలో ధర    రూ.3,200 వరకు ఉండగా ప్రస్తుతం రూ.5,500లకు చేరింది. ఇటీవలి వరకు రూ.6 వేలు కూడా పలికింది. ఇదేకాకుండా డిజైన్‌ పంచింగ్‌ కార్డులు, రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైనా జీఎస్టీ విధిస్తున్నారు. ఫలితంగా చేనేతలో ఉత్పత్తి ఖర్చు అమాంతం పెరిగింది. గతం కంటే చీరల ధరలు కొద్దిగా  పెరగడంతో అమ్మకాలు భారీగా తగ్గాయి. దీంతో మాస్టర్‌వీవర్లు కూలీలకు పని ఇవ్వడాన్ని తగ్గించారు. వారికి నెలలో 10-15 రోజులు కూడా ఉపాధి దొరకడంలేదు. కుటుంబ పోషణ కోసం చాలామంది నేతన్నలు ఇతర పనుల బాట పట్టారు.

‘పట్టు’నూ దెబ్బతీశారు

పట్టు చీరల కార్మికులకు ముడి సరకు రాయితీ అత్యంత కీలకం. దీన్ని జగన్‌ నిలిపేశారు. తెదేపా ప్రభుత్వం మొదట్లో ఒక్కో కార్మికునికి నెలకు కిలోకు రూ.200 చొప్పున ఆరు కిలోలపై రూ.1,200 రాయితీగా ఇచ్చింది. అంటే ఏడాదికి రూ.14,400 అందించినట్టే. ఆ తర్వాత ముడి సరకు ధరలు పెరిగాయని గుర్తించి 2018-19లో నెలకు ఇచ్చే రాయితీ మొత్తాన్ని రూ.2000లకు పెంచింది. అంటే ఏడాదికి మగ్గం నేసే కార్మికునికి రూ.24 వేలు రాయితీగా ఇచ్చింది. ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా 2017 అక్టోబరు 18న ముడి సరకు రాయితీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వారి ఓట్లు దండుకుని గెలిచాక మడమ తిప్పేశారు.

కొర్రీల ‘నేస్తం’

నేతన్న నేస్తం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పే జగన్‌... పథకాన్ని సొంత మగ్గం ఉన్న వారికే పరిమితం చేశారు. అర్హులైనప్పటికీ కూలి మగ్గం నేసే వారికి వర్తింపచేయలేదు. చేనేత అనుబంధ రంగాల్లో పనిచేసే వారి నోట్లోనూ మట్టి కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది కార్మికులుంటే 81 వేల మందికే నేతన్ననేస్తం కింద సాయం అందిస్తున్నారు.


హోటల్‌లో పని చేస్తున్నా

నేను మా నాన్నతో కలిసి గద్వాల పట్టు చీరలను నేశా. రెండేళ్ల కిందట వచ్చిన కరోనా మా ఉపాధిని దెబ్బకొట్టింది. గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు ముడిసరకు ఇవ్వడం తగ్గించారు. అంతకుముందు నెలకు అయిదు చీరలు నేసేందుకు సరిపడా సరకు ఇచ్చేవారు. ప్రతినెలా రూ.11 వేల ఆదాయం ఉండేది. ఇప్పుడు నెలకు రెండు చీరలు నేసేలా ముడిసరకు ఇస్తుండటంతో మా ఆదాయం సగానికి తగ్గింది. ప్రస్తుతం నాన్న మగ్గం నేస్తుండగా... నేను హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తున్నా. ప్రభుత్వ సహకారం అందితే మళ్లీ మగ్గం పనిచేస్తా.

వీరేశ్‌, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా


ఆరు నెలలు ఆకలితో అల్లాడాం

పాతికేళ్లుగా చేనేత వృత్తిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించా. యజమాని దగ్గర నెలకు 4 పట్టు చీరలు నేస్తే రూ.7 వేలు వచ్చేవి. నేత చీరలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలేదు. ఆదాయం లేక యజమాని 8నెలల క్రితం మగ్గాలను మూసేశారు. కుటుంబ సభ్యులమంతా ఆరు నెలలు ఆకలితో అల్లాడాం. రెండు నెలల కిందట రూ.70 వేలను అప్పుగా తెచ్చి సోడా బండి కొని, వ్యాపారం చేస్తున్నా.

సుబ్రహ్మణ్యం, ధర్మవరం


నా భార్య టమాటా యార్డుకు కూలీకి వెళుతోంది

నేను, నా భార్య కలసి కూలీకి ఒక మగ్గం నడిపితే వారానికి మూడు పట్టు  చీరలు నేస్తాం. రూ.6,300 ఆదాయం వస్తుంది. ఏడాదిగా వ్యాపారాలు లేకపోవడంతో యజమాని ముడిసరకు కోటాను తగ్గించారు. ఇల్లు గడవటం కష్టంగా మారింది. దాంతో నేను మగ్గం నేస్తూ,  నా భార్యను టమాటా మార్కెట్‌ యార్డులో కూలీకి పంపుతున్నా.

అనంతయ్య, మదనపల్లె


భవన నిర్మాణానికి కూలీగా వెళుతున్నా

నాకు రెండు మగ్గాలున్నాయి. పద్నాలుగేళ్లుగా ఇదే పని చేస్తున్నా. రెండేళ్లుగా నేతపని గిట్టుబాటు కావడం లేదు. చీరలు నేసినా... మార్కెటింగ్‌ లేక అమ్మకాలు భారీగా తగ్గాయి. ఆదాయమూ పడిపోయింది.     ఫలితంగా మగ్గాలు పక్కన పెట్టేశా. ఆరు నెలల నుంచి భవన నిర్మాణ కూలీగా వెళుతున్నా. రోజంతా పని చేస్తే రూ.500 ఇస్తున్నారు.

శివ, చేనేతకాలనీ, మదనపల్లె


మాతోనే ఈ కళ ఆగిపోతుందేమో!

భార్యాభర్తలమిద్దరం కష్టపడి రోజంతా మగ్గంపై పనిచేసినా రూ.400 రావడం లేదు. కుటుంబ పోషణ చాలా కష్టంగా మారింది. పిల్లలను చదివించడానికి అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి మాలాంటి వాళ్లకు ఎలాంటి సహాయం అందడం లేదు. మా తరంతోనే ఈ కళ ఆగిపోతుందేమోననే భయంగా ఉంది.

ముప్పన కవిత, పొందూరు, శ్రీకాకుళం జిల్లా


ఇట్లయితే మేం బతికేదెట్ల! 

కూలీ పని కింద సాధారణ రకం చీరలు నేస్తా. ఒక బారు(5 చీరలు, 5 జాకెట్లు) నేస్తే రూ.2 వేలు మిగులుతుంది. గతంలో నెలకు యజమాని ఎన్ని బారులైనా ఇచ్చేవారు. ఇప్పుడు రెండుకు మించి ఇవ్వడం లేదు. అంటే నెలకు 15 రోజుల మాత్రమే పని ఉంటోంది. రూ.4 వేలకు మించి ఆదాయం ఉండటం లేదు. కుటుంబం గడవడమే కష్టంగా ఉంది.

సత్రం బాలేందు మౌళి, చీరాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని