Savings: పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!

Savings: అప్పు పెరిగి.. పొదుపు తగ్గుతున్నట్లు గుర్తిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కొన్ని వ్యూహాలను అనుసరిస్తే అలాంటి స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం..!

Updated : 26 Sep 2023 12:25 IST

Savings | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కుటుంబాల పొదుపు (Savings) 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక ఇటీవల వెల్లడించింది. మరోవైపు కుటుంబాల అప్పుల (Families Debt) భారం 2020-21 నుంచి రెండింతలు పెరిగినట్లు తెలిపింది. బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు విశ్లేషించింది. కూరగాయల దగ్గర నుంచి ఆభరణాల వరకు అన్నింటి ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పొదుపులు (Savings) తగ్గి అప్పులు పెరిగినట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సామాన్యులు అప్పుల ఊబి (Debt Trap)లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మరి దాన్ని నివారించాలంటే ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చులను తగ్గించుకోవడం లేదా రెండింటినీ అమలు చేయడం వంటి వ్యూహాలను అమలు చేయాలి. ఇది చెప్పడం సులభంగానే ఉన్నప్పటికీ.. ఆచరణలో పెట్టడం మాత్రం కొంచెం కష్టతరమే!

పొదుపునకు గోల్డెన్ రూల్‌..

పొదుపు (Savings) చేయడానికి నెలాఖరు వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఖర్చు చేయడానికి ముందే కొంత మొత్తాన్ని పొదుపు (Savings) కింద తీసి పెట్టండి. చాలా మంది ఆదాయం నుంచి ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఆదా చేస్తుంటారు. కానీ, ఆదాయం నుంచి పొదుపును తీసేసి మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయడం సరైన విధానం. ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారో.. దాన్ని ముందే పక్కకు తీసి పెట్టాలి. మిగిలిన మొత్తంతో ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులందరినీ పొదుపులో భాగం చేయాలి. కేవలం ఒక్కరే ఖర్చులను నియంత్రించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

పన్నులను తగ్గించుకోగలరా..

మీ వేతనం లేదా ఆదాయాన్ని పునర్‌వ్యవస్థీకరించుకోగలరేమో ఓసారి చూసుకోండి. అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించండి. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించండి. పన్ను మినహాయింపు మార్గాలను అనుసరించడం వల్ల మీ ఆదాయం మాత్రం పెరగదు. కానీ, పన్నుల నుంచి ఎంతో కొంత ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అలా అని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదు.

ఫ్లెక్సీ క్యాప్‌.. మల్టీ క్యాప్‌.. పెట్టుబడి ఏ విభాగంలో?

పక్కా బడ్జెట్‌..

ప్రతి నెలా పక్కా బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. దాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలి. అందుకోసం అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఖర్చులను నియంత్రించడం సాధ్యం కాకపోతే.. జీవనశైలినే మార్చుకోవాలి. ఖరీదైన కార్లు, విల్లాలు, దుస్తులు, గ్యాడ్జెట్లు కొని వాటి ఈఎంఐల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడాన్ని ఆపేయాలి.

పొదుపుతో పాటే మదుపు..

చాలా మంది పొదుపు (Savings) చేస్తే సరిపోతుందని భావిస్తుంటారు. కానీ, దాని వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందలేరు. పొదుపును తిరిగి ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలి. ఫలితంగా పొదుపు చేసిన మొత్తంపై రాబడి కూడా వస్తుంది. మదుపు కూడా మీ రిస్క్‌ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. అలాగే పెట్టుబడులను లక్ష్యాలకు అనుసంధానించుకుంటే మరీ మంచిది. అలాగే ఏ ఒక్క మదుపు సాధనంలో కాకుండా.. నష్టభయాన్ని నివారించడం కోసం ఈక్విటీ, డెట్‌, స్థిరాస్తి, బంగారం.. ఇలా వివిధ మార్గాల్లోకి మళ్లించాలి. అలాగే లక్ష్యాలను సైతం దీర్ఘకాలిక, స్వల్పకాలిక కేటగిరీలుగా విభజించాలి. అందుకు అనుగుణంగా ఉండే మదుపు సాధనాలను ఎంచుకొని ఇన్వెస్ట్‌ చేయాలి.

అప్పుల భారం తగ్గించుకోండి..

బడ్జెట్‌, ఆర్థిక ప్రణాళిక, పొదుపు, మదుపు.. ఇవేవీ అప్పుల భారంతో సతమతమవుతున్నవారికి సాధ్యం కాదు. అందుకే అప్పులను ముందుగా తీర్చేయాలి. లేదంటే వడ్డీల భారం రోజురోజుకీ గుదిబండలా తయారవుతుంది. అయితే, అప్పులను ముందుగా వర్గీకరించాలి. ఏది ముందుగా తీర్చేయాలి.. దేన్ని మరికొంత కాలం పొడిగించుకున్నా పెద్దగా నష్టం ఉండదో గుర్తించాలి. హోమ్‌లోన్‌ వంటి రుణాల వల్ల పెద్దగా నష్టం ఉండదు. కాబట్టి వాటిని కొనసాగించొచ్చు. కానీ, వ్యక్తగత అవసరాల కోసం చేసిన అప్పులను మాత్రం వీలైనంత త్వరగా తీర్చేయాలి. మరోవైపు ఇలాంటి అప్పుల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలంటే ముందు నుంచే ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

అద్దెదారుడిపై ఇంటి యజమానికి ఎలాంటి హక్కులుంటాయి?

చిన్న మార్పు.. పెద్ద ప్రయోజనం..

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోక తప్పదు. పొగ తాగడం లాంటి అలవాట్లుంటే మానేయాలి. బయట తినడం తగ్గించి.. ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరతమైతే.. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలి. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా కూడా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది.

ఖర్చుల నియంత్రణకు కొన్ని చిట్కాలు..

  • అన్ని రకాల షాపింగ్‌లకు ఒక నెలలో ఏదో ఒకరోజును నిర్ణయించుకోండి. ఆరోజు మాత్రమే కొనుగోళ్లు చేయండి.
  • అనుకోగానే కొనుగోలు చేయడానికి బదులు మీరు నెలలో ఫిక్స్‌ చేసుకున్న రోజు వచ్చే వరకు వేచి చూడండి.
  • ఫలితంగా మీరు కొనాలనుకున్న వస్తువు అసలు మీకు అవసరమా? దానికి అంత డబ్బు పెట్టొచ్చా? వంటి విషయాలు ఈ సమయంలో మీకు అర్థమైపోతాయి.
  • ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో మీ క్రెడిట్‌ కార్డు వివరాలను సేవ్‌ చేసి పెట్టుకోవద్దు.
  • మీ వివరాలను నిక్షిప్తం చేసుకొని.. మీ ఖర్చులు, సెర్చ్‌ను బట్టి కొనుగోళ్లను సిఫార్సు చేసే యాప్‌లకు దూరంగా ఉండండి.
  • అత్యవసరంలేని యాప్‌ల నుంచి నోటిఫికేషన్లను నిలిపివేయండి.
  • ఒక నిర్దిష్ట వ్యవధి వరకు ఖర్చులను పూర్తిగా నివారించడం వంటి కొత్త వ్యూహాలను అనుసరించండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని