Apple: భారత్‌లో యాపిల్‌ తొలి స్టోర్‌ ప్రారంభం.. స్వయంగా తలుపులు తెరిచిన టిమ్‌ కుక్‌

Apple: భారత్‌లో తొలి రిటైల్‌ స్టోర్‌ అయిన యాపిల్‌ బీకేసీని సీఈఓ టిమ్‌ కుక్‌ ప్రారంభించారు. ఆయన స్వయంగా స్టోర్‌ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు.

Updated : 18 Apr 2023 14:55 IST

ముంబయి: భారత్‌లో యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌ (Apple retail Store) ప్రారంభమైంది. కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) స్వయంగా తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ‘యాపిల్‌ బీకేసీ’ (Apple BKC) పేరిట ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో వేగంగా విస్తరించేందుకు సిద్ధమైన యాపిల్‌.. అందులో భాగంగా రిటైల్‌ స్టోర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెండో స్టోర్‌ ‘యాపిల్‌ సాకేత్‌’ను దిల్లీలో తెరవనున్నారు.

ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్‌ జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో యాపిల్‌ బీకేసీని ఏర్పాటు చేశారు. 20,800 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో కస్టమర్లు యాపిల్‌ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయొచ్చు. అలాగే ఇతర సేవలను కూడా పొందొచ్చు. ఈ స్టోర్‌ను ప్రారంభించడం కోసం కుక్‌ సోమవారమే ముంబయికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి ‘వడా పావ్‌’ ఆరగించారు.

యాపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి. భారత్‌లో విస్తరణకు భారీ అవకాశాలు ఉన్న నేపథ్యంలో యాపిల్‌ ఇక్కడి మార్కెట్‌పై దృష్టి సారించింది. అందులో భాగంగా తయారీని చైనా నుంచి భారత్‌కు తరలిస్తోంది. విక్రయాలు సైతం భారీగా పుంజుకుంటున్న నేపథ్యంలో స్టోర్లను ప్రారంభించడం వల్ల మరింత మంది కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. 

గత ఏడాది సెప్టెంబరు నాటికి భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో యాపిల్‌ వాటా 40 శాతం. శాంసంగ్‌, వన్‌ప్లస్‌ కంటే కూడా ఇది అధికం. మరోవైపు మొత్తం యాపిల్‌ ఉత్పత్తుల్లో మూడు శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. వీటిని వచ్చే కొన్నేళ్లలో ఐదు శాతానికి పెంచాలని కంపెనీ వ్యూహాలు రచిస్తోంది. భారత్‌లో ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్‌, విస్ట్రాన్‌ ఐఫోన్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఎయిర్‌పాడ్స్‌, ఐప్యాడ్స్‌ను కూడా ఫాక్స్‌కాన్‌ తయారు చేసే యోచనలో ఉంది.

యాపిల్‌ బీకేసీ ప్రత్యేకతలు..

 కస్టమర్లు ఈ స్టోర్‌ మొత్తం కలియదిరిగి తమకు నచ్చిన యాపిల్‌ ప్రొడక్ట్‌ డెమోను అడిగి తీసుకోవచ్చు. డివైజ్‌లను ఆపరేట్‌ చేయడంలో అక్కడ ఉండే యాపిల్‌ ప్రతినిధులు కస్టమర్లకు సాయం చేస్తారు. స్టోర్‌లోనే ఒక బృందం నిరంతరం యాపిల్‌ ఉత్పత్తులపై అవగాహనా సెషన్లను నిర్వహిస్తుంటుంది.

దాదాపు 100 మంది యాపిల్‌ ప్రతినిధులు దీంట్లో పనిచేస్తారు. యాపిల్‌ ప్రొడక్ట్‌లకు సంబంధించి ఎలాంటి సేవలనైనా అందిస్తారు. మొత్తం 20 భారతీయ భాషల్లో మాట్లాడే ప్రతినిధులు అందుబాటులో ఉంటారు.

ఈ స్టోర్‌ నుంచి ‘యాపిల్‌ పికప్‌’ సర్వీస్‌ను కూడా అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి కస్టమర్లు తమకు కావాల్సిన చోట యాపిల్‌ ఉత్పత్తులను డెలివరీ తీసుకోవచ్చు.

ఈ స్టోర్‌ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంపైనే నడుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. స్టోర్‌లో ఎక్కడా శిలాజ ఇంధనాలను వినియోగించబోరని యాపిల్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని