NDTV ఓపెన్‌ ఆఫర్‌కు కొత్త తేదీ.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపిన అదానీ

ఎన్డీటీవీలో 26 శాతం వాటాల కొనుగోలుకు సంబంధించిన ఓపెన్‌ ఆఫర్‌ కొత్త తేదీలను అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ గ్రూప్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి సమాచారమిచ్చింది.

Published : 12 Nov 2022 11:40 IST

దిల్లీ: ఎన్డీటీవీలో 26 శాతం వాటాల కొనుగోలుకు సంబంధించిన ఓపెన్‌ ఆఫర్‌ కొత్త తేదీలను అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ గ్రూప్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి సమాచారమిచ్చింది. నవంబర్‌ 22న ఈ ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభమై.. డిసెంబర్‌ 5న ముగియనుంది. వాస్తవంగా అక్టోబర్‌ 17న ప్రారంభమై నవంబర్‌ 1 వరకు ఓపెన్‌ ఆఫర్‌ ముగియాల్సి ఉంది.

ఎన్డీటీవీలో వాటాలు సొంతం చేసుకుంటున్నట్లు అదానీ గ్రూప్‌ ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్డీటీవీ ప్రమోటర్లకు చెందిన ఆర్‌ఆర్‌పీఆర్‌కు గతంలో విశ్వప్రదాన్‌ కమర్షియల్‌ (VCPL) ఇచ్చిన రుణాన్ని వాటాలుగా మార్చుకుంటున్నట్లు తెలిపింది. వాటాలుగా మార్చుకునే విషయంపై ఎన్డీటీవీ ప్రమోటర్లు అభ్యంతరం చెప్పారు. ఈ వ్యవహారంపై రెండు గ్రూపులు సెబీ, ఆదాయపు పన్ను శాఖ వరకు వెళ్లాయి. చివరికి అదానీ సంస్థకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. దీంతో 26 శాతం వాటాలను దక్కించుకునేందుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజా తేదీలను అదానీ గ్రూప్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రూ.4 ముఖ విలువ కలిగిన 1.67 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు జేఎం ఫైనాన్షియల్‌ తెలిపింది. ఒక్కో షేరు ధరను రూ.294గా నిర్ణయించారు.

ఇదీ నేపథ్యం..

ఎన్డీటీవీ ప్రమోటర్‌ కంపెనీ అయిన RRPR హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశ్వప్రదాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (VCPL) రూ.403.85 కోట్లు రుణం ఇచ్చింది. ఇదో వడ్డీ లేని రుణం. ఒక వేళ తిరిగి చెల్లించకపోతే రుణాన్ని RRPRలో 99.9 శాతం వాటాగా మార్చుకోవచ్చన్నది ఒప్పందం. తర్వాతి కాలంలో VCPL యాజమాన్యం చేతులు మారి.. అదానీ గ్రూప్‌నకు చెందిన సంస్థ దాన్ని కొనుగోలు చేసింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అప్పును 29.18 శాతం వాటాగా మార్చుకోవడంతో NDTVలో అదానీ గ్రూప్‌ వాటాలు పొందింది. దీనికి అదనంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇది పూర్తయితే ఎన్డీటీవీలో సగానికి పైగా వాటా అదానీ సొంతమవుతుంది. NDTV మూడు జాతీయ వార్తా ఛానళ్లు ఎన్డీటీవీ 24/7 (ఆంగ్లం), ఎన్డీటీవీ ఇండియా (హిందీ), ఎన్డీటీవీ ప్రాఫిట్‌ (బిజినెస్‌ వార్తలు)లను నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని