ఆరు నెలల్లో రూ.47 వేల కోట్ల అప్పులకు సిద్ధం

అప్పు తీసుకుంటే తప్ప అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. కొత్త అప్పులకు ఆమోదం సాధించింది.

Updated : 20 Apr 2024 06:33 IST

అనుమతి తెచ్చిన ఆర్థికశాఖ
పోలింగులోపు రూ.20 వేల కోట్ల సమీకరణ ప్రణాళిక
వచ్చే మంగళవారం రూ.3,000 కోట్ల అప్పు

ఈనాడు, అమరావతి: అప్పు తీసుకుంటే తప్ప అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. కొత్త అప్పులకు ఆమోదం సాధించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఏకంగా రూ.47 వేల కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణాల సమీకరణకు దిల్లీ చుట్టూ తిరిగి అధికారులు అనుమతులు తీసుకున్నారు. ఆర్థికశాఖ అధికారులు దిల్లీకి ప్రతిపాదనలు పంపి.. వారూ వెళ్లి కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో చర్చించి అప్పులు అత్యవసరమంటూ ఆమోదం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో రూ.47 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా అనుమతులిచ్చింది. మే 13 లోపు దాదాపు రూ.20 వేల కోట్ల రుణాలు పుట్టించేందుకు ఇప్పటికే ఆర్థికశాఖ ప్రణాళిక రచించింది. ఏప్రిల్‌ తొలి వారంలో రూ.4,000 కోట్ల అప్పులు తీసుకున్నారు. తాజాగా ఏప్రిల్‌ 23న మరో రూ మూడు వేల కోట్ల రుణం తీసుకునేందుకు రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపారు. 8, 16, 20 సంవత్సరాలకు తిరిగి తీర్చే ప్రాతిపదికన రూ.వెయ్యి కోట్ల చొప్పున ఈ మొత్తాలు తీసుకోనున్నారు.

రాష్ట్ర స్థూలఉత్పత్తి అంచనాల ఆధారంగా కేంద్రం బహిరంగ మార్కెట్‌ రుణాలకు అనుమతులిస్తుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.68,500 కోట్ల బహిరంగ రుణం తీసుకున్నారు. సెప్టెంబరు నెల వరకు రూ.47 వేల కోట్లకు అనుమతులు వచ్చాయంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.లక్ష కోట్ల అప్పు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లే. ఆరు నెలలకు ప్రస్తుతం వచ్చిన అనుమతులు పరిశీలిస్తే నెలకు సగటున రూ.7,800 కోట్లకు మించి అప్పు తీసుకోకూడదు. అయితే ఆ రుణ అనుమతులకు నెలవారీ పరిమితులు లేకపోవడంతో రాష్ట్రం వెసులుబాటును బట్టి ఎంత రుణం తీసుకోవడానికైనా వెనకాడదు. ఎన్నికలలోపు వీలైనంత మొత్తాలు తీసుకుని చెల్లింపులు చేసి పరోక్ష లబ్ధికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికల సంఘం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసినా చెల్లింపుల్లో వారి ప్రమేయం పూర్తిస్థాయిలో లేదు. ఫిఫో విధానమూ పాటించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని