Ambani: అంబానీ వారసులకు వేతనాలు ఉండవు

వారసత్వ ప్రణాళికలో భాగంగా రిలయన్స్‌ బోర్డులోకి అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసుల వేతనాల గురించి కంపెనీ తాజాగా వెల్లడించింది. నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల హోదాలో వారు ఎలాంటి వేతనాలు అందుకోబోరని తెలిపింది.

Published : 26 Sep 2023 17:38 IST

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసులు ఆకాశ్ (Akash), ఈశా (Isha), అనంత్‌ అంబానీ (Anant Ambani) ఇటీవలే రిలయన్స్‌ బోర్డులోకి వచ్చారు. అయితే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమితులైన వీరికి ఎలాంటి వేతనాలు (Salary) ఉండబోవట. కేవలం బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు ఫీజులు మాత్రమే చెల్లించనున్నారు. ఈ మేరకు షేర్ల హోల్డర్లకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించింది.

తన వారసత్వ ప్రణాళిక (Ambani succession plan)లో భాగంగా తన ముగ్గురు పిల్లలకు గతేడాది కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించిన ముకేశ్ అంబానీ.. ఈ ఏడాది వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. గత నెల జరిగిన రిలయన్స్‌ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) ఈశా, అనంత్‌, ఆకాశ్‌లను బోర్డు సభ్యులు (Board Members)గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు. వీరి నియామకాన్ని ఆమోదించడం కోసం కంపెనీ తాజాగా షేర్‌ హోల్డర్లకు రిజల్యూషన్‌ పంపింది.

ఈ ముగ్గురు కేవలం సిట్టింగ్‌ ఫీజులు, కంపెనీ నమోదు చేసిన లాభాల్లో కమిషన్‌ మాత్రమే పొందుతారని కంపెనీ అందులో పేర్కొంది. గతంలో ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా రిలయన్స్‌ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె కూడా వేతనం లేకుండా సిట్టింగ్‌ ఫీజుతో పాటు కమిషన్‌ పొందినట్లు కంపెనీ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.

పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!

వారసత్వ ప్రణాళికను ప్రకటించినప్పటికీ మరో ఐదేళ్ల పాటు తానే ఛైర్మన్‌గా కొనసాగనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన ఎలాంటి వార్షిక వేతనం, లాభం ఆధారిత కమిషన్‌ను తీసుకోవట్లేదు. మరో ఐదేళ్ల పాటు కూడా ఎలాంటి వేతనం వద్దని ముకేశ్ కంపెనీ బోర్డుకు తెలిపారు. కాగా.. అంతకుముందు కూడా 2008-09 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ముకేశ్ తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.

వారసత్వ ప్రణాళికలో భాగంగా గతేడాది రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ బాధ్యతల్ని ఆకాశ్‌ అంబానీ (Akash Ambani) స్వీకరించారు. ఈశా అంబానీ (Isha Ambani) రిలయన్స్‌ రిటైల్‌ బాధ్యతల్ని తీసుకున్నారు. అలాగే అనంత్‌ అంబానీ (Anant Ambani) నూతన ఇంధన రంగ బిజినెస్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. గత నెల నీతా అంబానీ రిలయన్స్‌ బోర్డు డైరెక్టర్‌గా వైదొలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని